ఖాజీపేట: పచ్చని పంటపొలాలు, కాలుష్యరహిత ఆహ్లాదకర వాతావరణం, ఎత్తయిన కొండల నడుమ ప్రకృతి రమణీయతకు నెలవుగా ఖాజీపేట నాగనాథేశ్వర స్వామి క్షేత్రం అలరారుతోంది. మండల కేంద్రం నుంచి 5 కిలోమీటర్ల దూరంలోని కొండపై కొలువైన నాగనాథేశ్వరుడు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా భక్తుల హృదయాల్లో నిలిచిపోయారు. కార్తీక మాసంలోని మూడో సోమవారం సందర్భంగా స్వామివారి దర్శనానికి వేలాదిగా తరలిరానున్న భక్తుల కోసం ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
స్వయంభూలింగంగా అవతారం..
కొండపై వెలసిన నాగనాథేశ్వరుడు స్వయంభూలింగంగా భక్తులకు దర్శనమిస్తున్నారు. పూర్వం కొండపై గొర్రెల కాపరులు సంచరిస్తున్న సమయంలో ఈ శివలింగాన్ని గుర్తించి పూజలు ప్రారంభించారు. కాలక్రమేణా భక్తుల తాకిడి పెరగడంతో, వారంతా చందాలు వేసుకుని గర్భగుడిని నిర్మించారు. అనంతరం పార్వతీ దేవి అమ్మవారిని ప్రతిష్టించి ప్రత్యేక ఆలయాన్ని, కొండపైకి చేరుకునేందుకు మెట్ల మార్గాన్ని భక్తులే నిర్మించుకున్నారు.
రుషుల తపస్సు.. బౌద్ధ ఆనవాళ్లు..
కొండపై ఉన్న శ్రీనేలమాలిగశ్రీపూర్వం రుషుల తపస్సుకు, జ్ఞానబోధనకు కేంద్రంగా ఉండేదని పెద్దలు చెబుతుంటారు. ప్రశాంత వాతావరణం కారణంగా నేటికీ ఇది సాధువులకు నిలయంగా ఉంటోంది. గతంలో ఈ నేలమాలిగ నుంచి ఒక పెద్ద సొరంగ మార్గం ఉండేదని, కాలక్రమేణా అది పూడిపోయిందని స్థానికుల కథనం. అలాగే, ఈ కొండపై బౌద్ధమత ఆనవాళ్లు కూడా పురావస్తు పరిశోధనల్లో బయటపడటం విశేషం. ఆ చారిత్రక అవశేషాలను అధికారులు మ్యూజియంలో భద్రపరిచారు.
భక్తులు, దాతల సహకారంతో అభివృద్ధి..
ఆలయ అభివృద్ధిలో భక్తులే కీలక పాత్ర పోషిస్తున్నారు. కోరికలు నెరవేరిన భక్తులు మొక్కుబడుల రూపంలో అందించిన విరాళాలతో పాటు, రావులపల్లెకు చెందిన గంగవరం రామిరెడ్డి ఆధ్వర్యంలో కొండ దిగువన, పైన పలు అభివృద్ధి పనులు జరిగాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి చొరవతో రూ.60 లక్షలతో కొండపైకి సీసీ రోడ్డు నిర్మించడంతో వాహనాలు నేరుగా ఆలయం వద్దకు చేరుకుంటున్నాయి. ప్రస్తుతం దేవదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో, భక్తుల విరాళాలతో నిరుపయోగ భవనాలను తొలగించి విశాలమైన ప్రాంగణం, రక్షణ గోడ నిర్మించారు. పాత అమ్మవారి ఆలయం స్థానంలో నూతన ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. నేలమాలిగ వద్ద తలనీలాలు సమర్పించేందుకు, అన్నదానానికి ప్రత్యేక వసతులు కల్పించారు.
52 ఏళ్లుగా నిత్య అన్నదానం..
క్షేత్రానికి వచ్చే భక్తుల ఆకలి తీర్చేందుకు ఖాజీపేట ఆర్యవైశ్యులు 1974లో వల్లంకొండు వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో అన్నసత్రాన్ని ప్రారంభించారు. గడిచిన 52 సంవత్సరాలుగా ప్రతి సోమవారం ఇక్కడ అన్నదానం నిర్వహిస్తున్నారు. 52 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఇటీవల సుమారు రూ.కోటి వ్యయంతో ఆర్యవైశ్యులు నూతన అన్నసత్ర భవనాన్ని నిర్మించారు. వీరితో పాటు మండలంలోని పలువురు దాతలు కార్తీక సోమవారాల్లో భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నారు.
భక్తుల కొంగు బంగారం ఖాజీపేట
నాగనాథేశ్వరుడు
కార్తీక మూడో సోమవారానికి
సర్వం సిద్ధం


