స‌న్న ధాన్యానికి క్వింటా రూ. 4 వేల‌కు పైగా ధ‌ర‌ | Fine Grain Paddy Prices in Telangana Latest Update | Sakshi
Sakshi News home page

సన్నాలకు సిరులు.. ఆనందంలో అన్న‌దాత‌లు

Oct 22 2026 6:25 PM | Updated on Oct 22 2026 6:36 PM

Fine Grain Paddy Prices in Telangana Latest Update

నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం రైస్‌ మిల్లుల వద్ద ధాన్యం ట్రాక్టర్లు

మిర్యాలగూడ: ధాన్యం రైతులకు కలిసివస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా సన్నధాన్యానికి క్వింటాకు రూ.4 వేలకుపైగా రికార్డుస్థాయిలో ధర వస్తోంది. సరిగా వర్షాలు కురవకపోవడం, ప్రాజెక్టుల్లో నీరు నిల్వ లేకపోవడం, భూగర్భజలాలు అడుగంటిపోవడంతో వానాకాలంలో పూర్తిస్థాయిలో వరి సాగు చేయలేదు. సాగర్‌ ఆయకట్టులో బోర్లు, బావుల కింద మాత్రమే రైతులు సన్న రకం వరి సాగు చేశారు. సాగు తగ్గడం, ధాన్యం తక్కువగా ఉండటంతో సాగు చేసిన రైతులకు కలిసివస్తోంది.  

నల్లగొండలో 10.51 లక్షల మెట్రిక్‌ టన్నులు 
నల్లగొండ జిల్లాలో 6 లక్షలకు పైగా ఎకరాల్లో వరి సాగవుతుందని సీజన్‌ ప్రారంభంలో అధికారులు అంచనా వేశారు. కానీ 70శాతం (3,60,795) ప్రాంతంలో వరి సాగు చేశారు. 10.51 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేయగా, ఇందులో 4.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని పౌర సరఫరాల శాఖ అధికారులు లెక్కలు వేస్తున్నారు. జిల్లాలో సుమారు 20 వేల ఎకరాలు సాగునీరు లేక ఎండిపోతాయని అంచనా వేశారు. ప్రధానంగా కనగల్, నల్లగొండ ప్రాంతాల్లో 2,500 ఎకరాలు ఎండిపోయినట్లు గుర్తించారు.

సాగు తగ్గడంతో ధాన్యంపై ఆధారపడిన రైస్‌ ఇండస్ట్రీ సన్న ధాన్యానికి ధర పెంచేసింది. వారి మిల్లులు కెపాసిటీకి అనుగుణంగా ధాన్యం (Sanna Dhanyam) కొనుగోలు చేసేందుకు మిల్లర్లు ఇప్పటికే కార్యాచరణ మొదలుపెట్టారు. గోదావరి తీర ప్రాంతంలో ఉన్న నిజామాబాద్‌ జిల్లాలో అత్యధికంగా వరి పంట సాగు చేయడంతో నల్లగొండ జిల్లాకు చెందిన మిల్లర్లు బ్రోకర్ల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. రవాణాతో కలుపుకొని రూ.4 వేలకుపైగా ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పండించిన ధాన్యానికీ ఆ మేరకు ధర చెల్లిస్తున్నారు.  

ఇదీ చ‌ద‌వండి: తెలుగమ్మాయి ప్రతిభ.. మాట్లాడితే ముద్రించే యంత్రం!

రైతుకు మంచి ధర పలుకుతోంది 
 

రైతు పండించిన ధాన్యానికి మిల్లర్లు మంచి ధర పెట్టి కొనుగోలు చేస్తున్నారు. గ్రేడ్‌ను బట్టి క్వింటాకు రూ.3800 నుంచి రూ.4200 వరకు చెల్లిస్తున్నారు. ఇప్పటివకూ ఈ ధర పలకలేదు. ఈసారి సాగు విస్తీర్ణం తగ్గడంతో ఉన్న ధాన్యానికి మిల్లర్లు పోటీపడి కొనుగోలు చేస్తున్నారు. 
- గౌరు శ్రీనివాస్, రైస్‌ మిల్లర్స్‌ అధ్యక్షుడు, మిర్యాలగూడ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement