విశాఖపట్నం: కాళ్ల పారాణి ఆరకముందే నవ వధువు మృతి చెందిన విషాద ఘటన ఎన్‌ఏడీ జంక్షన్ ఫ్లైఓవర్‌పై చోటుచేసుకుంది. పండగ ఆనందాలు మిగలాల్సిన ఆ కుటుంబాల్లో ఈ ఘటన తీరని విషాదాన్ని నింపింది. ఎయిర్‌పోర్టు పోలీసులు తెలిపిన వివరాలివి.. ఎంవీపీ కాలనీకి చెందిన మువ్వ నారాయణ రావు కుమార్తె రమా హిమజ (27)కు, గత ఏడాది నవంబర్‌లో ఎంవీవీ వినీష్‌తో వివాహం జరిగింది.
హైదరాబాద్‌లో నివాసముంటున్న ఈ నూతన దంపతులు తొలి పండగ కోసం విశాఖ వచ్చారు. నాలుగు రోజులు కుటుంబంతో సంతోషంగా గడిపిన వీరు, శుక్రవారం కారులో అన్నవరం వెళ్లారు. అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుని, అదే రోజు రాత్రి తిరిగి విశాఖ బయలుదేరారు. మరో పావు గంటలో ఇంటికి చేరుకుంటామనుకునే సమయంలో.. ఎన్‌ఏడీ ఫ్లైఓవర్ బ్రిడ్జ్‌పై కారు ముందు టైరు ఒక్కసారిగా పేలిపోయింది.
దీంతో కారు అదుపుతప్పి రోటరీ డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ సమయంలో కారులోని ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే, ప్రమాద తీవ్రతకు భయపడి తీవ్ర ఆందోళనకు గురైన హిమజ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వెంటనే ఆమెను 108 వాహనంలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఆమె మృతి చెందారు. మృతురాలి తండ్రి నారాయణరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ శంకర నారాయణ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.


