చాపాడు : మండలంలోని చిన్నగురువలూరు పంచాయతీ సర్పంచ్ స్థానానికి ఇద్దరు వైఎస్సార్సీపీ మద్దతుదారులు దాఖలు చేసిన నామినేషన్లను తిరస్కరించి ఫోర్జరీ సంతకాలతో టీడీపీ మద్దతుదారుడికి గెలిచినట్టు ధ్రువీకరణ పత్రం ఇచ్చిన ఆర్ఓ వీరారెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి డిమాండ్ చేశారు. చిన్నగురువలూరు సర్పంచ్ స్థానానికి వైఎస్సార్సీపీ మద్దతుదారులైన జంబారపు జాంతన్, అతని కుమారుడు శాంతి స్వరూప్ నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణ సమయం ముగిసనప్పటికీ అర్ధరాత్రి దొంగ సంతకాలతో ఆర్ఓ ఉపసంహరణ చేశారని మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డితో కలసి శనివారం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఏఎస్ఐ బాలయ్య, ఎంపీడీఓ కార్యాలయ ఏఓ కృష్ణకుమారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ ఇటీవల జరిగిన మున్సిపాలిటీ, స్థానిక సంస్థల, మేయర్ ఎన్నికల్లో కూటమి పార్టీకి చెందిన అభ్యర్థులు అరాచకాలు సృష్టించి గెలిచినట్టు డిక్లేర్ చేసుకున్నారు. కడపలో జరిగిన ఎన్నికల్లో సైతం వారి అరాచకాలను స్వయంగా జిల్లా కలెక్టర్ స్థాయి నుంచి కింది స్థాయి అధికారులు చూసినా పట్టించుకోని సంఘటనలు కల్లారా చూశామన్నారు. ప్రస్తుతం జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో మైదుకూరు నియోజకవర్గంలోని 90 స్థానాల్లో వైఎస్సార్సీపీ సానుభూతిపరులు అనేక చోట్ల నామినేషన్లు వేశారన్నారు. అడ్వకేట్లు, పెద్ద చదువులు చదువుకున్న వారి నామినేషన్లను చదువు సంధ్య లేని వారిలా రిటర్నింగ్ అధికారులు వ్యవహరిస్తూ పరిశీలనలో తొలగించారన్నారు. ఉపసంహరణ రోజు కూడా సమయం ముగిసినా ఆర్ఓలు అత్యంత దారుణాలకు పాల్పడి నామినేషన్లను తీసివేయడం దుర్మార్గమన్నారు. జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, ఎంపీడీఓలకు చిత్తశుద్ధి, నిజాయితీ, దమ్ము, ధైర్యం ఉంటే క్లస్టర్ కేంద్రాల్లో ఉన్న సీసీటీవీ పుటేజీలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీకి కంచుకోట అయిన చిన్నగురువలూరు స్థానానికి నామినేషన్ వేసిన తమ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను ఫోర్జరీ సంతకాలు చేసి తొలగించారని, సీసీ కెమెరాలను చూసి చర్యలు తీసుకోవాలని లేకుంటే టీడీపీ వారి మోచేతుల కింద ఉన్నట్లేనని విమర్శించారు. కూటమి ప్రభుత్వానికి ప్రజల చేత గెలిచే దమ్ము, ధైర్యం లేక పోలీసుల చేత భయబ్రాంతులకు గురిచేస్తూ గెలుస్తున్నారన్నారు. ఏ ఎన్నిక జరిగిన వైఎస్సార్సీపీ ప్రభంజనానికి కూటమి ప్రభుత్వం తట్టుకోలేదన్నారు. ఈ క్రమంలో పోలీసులు, రెవెన్యూ, పంచాయతీ అధికారులు కూటమి అండతోనే కూటమి ప్రభుత్వం నడుస్తోందన్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అనేక తప్పులు, వైఫల్యాలపై అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వ అరాచకాల పట్ల ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని మళ్లీ మళ్లీ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నామని మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ లక్షుమయ్య, వైఎస్సార్సీపీ నాయకులు సీవీ సుబ్బారెడ్డి, వెంకటసుబ్బారెడ్డి, కిశోర్ కుమార్‌రెడ్డి, శివారెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, వీరారెడ్డి, చంద్ర, బా గంగయ్య, వెంకట్‌రెడ్డి, రాజు, శ్రీనివాసులు రెడ్డి, మహేష్ యాదవ్, ఫైలెట్ సుబ్బారెడ్డి, శ్రీధర్, చిన్న గురువలూరు గ్రామస్తులు పాల్గొన్నారు.
ఫోర్జరీ సంతకాలతో నామినేషన్ల ఉపసంహరణపై వైఎస్సార్సీపీ ఆగ్రహం
సీసీ ఫుటేజీ బయటపెట్టి
చర్యలు తీసుకోవాలి
మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి డిమాండ్


