రూటూర్ వ్యవస్థాపకులు నిఖిల్, అక్షయ్, క్రాంతికుమార్
వరంగల్, హనుమకొండ, కాజీపేట్‌లలో రవాణా సేవల యాప్ ప్రారంభం
సాక్షి, వరంగల్: యాప్ ఆధారిత రవాణా సేవల రంగంలో డ్రైవర్లు ఎదుర్కొంటున్న కమీషన్ల భారాన్ని తొలగించడం, ప్రయాణికులకు సర్జ్ ప్రైసింగ్ నుంచి ఉపశమనం కల్పించడం, వారిని సురక్షితంగా గమ్యం చేర్చడం అనే ప్రధాన లక్ష్యాలతో ఓరుగల్లు యువకుడు వంగేటి నిఖిల్ కుమార్, ఇద్దరు మిత్రులతో కలిసి 2023లో ఏర్పాటు చేసిన బుకింగ్ రైడ్ యాప్ రూటూర్ (Rutur).. దసరా పండుగ నేపథ్యంలో వరంగల్, హనుమకొండ, కాజీపేట్ నగరాల్లో కార్యకలాపాలను ప్రారంభించింది. ఓలా, ర్యాపిడో తరహాలో బైక్, ఆటో, క్యాబ్ రవాణా సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్‌లో తొలుత ప్రారంభమైన ఈ సంస్థ కార్యకలాపాలు దేశవ్యాప్తంగా 40కిపైగా నగరాలకు విస్తరించాయి.
అంతర్జాతీయ అనుభవంతో...
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మహ్మదపురం గ్రామానికి చెందిన వంగేటి నిఖిల్ కుమార్ యూకేలో ఎంఎస్సీ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ కోర్సు చేశారు. అనంతరం అక్కడే ఆరేళ్లపాటు రియల్ ఎస్టేట్ మేనేజ్‌మెంట్ రంగంలో ఆపరేషన్స్ మేనేజర్‌గా పనిచేశారు. ఈ అనుభవంతో సొంత సంస్థను ప్రారంభించాలని స్వదేశానికి తిరిగొచ్చారు. రవాణా రంగంలోని సమస్యలను గమనించి డ్రైవర్లపై కమీషన్ల భారం పడకుండా, ప్రయాణికులకు సురక్షితమైన సేవలు అందించే యాప్ రూపొందించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో డిగ్రీలో తన స్నేహితులైన అక్షయ్, గంధం క్రాంతికుమార్‌లతో కలిసి రూటూర్ యాప్‌కు శ్రీకారం చుట్టారు. ఈ సంస్థకు నిఖిల్ సీఈవోగా, క్రాంతికుమార్ సీఓఓగా, అక్షయ్ సీఎఫ్‌వోగా వ్యవహరిస్తున్నారు.
ప్రయాణికుల భద్రతకు పెద్దపీట..
ప్లే స్టోర్, యాప్ స్టోర్‌ల ద్వారా రూటూర్ కెప్టెన్ యాప్‌లో చేరాలనుకొనే డ్రైవర్ల పూర్తి వివరాలు, పోలీస్ క్లియరెన్స్ వంటి పత్రాలను పరిశీలించాకే సంస్థ ఆమోదం తెలుపుతోంది. అలాగే ప్రయాణంలో అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఉపయోగపడేలా ప్రయాణికుల కోసం ఎస్‌వోఎస్ బటన్, లైవ్ లొకేషన్ సదుపాయాలను తీసుకొస్తోంది. డ్రైవర్లకు ప్రయాణికులతో వ్యవహరించే తీరు, ప్రయాణికులను సురక్షిత ప్రాంతాల్లో దింపడం వంటి అంశాలపై శిక్షణ ఇవ్వాలని యోచిస్తోంది. ప్రయాణికులు ప్లే స్టోర్, యాప్ స్టోర్‌ల ద్వారా రూటూర్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని సేవలు పొందేలా ఏర్పాట్లు చేసింది.
ఇదీ చదవండి: కూరగాయల ధరలు కుతకుత
మెయిన్ రోడ్ల నుంచి కాలనీల వరకు దృష్టి..
యాప్ ఆధారిత రవాణా సేవల్లో డ్రైవర్ల సంపాదనలో కొంత కమీషన్లకు పోతోందనే అభిప్రాయం ఉంది. అందుకే జీరో ఫ్రీగా డ్రైవర్లకు వేదిక కల్పిస్తున్నాం. మెయిన్‌రోడ్ల నుంచి కాలనీల వరకు ప్రయాణాన్ని సులభతరం చేసే ‘లాస్ట్ మైల్ కనెక్టివిటీ’పై దృష్టిపెడుతున్నాం. సొంతగడ్డలో ఈ సేవలు ప్రారంభించడం ఆనందంగా ఉంది.
– నిఖిల్ కుమార్


