ఇల్లూరు గ్రామ వ్యూ
మూడో దశలో కడప జిల్లా ఇల్లూరు గ్రామ పంచాయతీకి ఎన్నికలు
కూటమి గూండాల దౌర్జన్యాలు, రిగ్గింగ్ జరిగే ప్రమాదం ఉందని న్యాయస్థానం తలుపు తట్టిన 420 మంది ఓటర్లు
స్వేచ్ఛగా ఓటు వేసేలా రక్షణ కల్పించాలని హైకోర్టులో పిటిషన్
వారికి పూర్తి స్థాయి భద్రత కల్పించాలని ఆదేశించిన న్యాయస్థానం
ఏదైనా జరిగితే కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవని పోలీసులకు హెచ్చరిక
జమ్మలమడుగు: వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం ఇల్లూరు గ్రామస్తులు ఓటు హక్కు కోసం హైకోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వెన్నుపోటు పార్టీ కూటమి గూండాల దౌర్జన్యాలు, పోలీసుల అండతో రిగ్గింగ్ జరిగే ప్రమాదం ఉందని పేర్కొంటూ న్యాయస్థానం తలుపు తట్టారు. మూడవదశలో భాగంగా డిసెంబర్ 2న ఇల్లూరు గ్రామంలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.
గ్రామంలోని 600 పైగా ఓట్లు ఉండగా, ఇందులో 420 మంది ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు గాను, ఇంటి నుంచి బయలుదేరి తిరిగి గుమ్మం చేరే వరకు పూర్తి స్థాయిలో తమకు రక్షణ కల్పించాలని కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన హైకోర్టు వారికి అనుకూలంగా తీర్పునిస్తూ.. ఓటర్లకు భద్రత కల్పించి సురక్షితంగా ఇంటికి చేర్చే బాధ్యత పోలీసులదేనని, ఏదైనా జరిగితే కోర్టు ధిక్కరణ కింద చర్యలు తప్పవని హెచ్చరించింది.
ఏకగ్రీవం కాని ఏకైక గ్రామంగా ...
జమ్మలమడుగు నియోజకవర్గంలోని 115 పంచాయతీల్లో వెన్నుపోటు పార్టీ కూటమి నేతల ఒత్తిళ్లతో అధిక శాతం పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఈ క్రమంలోనే ఎర్రగుంట్ల మండలంలోని 17 పంచాయతీల్లో 16 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన ఏకైక పంచాయతీ ఇల్లూరుకు డిసెంబరు 2న ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో ఇక్కడి నుంచి వందలాది మంది స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించు కునేలా రక్షణ కల్పించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించడం అరుదైన ఘటనగా నిలిచింది. ఇల్లూరులో తీవ్ర ఒత్తిళ్లు ఉండటంతోనే 420 మంది ఓటర్లు రక్షణ కోసం కోర్టును ఆశ్రయించారని మోపూరి దస్తగిరి రెడ్డి తెలిపారు.
దౌర్భాగ్య స్థితిలో ఎన్నికలు
కూటమి నాయకులు ఓడిపోతామనే భయంతో పోలీసులు, ఆర్వోలు, దేవగుడి కుటుంబ సభ్యులతో కలిసి దౌర్జన్యాలతో ఏకగ్రీవాలు, రిగ్గింగ్‌లకు పాల్పడుతున్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడటంతోనే ఇల్లూరు గ్రామస్తులు కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. – పి.రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ
కోర్టు ఆదేశాలతో నామినేషన్ వేశా
కూటమి గూండాలు అడ్డుకుంటే, కోర్టు ఆదేశాలతోనే నామినేషన్ వేశాను. డిసెంబర్ 2న దాడులు చేసి రిగ్గింగ్ చేస్తారన్న భయంతోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. – మోపూరి రమాదేవి, వైఎస్సార్‌సీపీ మద్దతు సర్పంచ్ అభ్యర్థి


