విమాన ప్రయాణాల్లో చర్మం పొడిబారడం సహజం. విమానంలోని గాలిలో తేమ తక్కువగా ఉండటంతో చర్మం డ్రైగా మారి కళ కోల్పోయినట్లుగా కనిపిస్తుంది. ఈ సమస్యకు పరిష్కారమే ‘సిమెట్రిక్ ఎంటర్ ప్రైజెస్ కో’ రూపొందించిన డ్రై షీట్ మాస్క్‌లు. సాధారణ షీట్ మాస్క్‌ల మాదిరి ఇవి తడిగా ఉండకుండా, అవసరమైనపుడు నీటితో తడిపి ఉపయోగించేందుకు అనువుగా ఉంటాయి. ఇందుకోసం కేవలం ఒకటిన్నర మిల్లీ లీటర్ల నీరు సరిపోతుంది.
ఇది ఉపయోగించిన వెంటనే చర్మానికి తేమ అంది, తాజాగా, కాంతిమంతంగా కనిపిస్తుంది. పరిమాణంలో చిన్నగా ఉండి కేవలం 5 గ్రాముల బరువు కలిగి ఉండటం వీటి ప్రత్యేకత. అంతేకాదు ఈ డ్రై షీట్ మాస్క్‌లు పర్యావరణ హితం కూడా. విమాన ప్రయాణాల్లోనే కాకుండా, నీటి సదుపాయం తక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ ఇవి ఉపయోగపడతాయి. ప్రయాణాల్లో అందాన్ని, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునే వారికి ఈ డ్రై షీట్ మాస్క్‌లు సరికొత్త ఎంపిక.
తలకట్టునూ పట్టించుకోండి!
జుట్టు ఒత్తుగా ఉండి పొడవుగా పెరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇందుకోసం కేవలం షాంపూలు, నూనెలు, హెయిర్ మాస్క్‌లపై మాత్రమే దృష్టి పెడుతుంటారు. అయితే జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే ఇవి మాత్రమే కాకుండా జుట్టుకు మూలమైన మాడుపై కూడా జాగ్రత్త తప్పనిసరి అంటున్నారు నిపుణులు. అందుకే ఇపుడు స్కాల్ప్ కేర్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది.
చుండ్రు, దురద, జుట్టు రాలడం వంటి సమస్యలు ఉంటే నిర్లక్ష్యం చేయకూడదు. రోజుల పాటు తలస్నానం చేయకుండా ఉండటం, చుండ్రు ఉన్నపుడు తలకు నూనె రాయడం, తడి జుట్టుతో నిద్రపోవడం వంటివి సమస్యలను పెంచుతాయి. వారానికి రెండు మూడుసార్లు తలస్నానం చేయడం, కండిషనర్‌ను కేవలం జుట్టు చివర్లకు మాత్రమే ఉపయోగించడం, పోషకాహారం తీసుకోవడం వంటివి జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు తోడ్పడతాయి.
అందమెంత కఠినం!
విక్టోరియా కాలంలో చర్మం తెల్లగా, మృదువుగా మారుతుందని ఆర్సెనిక్ మాత్రలు, పౌడర్లను చర్మ సౌందర్య ఉత్పత్తులుగా ఉపయోగించేవారు. అంతేకాదు వీటిని ఉపయోగిస్తే ఆరోగ్యం, ఉత్సాహం కూడా పెరుగుతాయని భావించేవారు.
దీనిని తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, నరాలు దెబ్బతినడం, చర్మంపై గాయాలు, అంతర్గత అవయవాల వైఫల్యం వంటి తీవ్రమైన సమస్యలు వచ్చేవి. చివరకు ప్రాణాలకే ఎసరొచ్చేది. అందం కోసం చేసే ప్రయోగాలు ఎంతటి ప్రమాదానికి దారితీస్తాయో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.
ఇదీ చదవండి: రెటినైటిస్ పిగ్మెంటోసా పేషెంట్స్‌కు... ! చూపునిచ్చే మంచి వైరస్..


