రాజధానిలో చదరపు అడుగు నిర్మాణానికి రూ.30 వేలా..?
సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం
అదిరిందయ్యా చంద్రబాబూ.. నీ కలెక్షన్ రేటు.. నీ కరప్షన్ రేటు..
మెట్రో నగరాల్లో ఫైవ్‌స్టార్ భవనాలకూ చదరపు అడుగు రూ.5 వేల లోపే
అమరావతిలో మాత్రం చదరపు అడుగుకు రూ.29,340.. ఇదేం స్పెషల్ రేటు?
అంతర్జాతీయ నిర్మాణాలా? అంతర్జాతీయ స్థాయి అవినీతా?
ప్రజలపై అప్పులు.. మీ వాళ్లకు కాంట్రాక్టులు.. మీకు ముడుపులు!
కొత్త సచివాలయ భవనాల నిర్మాణంలో దోపిడీని సాక్ష్యాధారాలతో ఎత్తిచూపిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణ పనుల్లో చంద్రబాబు చేస్తున్న దోపిడీపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త సచివాలయ భవనాల నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.30 వేలు వ్యయం చేస్తుండటాన్ని ఎత్తిచూపుతూ.. ‘బంగారంతో కడుతున్నావా..?’ అంటూ సీఎం చంద్రబాబును నిలదీశారు. రాజధాని అమరావతిలో నీ ‘కలెక్షన్ రేటు’.. నీ ‘‘కరప్షన్ రేటు’’ అదిరిందయ్యా.. నారా చంద్రబాబునాయుడు అంటూ ధ్వజమెత్తారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై లాంటి మెట్రో నగరాల్లో సైతం ఫైవ్‌స్టార్ సదుపాయాలతో కూడా చదరరపు అడుగుకు రూ.5 వేలు మించి లేదు.. మరి చంద్రబాబుగారూ!అమరావతిలో ఈ స్పెషల్ రేటు ఏంటి? అంటూ నిలదీశారు.
అవి.. అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణాలా? లేక ఇంటర్నేషనల్ స్థాయి అవినీతా? అంటూ సూటిగా ప్రశ్నించారు. ‘ప్రజల నెత్తిన అప్పులు.. మీ వాళ్లకు భారీ కాంట్రాక్టులు.. మీకేమో ముడుపులు.. ఇదీ అమరావతిలో జరుగుతున్న మాయ’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొత్త సచివాలయ భవనాల నిర్మాణంలో దోపిడీని సాక్ష్యాధారాలతో సహా బహిర్గతం చేస్తూ ‘ఎక్స్’లో తన ఖాతాలో శనివారం వైఎస్ జగన్ చేసిన పోస్టు సంచలనం రేపుతోంది. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే..
‘‘అమరావతిలో నీ ‘కలెక్షన్ రేటు’, నీ ‘‘కరప్షన్ రేటు’’ అదిరిందయ్యా నారా చంద్రబాబునాయుడు!
ఎస్‌ఎఫ్‌టీకి రూ.30 వేలా? ఏంటి బాబూ బంగారంతో కడుతున్నావా?
2018లో కొత్త సచివాలయ భవనాల నిర్మాణ వ్యయం – రూ.2,271 కోట్లు.
2024లో అధికారంలోకి రాగానే టెండర్ల రద్దు, భారీగా అవే బిల్డింగులకు అంచనాల పెంపు.
2025 ఏప్రిల్‌లో మళ్లీ అవే కంపెనీలకు, అవే పనులు.
ఈసారి కాంట్రాక్టు విలువ ఏకంగా రూ.4,689 కోట్లకు పెంపు.
ఇప్పుడు మళ్లీ అవే పనులకు, మళ్లీ అంచనాల పెంపు.
మొత్తం విలువ రూ.6,641 కోట్లు.
దీనికి అదనంగా అద్దాలు, ఏసీలు సహా ఇతర పనులకు మరో రూ.4,830 కోట్లు.
ఇప్పటికి ఆ 5 భవనాలు, 52.20 లక్షల ఎస్‌ఎఫ్‌టీ నిర్మాణ వ్యయం – రూ.15,317 కోట్లు!
అంటే చంద్రబాబూ అమరావతిలో నీ స్పెషల్ రేటు.. ఎస్‌ఎఫ్‌టీకి రూ.29,340 ఏంటి? ఏమైనా బంగారంతో కడుతున్నావా? పైగా ఇసుక ఫ్రీ, కరెంటు ఛార్జీల్లో రాయితీలు, సీనరేజ్, న్యాక్ ఛార్జీల మినహాయింపు.
కడుతున్నది ఉద్యోగులు పనిచేసే భవనాలే కదా బాబూ? బెంగళూరు, హైదరాబాద్, చెన్నై లాంటి మెట్రో నగరాల్లో సైతం ఫైవ్‌స్టార్ సదుపాయాలతో కూడా ఎస్‌ఎఫ్‌టీకి రూ.5 వేలు మించి లేదు. మరి చంద్రబాబుగారూ! అమరావతిలో ఈ స్పెషల్ రేటు ఏంటి? అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణాలా? లేక ఇంటర్నేషనల్ స్థాయి అవినీతా? ప్రజల నెత్తిన అప్పులు. మీ వాళ్లకు భారీ కాంట్రాక్టులు మీకేమో ముడుపులు. ఇది అమరావతిలో జరుగుతున్న మాయ!
అదిరిందయ్యా చంద్రబాబూ నీ లూటీ తంత్రం’’ అని జగన్ పేర్కొన్నారు.

రాజధాని నిర్మాణ వ్యయాలకు సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం వివిధ సందర్భాలలో జారీ చేసిన జీవోలు


