83.52 లక్షల గ్రామీణ ఓటర్ల 'తీర్పు నేడు' | Elections in 3880 Gram Panchayats in the second phase | Sakshi
Sakshi News home page

83.52 లక్షల గ్రామీణ ఓటర్ల 'తీర్పు నేడు'

Nov 29 2026 3:08 AM | Updated on Nov 29 2026 3:08 AM

Elections in 3880 Gram Panchayats in the second phase

రెండో విడతలో 3,880 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు 

ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే ఎక్కువ చోట్ల ఎన్నికలు 

ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్‌ 

మధ్యాహ్నం 2 గంటల నుంచి ఎక్కడికక్కడే ఓట్ల లెక్కింపు

సాక్షి, అమరావతి: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ఆదివారం జరగనుంది. 83,52,338 మంది ఓటర్లు తీర్పు వెలువరించనున్నారు. 3,880 గ్రామ పంచాయతీల్లో సర్పంచి, వార్డు సభ్యుల పదవులకు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఎక్కడికక్కడే ఓట్ల లెక్కింపు చేపడతారు. 41.05 లక్షల మంది పురుష ఓటర్లు, 42.46 లక్షల మంది మహిళా ఓటర్లు వారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 

నాలుగు గ్రామీణ మండలాలే ఉన్న విశాఖపట్నం జిల్లా మినహా మిగిలిన 27 జిల్లాల్లో రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడతలో 4,975 పంచాయతీల్లో ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ కాగా, 1170 గ్రామాల్లో సర్పంచి పదవులు ఏకగ్రీవమయ్యాయి. 1095 పంచాయతీల్లో  సర్పంచి పదవులతో పాటు గ్రామంలోని వార్డు సభ్యుల పదవులన్నీ ఏకగ్రీవమయ్యాయని అధికారులు తెలిపారు. రెండు చోట్ల సర్పంచి పదవులకు ఎవరూ నామినేషన్లు వేయలేదు. దీంతో 3,803 గ్రామాల్లో సర్పంచి పదవులకు, 3,880 పంచాయతీల్లో వార్డులకు ఎన్నికలు జరుగుతున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ పేర్కొంది. 

రెండో విడతలో అత్యధికంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో సర్పంచి పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోనే 342 పంచాయతీల్లో, విజయనగరం జిల్లాలో 244 సర్పంచి పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. రెండో విడతలో అత్యల్పంగా పల్నాడు జిల్లాలో 52 పంచాయతీల్లో పోలింగ్‌ జరుగుతుంది. గుంటూరు, మార్కాపురం, బాపట్ల,  వైఎస్సార్‌కడప, పశ్చిమ గోదావరి జిల్లాలో వంద లోపు పంచాయతీల్లోనే ఈ విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి.

తక్కువగానే సీసీ కెమెరాలు 
మూడు రోజుల కిందట జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికలతో సహా ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తీవ్ర హింస్మాత్మక సంఘటనలు జరుగుతున్నప్పటికీ, అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవడంలేదు. పోలింగ్‌ కేంద్రాల వద్ద భద్రత, ఓటర్లకు రక్షణపై నిర్లక్ష్యం చూపుతున్నారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కేవలం మూడో వంతు పోలింగ్‌ కేంద్రాల వద్ద మాత్రమే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది.  మిగిలిన చోట్ల స్థానికంగానే ఏర్పాట్లు చేసుకోవాలంటూ జిల్లా అధికారులకు ఆదేశాలిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement