లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలను రద్దు చేయాలి
పేపర్ బ్యాలెట్‌తో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్
బెంగళూరు: ప్రస్తుత లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికలన్నీ చట్టవిరుద్ధమేనని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తేల్చిచెప్పారు. అందుకే లోక్‌సభ, శాసనసభలను రద్దు చేసి, మళ్లీ బ్యాలెట్ పేపర్‌తో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతోపాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం చట్టవిరుద్ధమేనని పేర్కొన్నారు.
ఖర్గే శనివారం కర్ణాటకలోని కలబురిగిలో మీడియాతో మాట్లాడారు. నేడు దేశమంతా అక్రమ ఎన్నికల ఆధారంగా నడుస్తోందని మండిపడ్డారు. మోదీ అక్రమ ప్రధానమంత్రి, అమిత్ షా అక్రమ మంత్రి, ముఖ్యమంత్రులు కూడా అక్రమమేనని స్పష్టంచేశారు. వారందరినీ పదవుల నుంచి తొలగించి, మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సిందేనని ఉద్ఘాటించారు.
ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాలను(ఈవీఎంలు) దురి్వనియోగం చేస్తున్నారని, అధికారంలో ఉన్న వ్యక్తుల సొంత మనుషులే ఈ విషయం చెబుతున్నారని వెల్లడించారు. అందుకే ఈవీఎంలను పూర్తిగా పక్కనపెట్టి, బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్)లో అనేక అవకతవకలు జరుగుతున్నాయని, ఈ ప్రక్రియ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం తప్పులు చేస్తోందని విమర్శించారు. ఎస్‌ఐఆర్, ఎన్నికల ప్రక్రియ దురి్వనియోగానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగిస్తాయని ప్రకటించారు.
అది స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నిక అవుతుందా?
ఎస్‌ఐఆర్ సర్వం తప్పులతడక అని ఖర్గే ధ్వజమెత్తారు. ఒక బూత్ నుంచి కుట్రపూరితంగా 500 ఓట్లను తొలగిస్తే అది స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నిక ఎలా అవుతుంది?అని ప్రశ్నించారు. ఓటర్ల జాబితాల నుంచి పేర్ల తొలగింపును కోరుతూ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ సభ్యులు గ్రామాలకు వెళ్లి దరఖాస్తు పత్రాలు నింపుతున్నారని ఆరోపించారు.
జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాం«దీ, లాల్ బహదూర్ శాస్త్రి, పీవీ నరసింహారావు, రాజీవ్ గాంధీ వంటి నాయకులెవరూ ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలకు పాల్పడలేదని గుర్తుచేశారు. ఇప్పుడు తమకు కావాల్సిన వ్యక్తులను ఓటర్ల జాబితాలో చేర్చడానికి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు.
ఎస్‌ఐఆర్‌లో అక్రమాలు మన యువతను, పేదలను, దళితులను, అణగారిన వర్గాలను దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ధనవంతులు తమ పనిని ఎలాగోలా పూర్తి చేసుకోగలిగినప్పటికీ, ఏదైనా సమస్య తలెత్తితే మాత్రం పేదలు తమ పనులు మానుకొని ఎన్నికల సంఘం అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోందని అన్నారు.
ఎస్‌ఐఆర్‌పై ప్రజలను చైతన్య పరుస్తాం
ప్రధాని మోదీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారని ఖర్గే నిప్పులు చెరిగారు. పదవిలో ఉండగా తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ), ఎన్నికల కమిషనర్లకు చట్టపరమైన చర్యల నుంచి మినహాయింపు కల్పించే చట్టాన్ని ప్రస్తావించారు. వారికి మినహాయింపు కల్పించే చట్టాన్ని తీసుకొచ్చి ప్రజాస్వామ్యా న్ని దిగజార్చుతున్నారని ఆరోపించారు. ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీలో మార్పులు చేయడాన్ని తప్పుపట్టారు.
స్వలాభం కోసమే ఈ కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించి, కేంద్ర మంత్రిని చేర్చారని ఆక్షేపించారు. ఈనెల 6న ఢిల్లీలో ఎన్నికల సంఘం కార్యాలయం వరకు పాదయాత్ర చేయబోతున్నట్లు ఖర్గే తెలిపారు. ఎస్‌ఐఆర్‌లో అక్రమాలపై దేశ ప్రజల్ని చైతన్యవంతులను చేస్తామన్నారు. ఆ తర్వాత ప్రజలు ‘మోదీ, మోదీ’ అని అంటే మాత్రం వారికి నియంతృత్వమే కావాలని తేటతెల్లం అవుతుందన్నారు.


