నిష్పక్షపాత ఎన్నికలు నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

నిష్పక్షపాత ఎన్నికలు నిర్వహించాలి

Nov 29 2026 12:32 AM | Updated on Nov 29 2026 12:32 AM

● ఎస్పీ నచికేత్‌ విశ్వనాథ్‌కు సతీష్‌రెడ్డి వినతి

వేంపల్లె: వేంపల్లె గ్రామపంచాయతీ ఎన్నికలను పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగారెడ్డి సతీష్‌ కుమార్‌ రెడ్డి జిల్లా ఎస్పీ నచికేత్‌ విశ్వనాథ్‌ను కోరారు. శనివారం సర్పంచ్‌ అభ్యర్థి షబ్బీర్‌ వలితో కలిసి వేంపల్లె పోలీస్‌ స్టేషన్‌కు విచ్చేసిన జిల్లా ఎస్పీని ఆయన కలిసి మాట్లాడారు. పులివెందుల నియోజకవర్గంలో గతంలో జరిగిన ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం సతీష్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గతంలో పోలీసులు తమను అడ్డుకుని నామినేషన్లు వేయకుండా చేశారని ఆరోపించారు. అలాంటి పరిస్థితులు వేంపల్లెలో పునరావృతం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశామన్నారు. వేంపల్లెలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో పోలీసులను మోహరించడంపై ప్రజల్లో అనేక అపోహలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. అధికార పార్టీకి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారనే భావన ప్రజల్లో నెలకొందని చెప్పారు. ఎన్నికల విధుల్లో పోలీసులు చట్టానికి లోబడి, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా పనిచేస్తూ.. ప్రజలు ఎలాంటి భయం, ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణం కల్పించాలని కోరామన్నారు. అయితే, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణపై ఎస్పీ నుంచి స్పష్టమైన హామీ లభించలేదని, శ్రీచూస్తాం.. చేస్తాం.. పరిశీలిస్తాంశ్రీ అంటూ సమాధానమిచ్చారని ఆయన వెల్లడించారు.

పోలీసుల ప్రతిష్టను దిగజార్చొద్దు..

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీస్‌ శాఖ వ్యవహారశైలిపై సతీష్‌ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు బందిపోట్ల కంటే అధ్వానంగా ప్రవర్తించడం దారుణమన్నారు. ఒకరిద్దరు ఉన్నతాధికారుల మెప్పు, ప్రమోషన్లు, డబ్బు కోసం మొత్తం పోలీస్‌ శాఖ ప్రతిష్టను దిగజార్చుతూ కిందిస్థాయి సిబ్బందిని బలిచేయడం తగదని హితవు పలికారు. కొందరు డీఐజీల తీరు చూస్తుంటే భవిష్యత్తులో బ్యాంకులు లూటీ చేసే పరిస్థితి వస్తుందేమోనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీరి తీరుకు సహకరిస్తే చివరకు ఇళ్లల్లోకి చొరబడి దౌర్జన్యం చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. శుక్రవారం బద్వేల్‌లో జరిగిన ఎన్నికల స్ఫూర్తితో రెండో విడతలో పులివెందుల ప్రాంతంలోనూ ప్రశాంతంగా పోలింగ్‌ జరిగేలా కానిస్టేబుల్‌ నుంచి డీఎస్పీ వరకు నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఓటర్లు భయపడకుండా పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సతీష్‌ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఓటింగ్‌లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ రవికుమార్‌ రెడ్డి, సర్పంచ్‌ అభ్యర్థి షబ్బీర్‌ వల్లి, మాజీ సర్పంచ్‌ విష్ణు వర్ధన్‌ రెడ్డి, ఆర్‌ శ్రీనివాసులు, వైఎస్సార్‌సీపీ నాయకులు సాదక్‌ వల్లి, రుద్ర భాస్కర్‌ రెడ్డి, మిలటరీ రెడ్డయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement