ఉల్లి, టమాటా ధరలకు రెక్కలు | Telangana Retail Inflation Latest Update | Sakshi
Sakshi News home page

పల్లె జేబుకు ధరల చిల్లు!

Oct 21 2026 12:48 PM | Updated on Oct 21 2026 12:53 PM

Telangana Retail Inflation Latest Update

తెలంగాణ‌లోని గ్రామీణ ప్రాంతాల్లో సెప్టెంబర్‌లో 7.21 శాతానికి రిటైల్‌ ద్రవ్యోల్బణం

దేశ సగటు గ్రామీణ ద్రవ్యోల్బణం 6.08 శాతంకన్నా ఎక్కువగా నమోదు

ఉల్లి, టమాటా ధరలకు రెక్కలు.. నెల రోజుల్లోనే రెట్టింపు

కూలీ రేట్లు పెరగక, వర్షాల్లేక పడిపోతున్న గ్రామీణుల కొనుగోలు శక్తి  

సాక్షి, హైదరాబాద్‌: పండుగల సమయంలో తెలంగాణ‌ రాష్ట్రంలోని గ్రామీణ కుటుంబాలపై ధరల భారం రోజురోజుకూ పెరుగుతోంది. ఒకవైపు కూరగాయలు, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతుంటే మరోవైపు కూలీ రేట్లు ఆ స్థాయిలో పెరగకపోవడం, వర్షాభావంతో పంటలు దెబ్బతినడం పల్లె ప్రజల కొనుగోలు శక్తిని దెబ్బతీస్తున్నాయి. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ (ఎంవోఎస్‌పీఐ) తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం సెపె్టంబర్‌లో తెలంగాణలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.64 శాతానికి చేరింది. ఆగస్టులో ఇది 6.27 శాతంగా ఉంది. ఈ ఏడాదిలో రాష్ట్రంలో ఇదే అత్యధికం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 7.21 శాతంగా నమోదవగా పట్టణ ప్రాంతాల్లో 6.21 శాతంగా ఉంది.

దేశవ్యాప్తంగా గ్రామీణ ద్రవ్యోల్బణం 6.08 శాతంగా ఉంటే రాష్ట్రంలోని పల్లెల్లో అంతకంటే ఒక శాతానికిపైగా ఎక్కువగా ఉండటం గమనార్హం. దేశవ్యాప్తంగా సెపె్టంబర్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.54 శాతానికి చేరింది. ఇది 23 నెలల గరిష్ట స్థాయి. ఆహార ద్రవ్యోల్బణం ఆగస్టులో 5.97 శాతం ఉండగా సెపె్టంబర్‌లో 7.74 శాతానికి ఎగబాకింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆహార ద్రవ్యోల్బణం 8.06 శాతానికి చేరింది. దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు గతేడాదితో పోలిస్తే 108 శాతం పెరిగాయి. పట్టణ కుటుంబాలతో పోలిస్తే గ్రామీణ కుటుంబాలు తమ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని ఆహారానికే ఖర్చు చేస్తాయి. దీంతో ఆహార ధరల పెరుగుదల ప్రభావం పల్లెలపైనే ఎక్కువగా పడుతోంది.

కూలీ పెరగలేదు.. ఖర్చు పెరిగింది  
ధరలు పెరుగుతున్న స్థాయిలో గ్రామీణ కూలీల వేతనాలు పెరగడం లేదు. కేంద్ర కార్మిక బ్యూరో గణాంకాల ప్రకారం ఏప్రిల్‌–జూన్‌ మధ్య పురుషుల కూలీ రేట్లు 16 శాతానికి పైగా, మహిళల కూలీ 21 శాతం మేర పెరగగా, జూలై–ఆగస్టులో ఆ వృద్ధి పురుషులకు 3 శాతానికి, మహిళలకు 4 శాతం లోపునకు పడిపోయింది. ద్రవ్యోల్బణాన్ని లెక్కలోకి తీసుకుంటే వ్యవసాయ కూలీల వాస్తవ వేతనాలు ఆగస్టులో 1.9 శాతం, వ్యవసాయేతర కూలీల వాస్తవ వేతనాలు 2.1 శాతం తగ్గాయి. అంటే కూలీకి వచ్చే డబ్బుతో గతేడాది కొన్నన్ని సరుకులు కూడా ఇప్పుడు కొనలేని పరిస్థితి. ఉపాధి హామీ పథకం స్థానంలో వచ్చిన కొత్త పథకం వీబీజీ రామ్‌జీ కింద రాష్ట్రంలో రోజువారీ కూలీని జూలై 1 నుంచి రూ. 308గా కేంద్రం నిర్ణయించింది. అయితే కొత్త పథకం అమలులో ప్రారంభ ఇబ్బందుల కారణంగా పనిదినాలు గతంతో పోలిస్తే తగ్గాయన్న విమర్శలు వస్తున్నాయి. వ్యవసాయ పనులు లేని సీజన్‌లో ఉపాధి పనులే ఆధారమైన కూలీ కుటుంబాలపై ఇది మరింత భారం మోపుతోంది.

కరువుతో రైతుల చేతిలో డబ్బేది? 
గ్రామీణ కొనుగోలు శక్తికి మూలమైన వ్యవసాయ ఆదాయాన్ని కరువు దెబ్బతీస్తోంది. రాష్ట్రంలోని 621 మండలాలకుగాను 315 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే కేంద్రానికి నివేదించారు. రాష్ట్రంలో 17 శాతం లోటు వర్షపాతం నమోదవగా ఆదిలాబాద్‌ జిల్లాలో లోటు 35 శాతానికి చేరింది. జిల్లాలోని 20 మండలాల్లో ఒక్కటి మినహా అన్నింటిలోనూ 24 నుంచి 45 శాతం లోటు నమోదైంది.

పత్తి, సోయాబీన్, కంది పంటలు ఎండిపోతుండటంతో పెట్టుబడుల కోసం బ్యాంకులు, ప్రైవేటు వ్యాపారుల వద్ద తెచ్చిన అప్పులు తీర్చలేక ఆ జిల్లాలోనే ఈ నెలలో ఐదుగురు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. దిగుబడులు తగ్గితే రైతుల చేతికి వచ్చే డబ్బు తగ్గి ఆ ప్రభావం గ్రామాల్లోని దుకాణాలు, వాహన షోరూంల వరకు విస్తరిస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. దసరా, దీపావళి పండుగలు, ఖరీఫ్‌ పంట చేతికి రావడంతో సమీప భవిష్యత్తులో గ్రామీణ డిమాండ్‌కు కొంత ఊతం లభించవచ్చని.. అయితే పండుగల సందడి ముగిశాక అసలు పరిస్థితి బయటపడుతుందని అంటున్నారు.

కూరగాయల ధరలు కుతకుత  
రాష్ట్రంలో ఉల్లి, టమాటా ధరలు సామాన్యుడికి కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. నెల క్రితం కిలో రూ. 30 ఉన్న ఉల్లి ధర బహిరంగ మార్కెట్‌లో ఇప్పుడు రూ. 55 నుంచి రూ. 70 వరకు పలుకుతోంది. రైతుబజార్లలో కిలో రూ. 40 నుంచి రూ. 50కి విక్రయిస్తున్నారు. మలక్‌పేట హోల్‌సేల్‌ మార్కెట్‌లో ఆదివారం క్వింటాల్‌ ఉల్లి కనిష్టంగా రూ. 3,600, గరిష్టంగా రూ. 4,600 పలికింది. రెండు వారాల క్రితం రోడ్డు పక్కన కిలో రూ. 20కి దొరికిన టమాటా ఇప్పుడు రూ. 50కి చేరింది. సూపర్‌ మార్కెట్లలో రూ. 60 వరకు అమ్ముతున్నారు.

ఇదీ చ‌ద‌వండి: భారీగా పెరిగిన సన్న బియ్యం ధర..!

వంకాయ, బెండ, పచ్చిమిర్చి, కాకర, బీర వంటి కూరగాయలన్నీ కిలో రూ. 60 దాటాయి. కూకట్‌పల్లి రైతుబజార్‌లో అల్లం కిలో రూ. 120, వెల్లుల్లి రూ. 260, ఎండుమిర్చి రూ. 280, చింతపండు రూ. 160 పలుకుతున్నాయి. ధరల దెబ్బకు గతంలో వారానికి మూడు నాలుగు కిలోల ఉల్లి కొనే కుటుంబాలు ఇప్పుడు కిలోతోనే సరిపెట్టుకుంటున్నాయి. మహారాష్ట్ర, కర్నూలు నుంచి రావాల్సిన ఉల్లి సరఫరా తగ్గడమే ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement