మోయకూడని బరువు.. | Let Go Of The Burden Life Lesson From A Sage | Sakshi
Sakshi News home page

మోయకూడని బరువు..

Aug 22 2026 7:28 AM | Updated on Aug 22 2026 7:28 AM

Let Go Of The Burden Life Lesson From A Sage

ఆధ్యాత్మికం

ఒక వ్యక్తి, ఒక ముని వద్దకు వచ్చాడు. ‘అయ్యా! ఈ భారాన్ని, భయాన్ని నేను భరించ లేకపోతున్నాను. నాకు విముక్తి ప్రసాదించండి’ అని ఆవేదన చెందాడు. ముని అతనితో ‘సరే, నీకు దారి చెబుతాను. దానికి ముందు, ఈ దారిలో ఉన్న రెండు పెద్ద రాళ్లను నీ రెండు చేతుల్లో పట్టుకుని, ఈ తోట చుట్టూ ఐదు సార్లు ప్రదక్షిణ చేసి రా’ అన్నాడు.

అతను రెండు చేతుల్లో రాళ్లను ఎత్తుకుని నడవటం ప్రారంభించాడు. మొదటి చుట్టులోనే చేతులు వణికి పోయాయి. రెండో చుట్టులో నరాలు ఉబ్బిపోయాయి. మూడో చుట్టులో నొప్పితో అరిచాడు. నాలుగో చుట్టులో ‘గురుదేవా, నా వల్ల కావడం లేదు. చేతులు పడిపోతున్నాయి, నా ప్రాణం పోతోంది’ అన్నాడు. ముని ప్రశాంతంగా, ‘అయితే, ఆ రాళ్లను కింద పడేయ్‌’ అన్నాడు. అతను వెంటనే ఆ రెండు రాళ్లను కింద పడేశాడు. మరుక్షణమే, అతని చేతుల్లో భారం తగ్గి, శరీరమూ మనస్సూ తేలికపడినట్లు అనిపించింది. హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు.

‘రాళ్లను పట్టుకుని నొప్పితో అరిచిందీ నువ్వే, వాటిని కింద పడేసి ప్రశాంతతను పొందిందీ నువ్వే. రాళ్లు నిన్ను బలవంతం చేసి నీ చేతులకు అతుక్కున్నాయా? నువ్వే వాటిని పట్టుకున్నావు కదా. అలాగే నీ గత జ్ఞాపకాలు, భవిష్యత్తు భయాలు కూడా. గడిచిపోయిన కాలం ఎప్పుడో ముగిసిపోయింది, రాబోయే కాలం ఇంకా రాలేదు. రాళ్లను కింద పడేయడానికి నీకు ఎవరి అనుమతి అవసరం లేదు కదా? అలాగే నిన్ను గాయపరిచే జ్ఞాపకాలను, అనవసరమైన భారాన్ని మనస్సు నుంచి వదిలేయడం నీ చేతుల్లోనే ఉంది’ అని వివరించాడు ముని.
– యామిజాల జగదీశ్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement