బ్యాంకు డిపాజిట్ల వడ్డీ రేట్లకు రెక్కలు! | Interest rates on bank deposits get a boost | Sakshi
Sakshi News home page

బ్యాంకు డిపాజిట్ల వడ్డీ రేట్లకు రెక్కలు!

Nov 29 2026 3:24 AM | Updated on Nov 29 2026 3:24 AM

Interest rates on bank deposits get a boost

అక్టోబర్‌లో పావు శాతం పెంచిన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

ద్రవ్యోల్బణ కట్టడికి డిసెంబర్‌లో మరోమారు పెంపునకు సిద్ధం

ఇప్పటికే సీనియర్‌ సిటిజన్స్‌కు 8.5 శాతం పైన వడ్డీ అందిస్తున్న పలు బ్యాంకులు 

రానున్న కాలంలో ఈ వడ్డీ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందంటున్న నిపుణులు 

సాక్షి, అమరావతి: వడ్డీరేట్ల పెరుగుదలతో బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు మళ్లీ ఆకర్షణీయంగా మారుతున్నా­యి. గత కొంతకాలంగా ఆరు, ఏడు శాతం దిగు­­వ­కు చేరి ఆకర్షణ కోల్పోయిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రేట్లు ఇప్పుడిప్పుడే తిరిగి పెరుగుతున్నాయి. ఇప్పటికే చాలా స్మాల్‌ ఫైనాన్స్‌ కంపెనీలు సీనియర్‌ సిటిజన్స్‌కు 8 శాతంపైన వడ్డీరేట్లు ఆఫర్‌ చేస్తుండగా, ప్రైవేటు బ్యాంకులు, పీఎస్‌యూ (ప్రభుత్వ రంగ) బ్యాంకులు కూడా 7–8 శాతం మధ్య అందిస్తున్నాయి. దీంతో చాలామంది సీనియర్‌ సిటిజన్ల పేరిట ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో బ్యాంకుల వద్ద డిపాజిట్ల రూపంలో రూ.280.5 లక్షల కోట్లు ఉన్నాయి. వడ్డీరేట్లు తక్కువగా ఉండటంతో డిపాజిట్ల వృద్ధిరేటు కూడా తగ్గుతూ వస్తోంది. ఒకానొక సందర్భంలో 18 శాతంగా ఉండే డిపాజిట్ల వృద్ధిరేటు ఇప్పుడు 16.4 శాతానికి పడిపోయినట్లు ఆర్‌బీఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ద్రవ్యోల్బణం కట్టడికి..
నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలొచ్చి ద్రవ్యోల్బణం భారీగా పెరగడంతో దీనిని కట్టడి చేయడానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వడ్డీరేట్ల మార్గాన్ని ఎంచుకుంది. ఇప్పటికే అక్టోబర్‌లో 0.25 శాతం వడ్డీరేట్లు పెంచిన ఆర్‌బీఐ మరో ఆర శాతం వరకు పెంచడానికి సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలిస్తోంది. డిసెంబర్‌ తొలివారంలో జరిగే ఆర్‌బీఐ పరపతి సమీక్షలో వడ్డీరేట్లు మరో పావు శాతం పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. అమెరికా కూడా వడ్డీరేట్లు పెంచుతుండడంతో ఇక్కడ కూడా వడ్డీరేట్లు పెరుగుతాయని, రానున్న కాలంలో మరో అర శాతం వరకు వడ్డీరేట్లు పెరుగుతాయని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

దీంతో సీనియర్‌ సిటిజన్ల వడ్డీరేట్లు తొమ్మిది శాతం పైకి ఎగబాకే అవకాశం ఉందని, డిసెంబర్‌ రెండో వారం తర్వాత నుంచి బ్యాంకులు డిపాజిట్ల వడ్డీరేట్లు పెంచుతాయని అంచనా వేస్తున్నట్లు సమాచారం. అలాగే, మార్చిలో ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి బ్యాంకులు బ్యాలెన్స్‌ షీట్ల నిర్వహణ కోసం ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అధిక వడ్డీ రేటును ఆఫర్‌ చేస్తాయని, కాబట్టి వచ్చే రెండు, మూడునెలల కాలం ఎలాంటి రిస్క్‌లేని బ్యాంకు డిపాజిట్లు ఇన్వెస్ట్‌మెంట్‌కు అనుకూలంగా ఉంటాయని మార్కెట్‌ నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement