భారీగా పెరిగిన సన్న బియ్యం ధర..! | Rice Prices Hike In Telangana Market | Sakshi
Sakshi News home page

భారీగా పెరిగిన సన్న బియ్యం ధర..!

Oct 21 2026 9:20 AM | Updated on Oct 21 2026 10:05 AM

Rice Prices Hike In Telangana Market

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: సన్న బియ్యం ధరలు చూసి సామాన్యులు షాక్‌ తింటున్నారు. ఇప్పటికే నిత్యావసరాల ధరలు పెరిగాయి. బియ్యం ధరలు సైతం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గడచిన నెల రోజులుగా బియ్యం ధరలు రోజుకో రికార్డు సృష్టిస్తున్నాయి.

జైశ్రీరాం రకం నిన్న మొన్నటి వరకు క్వింటాలుకు రూ.8 వేలు ఉండగా, సోమవారం రూ.9,200 లకు చేరింది. గతంలో ఆరు నెలలు, ఏడాదికి సరిపడా బియ్యం కొనుగోలు చేసి ఇళ్లలో నిల్వ చేసుకునేవారు. అయితే బియ్యంలో పురుగులు తయారవుతున్నాయని చాలామంది ఇంట్లో బియ్యం అయిపోగానే 25 కిలోల బస్తా కొనడం అలవాటైంది. దాదాపు ప్రతీ కుటుంబంలో నెలకు ఒక బస్తా బియ్యం అవసరం అవుతుంది. నెలనెలా బియ్యం ధరల్లో పెరుగుదలను చూసి అవాక్కవుతున్నారు.

కామారెడ్డి మార్కెట్‌లో నాలుగు రోజుల క్రితం బియ్యం బస్తా ధర రూ.2 వేలు ఉండగా, సోమవారం రూ.2,300 విక్రయిస్తున్నారు. ఒక్కసారిగా బస్తాపై రూ.300 పెరిగింది. క్వింటాలుకు రూ.1,200 పెరగడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. బియ్యం ధరలు మరింత పెరిగే చాన్స్‌ ఉందంటూ వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ధరల నియంత్రణ విషయంలో అధికార యంత్రాంగం నోరుమెదపకపోవడంతో సామాన్యుడు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఎల్‌నినో పేరిట బియ్యం ధరలను పెంచుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

బియ్యం ధరలు అడ్డగోలుగా పెరుగుతుండడంతో భవిష్యత్తుపై జనంలో ఆందోళన మొదలైంది. వానాకాలం పంట చేతికి రావడంతో చాలా మంది రైస్‌మిల్లర్లు, వ్యాపారులు సన్న వడ్లను పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి నిల్వ చేస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి వ్యాపారులు వచ్చి పచ్చి వడ్లను పెద్దఎత్తున కొనుగోలు చేసుకొని లారీల్లో తరలించుకువెళ్లారు. ఇంకా కొనుగోలు చేస్తూనే ఉన్నారు. బియ్యం ధరలు మరింత పెరుగుతాయనే సంకేతాలతో వ్యాపారులు వడ్లను అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే వేల క్వింటాళ్ల ధాన్యం గోదాములకు చేరాయి. దీంతో బియ్యం ధరలపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఇదీ చదవండి: రోహిత్‌ శర్మ రికార్డును బద్దలు కొట్టిన బవుమా


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement