నాగలక్ష్మి (ఫైల్)
అహోబిలం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ గూండాల ఘాతుకం
గురువారం అహోబిలం పోలింగ్ కేంద్రంపై టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ, గూండాల దాడి
వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థులు ఏజెంట్లపై విరుచుకుపడ్డ టీడీపీ గూండాలు
పోలింగ్ ఏజెంటుగా ఉన్న తన కుమారుడిని కొడుతుండగా అడ్డుకున్న నాగలక్ష్మి
ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసిన టీడీపీ గూండాలు
తీవ్ర గాయాలతో కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి నాగలక్ష్మి మృతి
టీడీపీ గూండాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆస్పత్రి వద్ద వైఎస్సార్‌సీపీ నేతలు, గ్రామస్తుల ఆందోళన
ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. పోలీసుల మోహరింపు
ఇది సహజ మరణమన్న డీఎస్పీ ప్రకటనపై నిరసనలు
ఆళ్లగడ్డ/కర్నూలు: అధికార మదంతో టీడీపీ గూండాలు సాగించిన అరాచకానికి ఓ నిండు ప్రాణం బలైంది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలం గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ‘పచ్చ’మూకల చేతిలో దారుణ దాడికి గురైన బైరి నాగలక్ష్మి (55) కర్నూలులోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి ప్రాణాలు విడిచింది. ఈ విషయం తెలియగానే గ్రామస్తులు, వైఎస్సార్‌సీపీ నాయకులు ఆస్పత్రి వద్దకు వెళ్లారు. ఆమె మృతిని పోలీసులు సహజ మరణంగా పేర్కొంటూ మృతదేహాన్ని తరలించేందుకు యత్నించడంపై వైఎస్సార్‌సీపీ నాయకులు, గ్రామస్తులు అభ్యంతరం తెలిపారు.
ఆమె మృతిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేంతవరకు మృతదేహాన్ని తరలించకూడదని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి, ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే బిజేంద్రనాథ్ రెడ్డి (గంగుల నాని) ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాంభూపాల్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, బిజేంద్రనాథ్ రెడ్డి తదితరులు గ్రామస్తులతో కలిసి ఆళ్లగడ్డ రూరల్ ఎస్‌ఐని కలిశారు.
నాగలక్ష్మి మృతిపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రాన్ని సమర్పించారు. నాగలక్ష్మి మృతి విషయం తెలియగానే ఆళ్లగడ్డ నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలోని టీడీపీ శ్రేణులు అందరూ ఇళ్లకు తాళాలు వేసి కుంటుంబాలతో సహా వెళ్లిపోయారు. సెల్ ఫోన్లూ స్విచాఫ్ చేసేశారు. అధికారులు పట్టణంతో పాటు అహోబిలం పరిసర ప్రాంతాల్లో అదనపు పోలీస్ బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

పోలింగ్ కేంద్రంలో టీడీపీ గూండాల వీరంగం
పంచాయతీ ఎన్నికల సందర్భంగా గురువారం అహోబిలం పోలింగ్ కేంద్రంలోని ఓ బూత్‌లో నాగలక్ష్మి కొడుకు వినోద్ వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థి తరపున ఏజెంట్‌గా కూర్చున్నాడు. పోలింగ్ సాఫీగా జరుగుతున్న సమయంలో టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ, ఆమె తమ్ముడు విఖ్యాత్‌రెడ్డి, 40 మందికి పైగా టీడీపీ గూండాలు ఒక్కసారిగా పోలింగ్ కేంద్రంలోకి జొరబడ్డారు. రిగ్గింగ్ చేసుకునేందుకు వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై కర్రలు, రాడ్లతో దాడి చేశారు.
అదే సమయంలో ఓటు వేసేందుకు వచ్చిన బైరి నాగలక్ష్మి తన కొడుకును కొడుతుండటం చూసి అడ్డుకోబోయింది. దీంతో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు ఆమెను కాళ్లు, చేతులతో తన్నుకుంటూ బయటకు ఈడ్చుకొచ్చారు. తీవ్రంగా గాయపడ్డ ఆమె బయటకు రాగానే అప్పటికే టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డ మహిళలు రక్తపు మడుగులో కొట్టుకుంటుండటం చూసి, అక్కడే కుప్పకూలిపోయింది. స్పృహ కోల్పోయిన ఆమెను వెంటనే కారులో కర్నూలులో ఆస్పత్రికి తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసింది.
ఖాకీల తీరుపై విమర్శల వెల్లువ
టీడీపీ గూండాలు బహిరంగంగా జరిపిన దాడిలో నాగలక్ష్మి తీవ్రంగా గాయపడటం అందరూ చూసిందే. అయినా, ఆళ్లగడ్డ డీఎస్పీ రవికుమార్ మాత్రం ఇది ‘సహజ మరణం’ అని చెప్పడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నాగలక్ష్మి సంఘటన స్థలంలోనే లేదని, దాడి జరగలేదని, అనారోగ్యం వల్లే మరణించిందని డీఎస్పీ ప్రకటించడం తీవ్ర వివాదాస్పదమైంది. సాక్షాత్తు జిల్లా ఎస్పీ, పదుల సంఖ్యలో పోలీసు అధికారుల ఎదుటే నాగలక్ష్మి పై దాడి జరిగింది. ఈ దాడి, ఆమె కుప్పకూలిపోవడం కొన్ని వందల వీడియోల్లోనూ కనిపిస్తోంది. దాడిలో నాగలక్ష్మి గాయపడిందని అదే రోజు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయినా పోలీసులు అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి నిజాలు కప్పిపుచ్చుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


