breaking news
braille printer
-
తెలుగమ్మాయి ప్రతిభ.. మాట్లాడితే ముద్రించే యంత్రం!
చూపు లేని వారు చదువుకోవడానికి ఉపయోగించే ప్రత్యేక లిపిని రాయడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఈ సమస్యకు పరిష్కారంగా నోటితో మాట్లాడితే చాలు. వెంటనే ఆ మాటలను గుర్తించి, ప్రత్యేక లిపిలోకి మార్చి, కాగితంపై ముద్రించే యంత్రాన్ని మన తెలుగమ్మాయి హిమజ రూపొందించారు. చూపులేని విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు, వారు ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా చదువుకునేందుకు తయారు చేసిన ఈ సాంకేతిక పరికరం ప్రతిష్టాత్మక జేమ్స్ డైసన్ అవార్డు (James Dyson Award 2026) రేసులో నిలిచి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. తెలుగమ్మాయి ప్రతిభఆంధ్రప్రదేశ్ భీమవరంలోని శ్రీ విష్ణు మహిళా ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఇరవై ఏళ్ల విద్యార్థిని లింగంపల్లి హిమజ (Lingampalli Himaja) ‘రుద్ర’పేరుతో మాట్లాడే బ్రెయిలీ ముద్రణ యంత్రం తయారు చేశారు. చూపులేని పిల్లలు పడే కష్టాలను స్వయంగా చూసిన హిమజ.. వారి సమస్యకు సులువైన పరిష్కారం చూపాలని ఆలోచించారు. మొదట్లో ఆమె ఒక సాధారణ నమూనాను తయారు చేశారు. అయితే ఒక పాఠశాల సందర్శనలో చూపు లేని విద్యార్థి ‘నోటితో మాట్లాడగలిగినప్పుడు, చేతులతో ఎందుకు టైప్ చేయాలన్న ప్రశ్న ఆమె ఆలోచనను పూర్తిగా మార్చేసింది. ఆ ప్రశ్నే ఈ మాట్లాడే ముద్రణ యంత్రాన్ని తయారు చేయడానికి తనకు స్ఫూర్తినిచ్చిందని హిమజ చెప్పారు. పెద్ద మొత్తంలో బహుమతిప్రపంచవ్యాప్తంగా 30 దేశాల నుంచి వచ్చిన వేలాది ఆవిష్కరణలతో పోటీపడి ఈ పరికరం చివరి దశకు చేరుకుంది. బ్రిటన్, అమెరికా, సింగపూర్ వంటి దేశాలకు చెందిన 12 మంది అంతర్జాతీయ ఇంజనీర్ల బందం ఈ పరికరం పనితీరు, రూపకల్పన, సమాజానికి ఇది చేసే మేలును పరిశీలించి ఎంపిక చేశారు. నవంబర్ 4న ప్రకటించబోయే తుది విజేతల జాబితాలో నిలిస్తే.. సుమారు రూ.38 లక్షల నగదు బహుమతి లభిస్తుంది. ఇదీ చదవండి: తెలుగు యువకుడి బుకింగ్ రైడ్ యాప్పోటీలో గెలిస్తే వచ్చిన డబ్బుతో ఈ పరికరాన్ని మరింత చిన్నగా, ఆధునికంగా మార్చాలని హిమజ లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే దీని తయారీ ఖర్చును తగ్గించి, ప్రతి విద్యార్థి సొంతంగా కొనుగోలు చేసేలా తక్కువ ధరకు అందించాలన్నదే తన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.అవసరమైన సాంకేతికతమనదేశంలో 50 లక్షలపైచిలుకు మంది చూపులేని వారున్నారు. వీరంతా చదువుకోవడానికి, ఉద్యోగాలు సంపాదించడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కంప్యూటర్ స్క్రీన్ మీద ఉన్న విషయాలను చదివి వినిపించే సాఫ్ట్వేర్లు ఉన్నప్పటికీ, సొంతంగా చదువుకోవడానికి, రాసుకోవడానికి రుద్ర లాంటి పరికరాలు ఎంతో సహాయపడతాయి. గట్టి పోటీ ఉన్నప్పటికీ హిమజ రూపొందించిన పరికరం టాప్–20లో నిలవడం విశేషం. - సాక్షి, హైదరాబాద్ -
చవకగా బ్రెయిలీ ప్రింటర్
భారత సంతతికి చెందిన 12 ఏళ్ల విద్యార్థి రూపకల్పన న్యూయార్క్: అంధులకు ఉపయోగపడేలా తక్కువ ధరలో బ్రెయిలీ ప్రింటర్ ను అమెరికాలో భారత సంతతికి చెంది న 12 ఏళ్ల శుభమ్ బెనర్జీ రూపొందిం చాడు. ఎలక్ట్రానిక్ ఆట వస్తువు ‘లెగో మైండ్‌స్టార్మ్ ఈవీ3’ తో దీనిని రూపొం దించడం గమనార్హం. పిల్లల్లో సృజనాత్మకత పెంపొందించేందుకు.. చిన్న భాగాలను కలిపి వేర్వేరు ఆట బొమ్మల్ని తయారే చేసేందుకు తోడ్పడే ఎలక్ట్రానిక్ కిట్ ఈ ‘లెగో మైండ్‌స్టార్మ్ ఈవీ3’. దీనికి మరికొన్ని భాగాలను చేర్చి.. ‘బ్రెయిగో’ పేరుతో బ్రెయిలీ ప్రింటర్‌ను బెనర్జీ తయారు చేశాడు. బ్రెయిలీ భాష లో ఏ నుంచి జెడ్ వరకూ అక్షరాలను, అంకెలను దీనితో కాగితంపై ప్రింట్ చేయవచ్చు. ఒక్కో అక్షరాన్ని ప్రింట్ చేయడానికి ఇది ఏడు సెకన్ల సమయం తీసుకుంటుంది. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని శాంటాక్లారాలో ఏడో తరగతి చదువుతున్న శుభమ్ బెనర్జీ... తాను రూపొందించిన ఈ డిజైన్‌ను, ప్రోగ్రామ్ సాఫ్ట్‌వేర్‌ను అందరికీ ఉచితంగా అందజేస్తానని చెబుతున్నాడు. దీనితో అక్షరాలను ప్రింట్ చేసే విధానాన్ని వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టాడు కూడా. సాధారణంగా బ్రెయిలీ ప్రింటర్ ధర రూ. లక్షన్నర వరకూ ఉండగా... ‘బ్రెయిగో’ను రూ. 20 వేలతో తయారు చేసుకోవచ్చు.


