ఇషా సింగ్
ఆసియా క్రీడలలో భారత స్టార్ షూటర్ హైదరాబాద్ వాసి ఇషాసింగ్ మహిళల 25 మీటర్ల పిస్టల్ ఇండివిడ్యువల్‌లో సిల్వర్ మెడల్ సాధించింది. ‘హాబీగా ప్రయత్నించి సీరియస్‌గా తీసుకున్నా’ అంటూ తన స్పోర్ట్స్ జర్నీని వివరిస్తూనే ఒత్తిడిని ఎదుర్కోవడానికి పెంచుకున్న హాబీస్ గురించీ వివరిస్తారు ఆమె...
ఆసియా క్రీడల్లో భారతదేశానికి పిస్టల్ ఇండివిడ్యుయల్ ఈవెంట్‌లో తొలి పతకాన్ని అందించిన ఈ యువ క్రీడాకారిణి ఆలోచనలు ఎందరికో స్ఫూర్తినిస్తాయి..
ఇష్టంగా సాధన... ఆసక్తితో మొదలైన షూటింగ్ ప్రయాణం కొద్ది రోజుల్లోనే ఇష్టంగా మారిందని చెబుతుంది ఇషా. ‘మొదట్లో షూటింగ్ అంటే అస్సలు తెలియదు. మా నాన్న ఫ్రెండ్ షూటర్. ఒకసారి గచ్చిబౌలిలోని వాళ్ల ప్లేస్‌లో పాట్‌లక్ ఏర్పాటు చేస్తే, నాన్న నన్నూ వెంట తీసుకెళ్లారు. అక్కడ షూటింగ్ గురించి తెలిసింది. ఆసక్తిగా అనిపించింది. నాన్న కూడా నా ఇంట్రస్ట్ చూసి, ప్రోత్సహించారు. అలా తొమ్మిదేళ్ల వయసులో పిస్టల్ పట్టుకున్నాను. అప్పటి నుంచి నాన్న కూడా నాతోనే జర్నీ చేస్తున్నారు.
నాకు నేనే పోటీ... క్రీడల ద్వారా మనం ఎంతో నేర్చుకుంటాం. చాలా క్రమశిక్షణగా ఉంటాం. గెలవాలనే తపన ఉంటుంది. చేసే సాధన ద్వారా మనలో ఎప్పుడూ ఒక కొత్త శక్తి పుట్టుకువస్తుంది. అందుకే, ఎవరితో పోటీ అనుకోను. నాకు నేనే పోటీ. ఇంకా బాగా చేయాలనే తపన అంతర్జాతీయ స్థాయిలో దేశానికి పతకాలు సాధించేంతగా చేర్చింది. ఒకేచోట చాలాసేపు నిలబడాల్సి ఉంటుంది. పిస్టల్స్ చాలా బరువు ఉంటాయి. గోల్ రీచ్ అవ్వాలంటే ఏకాగ్రత మరీ అవసరం. ఇవన్నీ ఒక గేమ్ మనకు నేర్పుతుంది. మనలోని శక్తిని బయటకు చూపుతుంది.
మానసిక ప్రశాంతతకు ... ఒత్తిడి అనేది తప్పించుకోవాల్సిన విషయం కాదు. దానిని అధిగమించి ఎదగాలని చాలా కాలంగా నేర్చుకుంటున్నాను. ఖాళీ సమయంలో పెయింటింగ్స్ వేస్తుంటాను. నా అంతర దృష్టి, ప్రపంచాన్ని వినూత్నంగా పెయింటింగ్స్‌లో చూపుతుంటాను. ఎవరికీ నన్ను నేను నిరూపించుకోవడానికి ఆడను. ఈ క్రీడను ఇష్టపడ్డాను కాబట్టి ఆడతాను. అంచనాలు, ర్యాంకులు, పతకాలు... వీటన్నింటికన్నా కేవలం షూటింగ్‌ను ప్రేమించే అమ్మాయి నాలో ఉంది. నాలోని క్రీడాకారిణిని నేనే గుర్తించలేని రోజుల్లో నా కోచ్ గుర్తించారు. వారికి నా కృతజ్ఞతలు. ఈ ప్రయాణంలో నేర్చుకున్న పాఠాలు ఎన్నో. ఈ విజయం నా దేశానికి అంకితం. భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ విజయాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను’ అని ఎంతో వినమ్రంగా చెబుతున్న ఈ క్రీడాకారిణి మాటలు యువతకు స్ఫూర్తిదాయకం.
– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి


