తెలుగమ్మాయి ప్రతిభ.. మాట్లాడితే ముద్రించే యంత్రం! | Telugu Girl Student Braille Printer Makes Top 20 For James Dyson Award 2026 | Sakshi
Sakshi News home page

తెలుగమ్మాయి ప్రతిభ.. మాట్లాడితే ముద్రించే యంత్రం!

Oct 22 2026 5:55 PM | Updated on Oct 22 2026 6:06 PM

Telugu Girl Student Braille Printer Makes Top 20 For James Dyson Award 2026

ముద్రణా యంత్రంతో హిమజ

అంధ విద్యార్థుల కోసం కొత్త బ్రెయిలీ ముద్రణ యంత్రం

తెలుగమ్మాయి హిమజ రూపకల్పన

30 దేశాలతో పోటీలో ఇదే ఏకైక భారతీయ ప్రాజెక్టు

చూపు లేని వారు చదువుకోవడానికి ఉపయోగించే ప్రత్యేక లిపిని రాయడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఈ సమస్యకు పరిష్కారంగా నోటితో మాట్లాడితే చాలు. వెంటనే ఆ మాటలను గుర్తించి, ప్రత్యేక లిపిలోకి మార్చి, కాగితంపై ముద్రించే యంత్రాన్ని మన తెలుగమ్మాయి హిమజ రూపొందించారు. చూపులేని విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు, వారు ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా చదువుకునేందుకు తయారు చేసిన ఈ సాంకేతిక పరికరం ప్రతిష్టాత్మక జేమ్స్‌ డైసన్‌ అవార్డు (James Dyson Award 2026) రేసులో నిలిచి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది.  

తెలుగమ్మాయి ప్రతిభ
ఆంధ్రప్రదేశ్‌ భీమవరంలోని శ్రీ విష్ణు మహిళా ఇంజనీరింగ్‌ కళాశాలకు చెందిన ఇరవై ఏళ్ల విద్యార్థిని లింగంపల్లి హిమజ (Lingampalli Himaja) ‘రుద్ర’పేరుతో మాట్లాడే బ్రెయిలీ ముద్రణ యంత్రం తయారు చేశారు. చూపులేని పిల్లలు పడే కష్టాలను స్వయంగా చూసిన హిమజ.. వారి సమస్యకు సులువైన పరిష్కారం చూపాలని ఆలోచించారు. మొదట్లో ఆమె ఒక సాధారణ నమూనాను తయారు చేశారు. అయితే ఒక పాఠశాల సందర్శనలో చూపు లేని విద్యార్థి ‘నోటితో మాట్లాడగలిగినప్పుడు, చేతులతో ఎందుకు టైప్‌ చేయాలన్న ప్రశ్న ఆమె ఆలోచనను పూర్తిగా మార్చేసింది. ఆ ప్రశ్నే ఈ మాట్లాడే ముద్రణ యంత్రాన్ని తయారు చేయడానికి తనకు స్ఫూర్తినిచ్చిందని హిమజ చెప్పారు.  

పెద్ద మొత్తంలో బహుమతి
ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల నుంచి వచ్చిన వేలాది ఆవిష్కరణలతో పోటీపడి ఈ పరికరం చివరి దశకు చేరుకుంది. బ్రిటన్, అమెరికా, సింగపూర్‌ వంటి దేశాలకు చెందిన 12 మంది అంతర్జాతీయ ఇంజనీర్ల బందం ఈ పరికరం పనితీరు, రూపకల్పన, సమాజానికి ఇది చేసే మేలును పరిశీలించి ఎంపిక చేశారు. నవంబర్‌ 4న ప్రకటించబోయే తుది విజేతల జాబితాలో నిలిస్తే.. సుమారు రూ.38 లక్షల నగదు బహుమతి లభిస్తుంది. 

ఇదీ చ‌ద‌వండి: తెలుగు యువకుడి బుకింగ్‌ రైడ్‌ యాప్‌

పోటీలో గెలిస్తే వచ్చిన డబ్బుతో ఈ పరికరాన్ని మరింత చిన్నగా, ఆధునికంగా మార్చాలని హిమజ లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే దీని తయారీ ఖర్చును తగ్గించి, ప్రతి విద్యార్థి సొంతంగా కొనుగోలు చేసేలా తక్కువ ధరకు అందించాలన్నదే తన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.

అవసరమైన సాంకేతికత
మనదేశంలో 50 లక్షలపైచిలుకు మంది చూపు­లేని వారున్నారు. వీరంతా చదువుకోవడానికి, ఉద్యోగాలు సంపాదించడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కంప్యూటర్‌ స్క్రీన్‌ మీద ఉన్న విషయాలను చదివి వినిపించే సాఫ్ట్‌వేర్‌లు ఉన్నప్పటికీ, సొంతంగా చదువుకోవడానికి, రాసుకోవడానికి రుద్ర లాంటి పరికరాలు ఎంతో సహాయపడతాయి. గట్టి పోటీ ఉన్నప్పటికీ హిమజ రూపొందించిన పరికరం టాప్‌–20లో నిలవడం విశేషం. 
- సాక్షి, హైదరాబాద్‌

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement