పుచ్చిపోయిన పళ్లు మళ్లీ పెరుగుతాయా? శాస్త్రవేత్తల కొత్త ప్రయోగం! | Tooth Enamel Regrowth New Protein Gel | Sakshi
Sakshi News home page

పుచ్చిపోయిన పళ్లు మళ్లీ పెరుగుతాయా? శాస్త్రవేత్తల కొత్త ప్రయోగం!

Nov 22 2026 5:12 AM | Updated on Nov 22 2026 5:12 AM

Tooth Enamel Regrowth New Protein Gel

ఫండే

సాక్షి స్పెషల్‌ డెస్క్‌

శాస్త్రవేత్తల తాజా ఆవిష్కరణ
పళ్లు పుచ్చిపోతే లేదా అరిగిపోతే ఇక అంతే సంగతులు, వాటిని మళ్లీ మునుపటిలా మార్చలేం. కానీ, శాస్త్రవేత్తలు ఇప్పుడు ఒక అద్భుతమైన మార్గాన్ని కనుగొన్నారు! దెబ్బతిన్న పంటి పై పొరను, అంటే ఎనామిల్‌ను మళ్లీ పెరిగేలా చేసే ఒక కొత్త జెల్‌ను తయారు చేశారు. దంత వైద్య రంగంలో ఇది ఒక పెద్ద ముందడుగు.

మన శరీరంలోని ఎముకలు లేదా అనేక ఇతర కణజాలాలు దెబ్బతింటే వాటంతటవే నయమవుతాయి. కానీ పంటి ఎనామిల్‌ మాత్రం ఒకసారి పోతే, మళ్లీ పెరగదు. అయితే ఇప్పుడీ కొత్త చికిత్స ఎనామిల్‌ తిరిగి పెరగటానికి, పళ్లను బలోపేతం చేయడానికి, భవిష్యత్తులో పళ్లు పుచ్చిపోకుండా నివారించడానికి ఒక మంచి మార్గాన్ని చూపిస్తోంది.

దంతవైద్యంలో మైలురాయి
నాటింగ్‌హామ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన స్కూల్‌ ఆఫ్‌ ఫార్మసీ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కెమికల్‌ అండ్‌ ఎన్విరాన్‌ మెంటల్‌ ఇంజినీరింగ్‌ పరిశోధకులు ఈ కొత్త విధానాన్ని ఆవిష్కరించారు. శిశువుగా ఉన్నప్పుడు పంటి ఎనామిల్‌ ఏర్పడే జీవ ప్రక్రియల స్ఫూర్తితో వారు ఈ జెల్‌ను రూపొందించారు.

ఖనిజాలను కోల్పోవడం వల్ల బలహీనపడిన లేదా అరిగిపోయిన ఎనామిల్‌ను రిపేర్‌ చేయడానికి, అలాగే ఆరోగ్యంగా ఉన్న ఎనామిల్‌ను మరింత గట్టిపరచడానికి దీనిని డిజైన్‌ చేశారు. నేచర్‌ కమ్యూనికేషన్స్‌ జర్నల్‌లో ప్రచురితమైన ఈ ఫలితాలు... ఎనామిల్‌ను రక్షించడమే కాకుండా దాని నిర్మాణాన్ని పునరుద్ధరించడంలో సహాయపడే సరికొత్త దంత చికిత్సలకు దారి తీయవచ్చన్న ఆశలు కల్పిస్తున్నాయి.

ఎనామిల్‌ నిర్మాణానికి పునాది
సాధారణంగా దంత వైద్యులు ఫ్లోరైడ్‌ ట్రీట్‌మెంట్‌ చేసే పద్ధతిలోనే, ఈ కొత్త జెల్‌ను కూడా నేరుగా పళ్లపై సులభంగా పూయవచ్చు. అయితే, సాంప్రదాయ ఫ్లోరైడ్‌ ఉత్పత్తుల మాదిరిగా కాకుండా ఈ కొత్త జెల్‌లో అసలు ఫ్లోరైడే ఉండదు. బదులుగా, చిన్నతనంలో పళ్లు సహజంగా ఏర్పడే సమయంలో సహకరించే ప్రొటీన్ల లక్షణాలను పోలిన ప్రత్యేకమైన కృత్రిమ ప్రొటీన్లతో శాస్త్ర పరిశోధకులు దీనిని తయారు చేశారు.

ఈ జెల్‌ను పంటిపై పూయగానే, అది పంటి ఉపరితలంపై పలుచని, పటిష్ఠమైన పొరలా ఏర్పడి పళ్లలోని సూక్ష్మమైన పగుళ్లను, ఖాళీలను పూడుస్తుంది. ఆ తర్వాత ఈ పూత పంటి ఎనామిల్‌ ఖనిజ నిర్మాణాన్ని మళ్లీ నిర్మించడానికి ఒక సరైన పునాదిలా పనిచేస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ మన లాలాజలంలో సహజంగా ఉండే కాల్షియం, ఫాస్ఫేట్‌ అయాన్ల మీద ఆధారపడి ఉంటుంది. ఈ జెల్‌ ఆ ఖనిజాలను తనవైపు ఆకర్షించి, ఒక క్రమపద్ధతిలో వాటిని కొత్త స్ఫటికాలుగా పెరిగేలా చేస్తుంది.

దంతానికి పటిష్ట కవచం
పళ్లు పుచ్చిపోవడం, సెన్సిటివిటీ సమస్యలకు శాస్త్రవేత్తలు కనుగొన్న ఈ కొత్త జెల్‌.. కేవలం ఎనామిల్‌ పైనే కాకుండా, బయటపడిన ‘డెంటిన్‌’ పై కూడా వాడవచ్చని పరిశోధకులు కనుగొన్నారు. ఎనామిల్‌కి క్రింద ఉండే పొరనే డెంటిన్‌ అంటారు. ఇది ఎనామిల్‌ కంటే మెత్తగా ఉంటుంది. ఇందులో పంటి లోపలి నరాలకు అనుభూతిని చేరవేసే సూక్ష్మమైన గొట్టాలు ఉంటాయి.

ఎనామిల్‌ అరిగిపోయినా లేదా చిగుళ్లు కిందికి జరిగిపోయినా, ఈ డెంటిన్‌ బయటపడి వేడి, చల్లని, తియ్యని లేదా పుల్లని పదార్థాలు తిన్నప్పుడు పళ్లు విపరీతంగా లాగడం (సెన్సిటివిటీ) జరుగుతుంది. ఇక్కడే జెల్‌.. బయటపడిన డెంటిన్‌ పై ఎనామిల్‌ లాంటి ఖనిజ పొర ఏర్పడేలా ప్రోత్సహిస్తుంది. దీనివల్ల పంటి సెన్సిటివిటీ తగ్గడమే కాకుండా, దెబ్బతిన్న పళ్లను రిపేర్‌ చేయడానికి వాడే ఫిల్లింగ్స్‌ వంటి వాటికి జెల్‌ గట్టిగా అతుక్కుంటుంది.

ఇది చాలా అద్భుతమైన ప్రయోజనమనే చెప్పాలి. ఎనామిల్‌ క్షీణించడమనేది పళ్లు పుచ్చిపోవడానికి ప్రధాన కారణం. ప్రపంచ జనాభాలో దాదాపు సగం మందిని ఈ దంత సమస్య వేధిస్తోంది. ఇలాంటి సమస్య వల్ల తీవ్రమైన నొప్పి, ఇన్‌ ఫెక్షన్లు, చివరికి పళ్లు ఊడిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా, నోటి పరిశుభ్రత సరిగా లేకపోతే మధుమేహం (డయాబెటిస్‌), గుండె జబ్బుల వంటి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.

కృత్రిమత్వానికి సహజశక్తి
దంత వైద్యంలో ఉన్న అతి పెద్ద సవాల్‌ ఏమిటంటే, పళ్లు పూర్తిగా పెరిగిన తర్వాత ఎనామిల్‌ను మళ్లీ నిర్మించగల జీవకణాలు ఏవీ అందులో ఉండవు. ఎనామిల్‌ దెబ్బతిన్న ప్రారంభ దశలో లాలాజలం.. కొంతవరకు కోల్పోయిన ఖనిజాలను భర్తీ చేయగలదు కానీ, అరిగిపోయిన పెద్ద మొత్తంలో ఎనామిల్‌ను శరీరం మళ్లీ పెంచలేదు.

ఇప్పటివరకు అందుబాటులో ఉన్న ఫ్లోరైడ్‌ వార్నిష్‌లు, రీమినరలైజేషన్‌ ఉత్పత్తులు పళ్లను రక్షించడానికి, ప్రారంభ దశలో ఖనిజాల నష్టాన్ని సరిచేయడానికి మాత్రమే సహాయపడతాయి. అంతే తప్ప ఇప్పటికే పూర్తిగా పోయిన ఎనామిల్‌ను అవి పూర్తిగా మళ్లీ తయారు చేయలేవు. ఈ కొత్త సాంకేతికత లక్ష్యం.. అచ్చం అసలు ఎనామిల్‌ లక్షణాలను పోలిన కొత్త ఖనిజ కణజాలం ఏర్పడేలా ప్రోత్సహించడం ద్వారా ఆ లోపాన్ని అధిగమించటమే. అది పని చేస్తోంది కూడా!

కొత్తగా పెరగటమే కాదు..
పాత ఎనామిల్‌కూ రక్షణ!
పరిశోధక బృందం ఈ కొత్తగా తయారైన పదార్థపు యాంత్రిక బలాన్ని, మన్నికను రోజువారీ వాడకానికి అనుగుణంగా ఉండే పరిస్థితుల్లో పరీక్షించి చూసింది. ఫలితాలు ఎంతో ఉత్సాహకరంగా వచ్చాయి. కొత్తగా తయారైన ఎనామిల్, ఆరోగ్యకరమైన సహజ ఎనామిల్‌తో సమానమైన యాంత్రిక లక్షణాలను ప్రదర్శించిందని, ఇది కేవలం తాత్కాలిక రక్షణ పొరలా కాకుండా శాశ్వత ప్రయోజనాన్ని ఇస్తుందని పరిశోధకులు అంటున్నారు.

ఈ అధ్యయనానికి ప్రధాన పరిశోధకుడు అయిన పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలో డాక్టర్‌ అబ్షార్‌ హసన్‌... ఎనామిల్‌ అంతర్గత నిర్మాణాన్ని తిరిగి సృష్టించటం ఎందుకంత ముఖ్యమో వివరించారు. దంతాల ఎనామిల్‌ ఒక ప్రత్యేకమైన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఇది శారీరక, రసాయన , ఉష్ణ సంబంధిత సమస్యల నుండి జీవితాంతం మన పళ్లను రక్షించే అద్భుతమైన గుణాన్ని ఎనామిల్‌కు ఇస్తుంది.

ఈ జెల్‌ను ఖనిజాలు కోల్పోయిన, అరిగిపోయిన ఎనామిల్‌పై లేదా బయటపడిన డెంటిన్‌ పై పూసినప్పుడు, అది.. స్పటికాలు ఒక క్రమపద్ధతిలో పెరిగేలా ప్రోత్సహించి, మన సహజమైన ఆరోగ్యకరమైన ఎనామిల్‌ నిర్మాణాన్ని పునరుద్ధరిస్తుంది. పళ్లు తోముకోవడం, నమలడం, పుల్లని ఆహార పదార్థాలు తగలడం వంటి నిజ జీవిత పరిస్థితులను పోలిన వాతావరణంలో ఈ పునరుద్ధరించిన కణజాలాల బలాన్ని పరిశోధకులు పరీక్షించినప్పుడు, కొత్తగా తయారైన ఈ ఎనామిల్‌ అచ్చం ఆరోగ్యకరమైన ఎనామిల్‌ లాగే పని చేయటాన్ని వారు గమనించారు.

ఈ ఫలితాలు చూస్తుంటే, దెబ్బతిన్న ఎనామిల్‌ మరింత క్షీణించకుండా నెమ్మదింపజేయడమే కాకుండా, దాని బలాన్ని, రక్షణను పూర్తిగా పునరుద్ధరించే మార్గాన్ని ఈ జెల్‌ భవిష్యత్తులో అందించగలదని స్పష్టమవుతోంది. అయితే, రోగులపై దీన్ని దీర్ఘకాలికంగా వాడినప్పుడు ఇది ఎంతవరకు సమర్థవంతంగా పనిచేస్తుందనేది మాత్రం ఈ ల్యాబ్‌ పరీక్షల ద్వారా ఇంకా నిర్థారణ కాలేదు.

ఎపిటాక్సియల్‌ మినరలైజేషన్‌
ఈ అద్భుతమైన ప్రక్రియను శాస్త్రవేత్తలు ‘ఎపిటాక్సియల్‌ మినరలైజేషన్‌’ అని పిలుస్తున్నారు. అంటే, పంటిపై ఏర్పడే కొత్త ఖనిజ స్ఫటికాలు పాత ఎనామిల్‌కు సరిగ్గా సరిపోలేలా ఎదుగుతాయి. దీనివల్ల కొత్తగా తయారైన పదార్థం పంటి అసలు ఉపరితలంతో పూర్తిగా కలిసిపోయి బలంగా నిలబడుతుంది.

ఎనామిల్‌ తన ప్రత్యేకమైన గట్టిదనాన్ని, మన్నికను కోల్పోకుండా ఉండటానికి ఈ స్ఫటికాల కచ్చితమైన అమరిక చాలా ముఖ్యం. కేవలం పంటిపై ఖనిజాలను పూయడం వల్ల సహజమైన ఎనామిల్‌ క్లిష్టమైన నిర్మాణాన్ని తిరిగి తీసుకురావడం సాధ్యం కాదు. కానీ, ఈ కొత్త జెల్‌ స్ఫటికాల పెరుగుదలను సరిగ్గా నడిపించడం ద్వారా ఆరోగ్యకరమైన ఎనామిల్‌ సూక్ష్మ నిర్మాణాన్ని, దాని సహజ లక్షణాలను మళ్లీ తీసుకురాగలదు.

వచ్చే ఏడాదే మార్కెట్‌లోకి...!
కేవలం ఎనామిల్‌ను పునరుద్ధరించడమే కాకుండా, ఆచరణాత్మక దంత చికిత్సలను దృష్టిలో ఉంచుకుని ఈ సాంకేతికతను అభివృద్ధి చేసినట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఈ జెల్‌ సురక్షితమైనది, సులభంగా పూసేందుకు, పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడానికి అనువైనది! దీని బహుముఖ ప్రజ్ఞ కారణంగా దీనిని రకరకాల దంత ఉత్పత్తులలో చేర్చవచ్చు. దీనివల్ల ఎనామిల్‌ అరిగిపోవడం, పళ్లు జివ్వుమనటం (సెన్సిటివిటీ), ఇతర డెంటిన్‌ సమస్యలతో బాధపడుతున్న వివిధ వయస్సుల రోగులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.

నాటింగ్‌హామ్‌ విశ్వవిద్యాలయంలో బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌– బయోమెటీరియల్స్‌ ప్రొఫెసర్‌ అయిన అల్వారో మాటా ఈ అధ్యయనానికి నాయకత్వం వహించారు. ఈ సాంకేతికతను దంత వైద్యులను, రోగులను.. ఇద్దరిని కూడా దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. తమ స్టార్టప్‌ కంపెనీ ‘మింటెక్‌–బయో’  ద్వారా ఈ ప్రక్రియను పరిశోధకులు ఇప్పటికే ప్రారంభించారు. వచ్చే ఏడాది నాటికి మొదటి ఉత్పత్తిని మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈలోగా ఒక స్థిరమైన దంత చికిత్సగా మారడానికి ఈ సాంకేతికతను మరింత అభివృద్ధి చేయవలసి ఉంది.

అలాగే క్లినికల్‌ పరీక్షలు జరగడం చాలా ముఖ్యం. అయినప్పటికీ, సహజమైన ఎనామిల్‌ నిర్మాణాన్ని, బలాన్ని తిరిగి సృష్టించగల దీని సామర్థ్యం ఒక అద్భుతమైన పురోగతిని సూచిస్తోంది. ఒకవేళ ఈ పద్ధతి రోగులపై విజయవంతమైతే, ప్రస్తుతం దంత వైద్యులు ఎనామిల్‌ నష్టాన్ని ఎదుర్కొనే విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇంతకుముందు సాంప్రదాయ దంత పదార్థాలను ఉపయోగించి కేవలం రక్షించడానికి లేదా పునరుద్ధరించడానికి మాత్రమే వీలైన పంటి ఉపరితలాలను, ఇప్పుడు ఏకంగా తిరిగి నిర్మించే సరికొత్త అవకాశాన్ని ఇది కల్పిస్తోంది.
- సాక్షి స్పెషల్‌ డెస్క్‌

ఇదీ చదవండి: ఆరోగ్యానికి మేలు చేసే దానిమ్మ.. గణాంకాల్లో ఆసక్తికర సంగతులు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement