Tooth pain
-
పంటి సంరక్షణే.. ఆరోగ్యానికి రక్ష..!
పంటి రక్ష ప్రాణాలకు రక్ష అన్నా పర్వాలేదు. ఎందుకంటే నోరు అనే సింహద్వారానికి పళ్లు ద్వార పాలకులు.వాటిని దాటి ఏదీ రాలేదు. కానీ నోటి ఆరోగ్యం దెబ్బతింటే అది గొంతు ఇన్ఫెక్షన్లనూ, దీర్ఘకాలంలో అక్కడి నుంచి గుండెనూ దెబ్బతీసే ముప్పు లేకపోలేదు. అందుకే నోటి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంటే పంటి ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవడమే. మనకు తెలియకుండా...మన రోజువారీ అలవాట్లలో భాగంగా చాలా పనులు చేస్తుంటాం.ఉదాహరణకు పంటికి లుంగజుట్టుకు పోయే చాక్లెట్లు తింటుంటాం. కూల్ వాటర్ తాగుతూ పంటి కిందికి ‘ఐస్’వస్తే నమిలేస్తుంటాం. ఇలా మనం చాలా తేలిగ్గా తీసుకుని చేసే కొన్ని పనులు పంటి ఆరోగ్యాన్నీ... దీర్ఘకాలంలో ఒంటి ఆరోగ్యాన్నీ దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అలాంటి అలవాట్లు ఏమిటో తెలుసుకుని, వాటి నుంచి దూరంగా ఉండటం ఎలాగో, తద్వారా పంటి, ఒంటి ఆరోగ్యాలను కాపాడుకోవడం ఎలాగో తెలుసుకుందాం...ఇప్పటి తరం పిల్లల దూకుడు గురించి చెప్పడానికి చాలానే ఉంటుంది. నేటి యువతలో నలుగురు కలిసి ఎక్కడో పిక్నిక్కు అంటూ కూల్‌డ్రింక్ బాటిల్స్ తీసుకెళ్లారనుకోండి. అక్కడ ఓపెనర్ దొరకకపోతే పళ్లతోనే బాటిల్ మూతలను ఓపెన్ చేసే నైపుణ్యం ఇప్పటి యువకుల సొంతం. అలాగే చాలామంది తమకు తెలియకుండానే పంటిని దెబ్బతీసే పనులు చాలానే చేస్తుంటారు. ఉదాహరణకు రాస్తూ రాస్తూ ఏదో ఆలోచిస్తూ పెన్ను చివరను నోట్లో పెట్టుకుని తేలిగ్గా కొరుకుతూ ఉండవచ్చు. అలాగే పొద్దున్నే బ్రష్ నోట్లో వేసుకుని నలుగురు కలిసి మాట్లాడుకునే టైమ్‌లో బ్రషింగ్‌కు బదులు బ్రష్‌ను నములుతూ ఉండిపోయే పల్లెల్లోని రచ్చబండ బ్యాచ్‌కు కొదవే లేదు. చల్లటి నీళ్లనో లేదా ‘ఛిల్ల్’టి డ్రింక్స్ తాగుతూ ఆ నీళ్లకు పళ్లు అదేపనిగా తాకుతూ ఉండేలా తాగేవారికి లోటు లేదు. మనం అంతగా పట్టించుకోకుండా చేసే ఇలాంటి చాలా పనులు పళ్లకు హాని చేయవచ్చు. నోరు అనేది దేహానికి సింహద్వారం అని చెప్పుకున్నాం కదా. మరి ఆ నోట్లోకి హానికరమైన బ్యాక్టీరియా వచ్చి చేరాక అవి గొంతులోకి... అక్కడ్నుంచి దేహంలోకీ పోతూ... మొత్తం ఒంటికే చేటు తెచ్చే ముప్పు ఎప్పుడూ ΄పొంచే ఉంటుంది. అందుకే అలాంటి కొన్ని చెడ్డ అలవాట్లను చిన్నారులు, యువత దృష్టికి తెచ్చి... వాటిని మాన్పించేలా చేయడమే ఈ కథనం ఉద్దేశం. టైటానిక్‌కు ఐస్‌బర్గ్ లాంటిదే... పంటికి ‘ఐస్’ వాటర్...మంచి టేస్టీ బిర్యానీతో పాటు చల్లటి కూల్‌డ్రింక్ తాగుతుండటం చాలామందికి అలవాటు. అంతేకాదు... ఇటీవలి ఫాస్ట్ ఫుడ్స్ అయిన బర్గర్, పిజ్జాలతో పాటు కోలా క్రిండ్స్ తీసుకోవడం ఇంకొందరికి పరిపాటి. ఒకవేళ వాళ్లు తీసుకోకపోయినప్పటికీ... ఇలాంటి ఫాస్ట్ఫుడ్స్తో పాటు కాంప్లిమెంటరీ డ్రింక్‌గా కూల్‌డ్రింక్స్ చాలా మాల్స్‌లో దొరుకుతూ ఉండటం మామూలే. అందునా ఆ డ్రింక్స్‌లో ఐస్ క్యూబ్స్ వేసి మరీ ఇస్తుంటారు. కొందరు నోట్లోకి వచ్చిన ఆ ఐస్ ముక్కను ఉమ్మేస్తే బాగుండదనుకుని నుములుతూ ఉండటమూ మామూలే. ఇక రకరకాల ఫ్లేవర్స్‌లో దొరికే ‘ఐస్’ఫ్రూట్స్ తినే చిన్నారులు ఒక దశవరకూ వాటిని చప్పరించాక... ఇక ఓపిక తగ్గిపోయి... వాటిని నమిలి మింగేస్తుంటారు. మరికొందరు బాక్సింగ్, కిక్‌బాక్సింగ్, ఫుట్‌బాల్ ప్లేయర్స్ తమ పళ్ల రక్షణ కోసం ఐస్ ముక్కల్ని నోట్లో పెట్టుకుంటారు. అలాంటి ఐస్ ముక్కల కారణంగా చాలామంది పళ్లు దెబ్బతింటాయి. తొలిదశలో కాస్తంత భరించేలా ఉన్న అవే ఐస్ ముక్కలు... పంటి ఎనామిల్ దెబ్బతిన్న తర్వాత జిల్లంటూ బాధించేవరకూ పరిస్థితి వెళ్తుంది. ఐస్ క్యూబ్స్ లేదా ఐస్ నోట్లోకి తీసుకోవడం కారణంగా నోట్లోని ఉష్ణోగ్రత అకస్మాత్తుగా మారిపోవడం వల్ల ఎనామిల్‌లో పగుళ్లు (క్రాక్స్) వచ్చే ప్రమాదం ఉంటుంది. పరిష్కారం: పెద్దవాళ్లు ఐస్ ముక్కలతో కూడిన డ్రింక్స్ తీసుకుంటున్నా... లేదా చిన్నారులు ఐస్ఫ్రూట్లూ, ఐస్‌క్యాండీ తింటున్నా వీలైనంతవరకు ఐస్‌ను నమలకూడదు. అసలు పంటికి ఐస్ తగలకుండా జాగ్రత్త పడాలి. ఇక బాక్సింగ్, కిక్‌బాక్సింగ్ వంటి ఆటగాళ్లు ఐస్‌కు బదులు పళ్ల రక్షణ కోసం మౌత్గార్డ్నే వాడటం మేలు.పళ్లను ఓపెనర్‌గా వాడటం సరికాదు... పిక్నిక్లకు వెళ్లేప్పుడు ఆర్భాటంగా కూల్‌డ్రింక్స్ తీసుకెళ్లే యువకుల్లో చాలామంది ఓపెనర్‌ను తీసుకెళ్లడం మరచిపోయి, సీసా మూతలు తీయడానికి పళ్లను వాడుతుంటారు. బట్టలు కుట్టే టైలర్లలో కొందరు దారం ఎక్కించే ముందర సూదిని పంటితో పట్టుకోవడమూ అక్కడక్కడా కనిపించే దృశ్యమే. అంతేకాదు వాళ్లలో కొందరు దారాన్ని పంటితోనే తెంపుతుంటారు. షాంపూ షాచేలను చింపడానికి కొందరు పళ్లనే ఉపయోగిస్తుంటారు.పరిష్కారం: పంటి రక్షణ కోసం గుర్తుంచుకోవాల్సిందేమిటంటే... మన పళ్లు ఓపెనర్లు కాదు. అలాగే కత్తెరకు బదులుగా పళ్లను వాడటమూ సరికాదు. ఈ పనులు చేసే చాలామందిలో పళ్ల ఎనామిల్ దెబ్బతినే ప్రమాదముంది. పంటి తాలూకు చిన్న ముక్క ఊడిపోయే ముప్పు కూడా పొంచి ఉంటుంది. ఇలాంటి పనులతో పళ్లు త్వరగా దెబ్బతింటారు. అందుకే సీసా మూతలు తీయడానికి ఓపెనర్‌నే వాడాలి. షాంపూ షాచేలు చింపాలంటే కత్తెరనే వాడాలి. అంతేతప్ప పళ్లను వాడకూడదని గుర్తుంచుకోవాలి.పండ్లరసాల్లోని చక్కెర పళ్లకు ముప్పు... పండ్లరసాలు ఆరోగ్యానికి చాలామంచివంటూ చాలామంది వాటిని తాగేస్తూ ఉంటారు. అలాగే ఎనర్జీ డ్రింక్స్ అనీ, స్పోర్ట్స్ డ్రింక్స్ అనీ తాగేస్తూ తమకు ఆరోగ్యంతో కూడిన శక్తి సమకూరుతోందంటూ ఆనందిస్తుంటారు. నిజానికి ఫ్రూట్ జ్యూసుల్లో, స్పోర్ట్స్ డ్రింక్స్‌లో ఉండే చక్కెరతో పళ్లు పుచ్చిపోవడం, దంతక్షయానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాదు... లైమ్జ్యూస్ల వంటి పుల్లటి పండ్లరసాల్లోనియాసిడ్ వల్ల పళ్లు దెబ్బతినే ముప్పు పెరుగుతుంది. పరిష్కారం: చక్కెర మోతాదు ఎక్కువగా ఉండే పండ్లరసాలను వీలైనంత తక్కువగా తీసుకోవాలి. అలాంటి పానీయాలు తాగేటప్పుడు ఆ ద్రవం వీలైనంతవరకు పంటికి తగలకుండా తాగడం మేలు. ఇక తీపి ఎక్కువగా ఉండే డ్రింక్స్ లేదా పండ్లరసాలు తాగాక నోరు శుభ్రంగా కడుక్కోవడం మరచిపోవద్దు.పండ్లూ... పళ్లు... ప్రాధాన్యం దేనికి... ఏ సీజన్లో దొరికే మంచి తాజాపండ్లను ఆయా సీజన్లలో తినడం మంచి అలవాటే. అది ఆరోగ్యానికి మేలు చేసే అంశమే. కాకపోతే మరీ చక్కెర మోతాదులు ఎక్కువగా ఉండే పండ్లనూ, పులుపు మోతాదు కాస్తంత ఎక్కువగా ఉండే బత్తాయి, ద్రాక్ష, ఆరెంజ్ జ్యూస్‌లను వీలైనంత మేరకు పళ్లకు తగలకుండా తీసుకోవడం మేలు. ఎందుకంటే పుల్లటి పండ్లలో ఉండే ఆ పులుపులో ఉండే ఆమ్ల గుణం పంటిని దెబ్బతీసే ముప్పు ఎప్పుడూ ఉంటుంది.పరిష్కారం: పండ్లను ఫ్రూట్జ్యూస్లుగా తాగడం కంటే వాటిని కొరికి తినడం మంచిది. ఒకవేళ జ్యూస్ రూపంలో తాగాలనుకుంటే... ఆ పానీయంలో చక్కెర కలుపుకోవడం తగదు. ఇక జ్యూస్ రూపంలో తాగినప్పటికీ... వెంటనే నోరు కడుక్కోవడం మరచిపోవద్దు.కరకరలాడే చిప్స్‌తో కిరికిరి... చిప్స్ కరకరలాడుతూ నాలుకకు రుచిగా ఉండవచ్చు. కానీ పళ్లకు అంత మంచివి కాదు. పైగా కరకరలాడే పదార్థాలు పళ్లకు ప్రమాదం తెచ్చిపెట్టే అవకాశాలెక్కువ. అంతేకాదు చిప్స్ లాంటి చిరుతిండ్లలో స్టార్చ్ కూడా ఎక్కువ. ఈ స్టార్చ్ లాలాజలం తగలగానే దాదాపు చక్కెరలా మారిపోయి పంటిని దెబ్బతీసే ముప్పు మరీ ఎక్కువ. అందుకే చిప్స్ లాంటివి తిన్న 20 నిమిషాల తర్వాత అవి పంటిని దెబ్బతీయడం మొదలు పెడతాయి. అంతేకాదు... పంటి మధ్యన చిక్కుకునే చిప్స్ తాలూకు చిన్న చిన్న ముక్కలతో దంత క్షయం ముప్పు మరింత పెరుగుతుంది. ఇక మరికొందరు పిల్లలూ, ఆ మాటకొస్తే కొందరు పెద్దలు కూడా ఎప్పుడూ ఏదో ఓ చిరుతిండిని నములుతూ ఉంటారు. దాంతో చిరుతిండిలో ఉండే పిండిపదార్థాలూ, చక్కెర వంటి పంటికి ముప్పు తెచ్చే అంశాలు పళ్లను దెబ్బతీస్తాయి.పరిష్కారం: వీలైతే తరచూ చిరుతిండ్లు తినే అలవాటుకు దూరంగా ఉండటం మేలు. లేదంటే చిరుతిండి తిన్న వెంటనే నోరు శుభ్రంగా కడుక్కోవాలి. చిరుతిండ్లకు బదులుగా క్యారట్ వంటిని నములుతూ ఉండటం మంచిది. ఇక చిప్స్ లాంటి చిరుతిండ్లను వీలైనంత తక్కువగా తినాలి. ఒకవేళ తప్పక తినాల్సివచ్చినప్పుడు తిన్నవెంటనే నోరు కడుక్కోవడం, వీలైతే ఫ్లాసింగ్ చేసుకోవడం (దారంతో పళ్ల మధ్య చేరే చిన్న చిన్న ముక్కలను శుభ్రపరచుకోవడం) తప్పనిసరి.కాఫ్ సిరప్తోనూ దంతక్షయం...చాలామంది కాఫ్ సిరప్ అనేది దగ్గు తగ్గేలా చేసే ఓ మందు అనుకుంటారు గానీ అందులో ఔషధంతో పాటు చక్కెర మోతాదులూ ఉంటాయి. ఆ చక్కెర పంటి ఆరోగ్యానికి ప్రమాదం తెచ్చిపెట్టే అవకాశాలుంటాయి. పరిష్కారం: దగ్గు మందును వీలైనంత మేరకు పలువరసకు తగలకుండా గొంతులో పోసుకోవడం మేలు. అలాగే దగ్గు మందు తాగిన వెంటనే నోరు కడుక్కోవడం మరచిసెవద్దు.తప్పుడు బ్రష్షింగ్ సరికాదు... చాలామంది బ్రష్ చేసుకోడానికి నోట్లో బ్రష్ పెట్టుకుంటారు గానీ... ఆ ప్రక్రియను వేగంగా ముగించకుండా అదేపనిగా నములుతుంటారు. ఇక కొందరు తప్పుడు పద్ధతుల్లో బ్రష్షింగ్ చేసుకుంటూ ఉంటారు. ఇంకొందరు నోరు శుభ్రంగా ఉండాలనే తపనతో విపరీతంగా బ్రష్ చేసుకుంటారు. ఈ అన్ని చర్యలతోనూ పళ్లు త్వరగా అరిగిపోయే ముప్పు ఉంటుంది.పరిష్కారం: మృదువైన బ్రిజిల్స్ ఉన్న టూత్‌బ్రష్‌ను ఎంచుకోవాలి. పంటి మీద ఎక్కువ ఒత్తిడితో బ్రష్షింగ్ చేయకూడదు. బ్రష్షింగ్ చేసే సమయంలో పంటికి అడ్డంగా కాకుండా నిలువుగా బ్రష్ చేసేలా టూత్‌బ్రష్‌ను కదిలించాలి. సున్నాలు చుడుతున్నట్లుగా (సర్క్యులర్గా) కదిలిస్తూ బ్రష్ చేసుకోవడం సరైన పద్ధతి. ఈ సమయంలో చిగుర్లకూ మాలిష్ జరుగుతుండేలా బ్రష్ కదలికలు (స్ట్రోక్స్) ఉండాలి. బ్రషింగ్ పూర్తయ్యాక వేలిచివరతో చిగుర్లను మాలిష్ చేస్తున్నట్లుగా సున్నాలు చుడుతున్నట్లుగా కదిలించాలి. కనీసం ప్రతి మూడు నెలలకు ఒకసారైనా బ్రష్‌ను మార్చడం మేలు. ఒకవేళ జ్వరం రావడం లేదా ఆరోగ్యం చెడిపోవడం జరిగితే... కోలుకున్న వెంటనే బ్రష్‌ను మార్చడం మంచి పద్ధతి. ఇలా ఆరోగ్యం చెడిపోయినప్పుడు బ్రష్ మార్చడానికి మూడు నెలలు ఆగడం అనే నిబంధన పనికిరాదు.ఆ జబ్బుతో పంటికి ముప్పు... కొందరు ‘బ్రక్సిజం’ అనే జబ్బు కారణంగా పదే పదే పళ్లు కొరుకుతూ ఉంటారు. ఇలాంటి వారు రోజువారీ ఒత్తిడుల కారణంగా తమకు తెలియకుండానే నిద్రలో పళ్లు కొరుక్కుంటూ ఉంటారు. ఇలా పళ్లు కొరుకుతూ ఉండేవారిలో పళ్లు త్వరగా అరిగిపోతాయి. ఇక మరీ గట్టి పదార్థాలను అదేపనిగా నమలడం కూడా పంటి అరుగుదలను వేగవంతం చేస్తుంది.పరిష్కారం: నిద్రలో పళ్లు కొరికే అలవాటు ఉన్నవారు కారణాన్ని తెలుసుకుని, ఆ అలవాటును మానుకోవాలి. బ్రక్సిజం ఉంటే చికిత్స తీసుకోవడం, ఒత్తిడి ఉన్నవారు దాన్ని తగ్గించుకునేందుకు ధ్యానం, రిలాక్సేషన్ టెక్నిక్స్ అనుసరించాలి.ఎంత తక్కువ అయినా ముప్పే... గుండెపోటు నివారణకు తోడ్పడుతుందంటూ కొందరు రెడ్‌వైన్ తాగుతుంటారు. మిగతా ఆల్కహాలిక్ డ్రింక్స్‌తో ΄ోలిస్తే రెడ్‌వైన్ ఆరోగ్యకరమనే అపోహ చాలామందిలో ఉంటుంది. నిజానికి రెడ్వైన్లో క్రోమోజెన్ ట్యానిన్స్ అనే రంగునిచ్చే పదార్థాలు ఉంటాయి. ఇవి పంటి ఎనామిల్‌ను దెబ్బతీస్తాయి. దాంతో పళ్లు మెరుపును కోల్పోతాయి. అంతేకాదు... ఎంత తక్కువ మోతాదులోనైనా ఆల్కహాల్ ఒంటికి ముప్పు తెచ్చే అంశమే!పరిష్కారం: అది ఎంతటి ఖరీదైన లేదా నాణ్యమైన రెడ్‌వైన్ అయినప్పటికీ అది మద్యమే తప్ప ఆరోగ్యప్రదాయిని కానే కాదు. అదీ ఒకరకమైన మద్యమే కాబట్టి ఆ అలవాటును మానుకోవడమే మేలు.గోళ్లు కొరికే అలవాటు... పళ్లకు చేటు... కొందరు అదేపనిగా గోళ్లు కొరుక్కుంటుంటారు. ఈ చెడ్డ అలవాటుతో పళ్లు దెబ్బతింటాయి. గోళ్ల ద్వారా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నోటి ద్వారా కడుపులోకి వెళ్లి ఆరోగ్యం దెబ్బతినవచ్చు.పరిష్కారం: గోళ్లు కట్ చేసుకోవాలనుకుంటే నెయిల్ కట్టర్‌నే వాడాలి. టెన్షన్ వల్ల ఈ అలవాటు వస్తే... ధ్యానం, రిలాక్సేషన్ టెక్నిక్స్ వంటి వాటితో ఆ దురలవాటుకు దూరం కావాలి. పళ్లు కుట్టుకోవడం ఓ బ్యాడ్ హ్యాబిట్... చాలామంది ఏదైనా తినగానే టూత్‌పిక్స్‌తో పళ్లు కుట్టుకుంటారు. ఈ అలవాటు వల్ల పళ్ల మధ్య సందులు మరింత పెరిగే ముప్పు ఉంటుంది. ఫలితంగా పళ్ల మధ్య మరింత ఆహారం చిక్కుకుని, బ్యాక్టీరియా పెరగడం, దాంతో పళ్లు మరింత వదులు కావడం వంటి ముప్పు ఉంటుంది.పరిష్కారం: పళ్లు కుట్టుకునే అలవాటు మానేయాలి. వీలైతే ఫ్లాసింగ్ చేసుకోవాలి.చివరగా... ఇక్కడ పేర్కొన్న చెడు అలవాట్లను వదులుకుంటే అవి చాలావరకు నోటికీ, పలువరసకు, పంటి చిగుర్లకు మాత్రమే కాదు... మొత్తం దేహానికే మంచి చేస్తాయని, ఓవరాల్ ఆరోగ్యానికీ మంచిదని గుర్తుంచుకోవవడం మేలు.‘టీత్’కు ముప్పు తెచ్చిపెట్టే టీలు... కాఫీలుకొందరు కాఫీలు, టీలు చాలా ఎక్కువగా తాగుతుంటారు. ఇక తమ పనిలో ఒత్తిడిని అధిగమించడానికి టీ, కాఫీలను అలవాటు చేసుకుంటుంటారు. కొంతలో కొంత టీ వల్ల అంతగా ముప్పు ఉండదేమోగానీ... కాఫీలో ఉండే అసిడిక్ గుణం వల్ల పలువరస పచ్చగా మారే ముప్పు ఉంటుంది. టీ కూడా మరీ ఎక్కువగా తాగుతూ ఉంటే అదీ తెల్లటి పలువరస రంగుమారేలా చేస్తుంటుంది. అంతేకాదు... బాగా వేడివేడిగా ఉండే టీ, కాఫీలలోని ఉష్ణోగ్రత వల్ల పంటి ఎనామిల్ దెబ్బతీనే అవకాశమూ ఉంటుంది. అందుకే చాలాకాలం పాటు టీ, కాఫీలు మితిమీరి తాగుతుండే కొందరిలో పంటి మెరుపు తగ్గే ముప్పు కూడా ఉంటుంది. ఇక కాఫీ, టీలలో ఉండే చక్కెర పంటికి అంటుకుపోవడం వల్ల పళ్లమధ్య క్యావీటీలూ, పిప్పిపళ్లు వచ్చే ముప్పు కూడా ఎక్కువే. పరిష్కారం: కాఫీ, టీలు తాగే అలవాటు ఉన్నవారు వాటిని పరిమితంగానే తీసుకోవాలి. ఇప్పటికే ఈ అలవాట్ల కారణంగా పళ్లు పచ్చబారి ఉంటే బ్లీచింగ్ చేయించుకోవడం ద్వారా వాటిని మళ్లీ మెరిసేలా చేసుకోవచ్చు.పాన్లూ, జర్దా / ఖైనీలు వద్దు... చాలామంది అదేపనిగా పాన్ తింటూ ఉంటారు. అందులో వక్కలను నములుతూ ఉంటారు. ఇక అందులో జర్దా, ఖైనీ వంటి పొగాకు ఉత్పాదనలు నోటి ద్వారా తీసుకుంటూ ఉంటారు. ఇందులో పాన్‌లోని కఠినమైన వక్కలను తినడం ఒక ప్రమాదమైతే... ఇక నోటి ద్వారా పొగాకును తీసుకోవడం పంటికీ, ఒంటికీ... ఈ రెంటికీ చాలా ప్రమాదం. ఇక పాన్ తినేవారి నోట్లో పళ్లు ఎర్రగా, చాలాకాలం నుంచి అదే అలవాటు ఉన్నవారిలో నల్లబారి ఉండటం చూస్తుంటాం. పరిష్కారం: పాన్ తినే అలవాటు ఉన్నవారు తక్షణం ఆ అలవాటు మానివేయడం తప్పనిసరి. లేదంటే పళ్లకే కాదు మొత్తం దేహానికే ఈ అలవాటు చేటు తెచ్చిపెట్టవచ్చు. పాన్పరాగ్లూ, జర్దా వంటి పొగాకు ఉత్పాదనల వల్ల నోటి క్యాన్సర్ వచ్చే ముప్పు చాలా ఎక్కువ.సిగరెట్లతో వచ్చే ముప్పు ఎన్నో రెట్లు... సిగరెట్ అలవాటు అనేది కేవలం పళ్లను మాత్రమే దెబ్బతీయదు. అది పూర్తిగా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్నీ, గుండెనూ... ఒక్కోసారి పూర్తిగా శరీర ఆరోగ్యానికి ముప్పుగ పరిణమించవచ్చు. సిగరెట్ అలవాటు ఉన్నప్పుడు అది కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు... నోటి దుర్వాసనతో నలుగురిలో స్వేచ్ఛగా మాట్లాడగిగే సోషలైజింగ్కూ పరిమితులు విధిస్తుంది. పొగాకు వల్ల పంటి చిగుర్లకూ ఎన్నో రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు... నోటి క్యాన్సర్లూ, పెదవుల, నాలుక, గొంతు క్యాన్సర్ల (హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ల) ముప్పును తెచ్చిపెడుతుంది. పరిష్కారం: సిగరెట్లతో / పొగతాగడం వల్ల ఆరోగ్యానికి కలిగే ముప్పు తప్పాలంటే తప్పక పొగతాగే అలవాటును వదిలివేయాల్సిందే. అప్పటికీ ఆ అలవాటును వదలలేకపోతే డాక్టర్ సలహా మేరకు కొంతకాలం పాటు చ్యూయింగ్ గమ్స్ వంటి ప్రత్యామ్నాయాలు చూసుకోవాలి. ఇలాంటి ప్రత్యామ్నాయాలు కూడా కొద్దికాలం కోసమే.పెన్సిల్‌ను కొరకవద్దు... కొందరు ఏదైనా రాస్తూ రాస్తూ ఉండి మధ్యమధ్యన ఏదో ఆలోచిస్తూ పెన్సిల్‌ను గానీ లేదా పెన్ క్యాప్‌ను గానీ పళ్ల మధ్య పెట్టుకొని కొరుకుతుంటారు. పెన్సిల్ మధ్యన ఉండే లెడ్ చాలా ప్రమాదకారి. ఈ లెడ్పాయిజన్ చిగుర్ల రంగును నల్లగా మారుస్తుంది. పైగా లెడ్ పాయిజన్ మేనికి కూడా ప్రమాదకరమే. పరిష్కారం: రాస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు పళ్లమధ్యకు పెన్నూ, పెన్సిల్ పెట్టుకోవద్దు. మరీ తప్పనప్పుడు చ్యూయింగ్‌గమ్ వంటివి నములుతూ ఉండటం కాస్తంత బెటర్. అసలు నమిలే అలవాటును మానుకోవడమే ఆరోగ్యానికి మేలు.పళ్లకు చుట్టుకుపోయే చాక్లెట్లు... తియ్యటి చాక్లెట్లు అంటే పిల్లలందరికీ ఇష్టమే. పైగా కొందరు పెద్దవాళ్లు కూడా తమకు మంచి ఆరోగ్య సమకూరడానికి డార్క్ చాక్లెట్లు తీసుకుంటూ ఉంటారు. అయితే చాక్లెట్లలో చాలావరకు పళ్లకు చుట్టుకుపోతూ ఉంటాయి. అలా చుట్టుకుపోవడంతో అందులోని చక్కెరను చాలాసేపు పంటిని అంటిపెట్టుకునే ఉంటూ... దంతక్షయానికి దారి తీస్తుంది. అంతేకాదు.. అలా చాలాకాలం పాటు చాక్లెట్లు చుట్టుకుపోవడం, పళ్లపైన ఉండే గుంటవంటి ప్రదేశంలో ఇరుక్కుపోవడం వల్ల పళ్లమధ్య రంధ్రాలు (క్యావిటీలు) పడే అవకాశాలెక్కువ. చదవండి: మగవారిపై కేన్సర్ పడగ.. భయపెడుతున్న గణాంకాలు..ఈ రంధ్రం లోతు పెరుగుతున్న కొద్దీ... అందులో ఆహారపదార్థాలూ, చాక్లెట్ల వంటి చుట్టుకుపోయే పదార్థాలు మరింత ఎక్కువగా ఇరుక్కుపోతూ ఆ రంధ్రాలను మరింత లోతు ఎక్కువయ్యే ముప్పు ఉంటుంది. ఇలాంటి చర్యల వల్లనే పిల్లల్లో పిప్పిపళ్లు వస్తుంటాయి. పరిష్కారం: పంటిని చుట్టుకుపోయే చాక్లెట్లు, క్యాండీలు తీసుకున్న వెంటనే బ్రష్ చేసుకోవడం లేదా ఆ చుట్టుకుపోయిన పదార్థాలు పూర్తిగా తొలగిపోయేలా వేలిని ఉపయోగించి నోరు కడుక్కోవాలి.పాల బాటిల్ పళ్ల మధ్య పెట్టడం సరికాదు... కొందరు పిల్లలు రాత్రంతా పాలసీసా పళ్ల మధ్య పెట్టుకుని నిద్రపోతుంటారు. పిల్లలు అల్లరి చేయకుండా ఉండటానికి చాలామంది తల్లులు ఈ అలవాటును ప్రోత్సహిస్తుంటారు. నిజానికి ఈ దురలవాటు వల్ల పిల్లలకు ‘మిల్క్బాటిల్ కేరిస్’ అనే సమస్య వచ్చే అవకాశముంది. దాంతో చిన్నారుల్లో పిప్పిపళ్లు వచ్చి పళ్లన్నీ దెబ్బతినే ప్రమాదం ఉంది. పైగా పాలలో ఉండే చక్కెరవల్ల కూడా పళ్లు పుచ్చిపోతాయి.పరిష్కారం: రాత్రివేళల్లో పిల్లల నోటికి పాలసీసా ఇవ్వడం సరికాదు. మరీ తప్పనిసరై చిన్నారులకు పాలను పట్టించాల్సి వస్తే గ్లాసు / స్పూన్ / ఉగ్గుగిన్నెతో పాలు పట్టించాలి. పిల్లలు పాలు తాగాక పెద్దపిల్లలకు బ్రషింగ్ చేయించడమూ లేదా బ్రషింగ్‌కు వీలుకాకపోతే కనీసం ఒక గ్లాసు నీళ్లయినా తాగించడం అవసరం.- డాక్టర్ ప్రత్యూష, కన్సల్టెంట్, డెంటల్ – కాస్మెటిక్ సర్జన్ నిర్వహణ యాసీన్ -
అరుదైన శస్త్రచికిత్స: దంతంతో కంటి చూపు..!
"సర్వేంద్రియాణాం నయనం ప్రధానం" అన్నారు పెద్దలు. కళ్లే లేకపోతే ఏం నేర్చుకోవాలన్న కష్టమే. అంధత్వంతో బాధపడేవాళ్లకు బాగా తెలుస్తోంది ఆ ఇబ్బంది ఏంటో. అయితే పుట్టుకతో కంటి చూపు కోల్పోయినా, లేదా ఏదైనా వ్యాధి కారణంగా కంటి చూపు కోల్పోయినా తిరిగి చూపు ప్రసాదించడం కాస్త కష్టం మవుతుంది. కంటి చూపుకి కారణమయ్యే, నరాలు, కార్నియా బాగుంటేనే అదంతా సాధ్యం. అలాంటిది వైద్యులు సరికొత్త వైద్య విధానంతో అంధత్వంతో భాధపడుతున్న వాళ్లకు సరికొత్త ఆశను అందించారు. కంటికి దంతం సాయంతో చూపుని ప్రసాదించారు వైద్యులు. ఇలాంటి ప్రక్రియ ద్వారా చూపుని ప్రసాదించిన తొలి కేసు ఇదేకావడం విశేషం.కెనడియన్ మహిళ గెయిల్ లేన్‌కి 'టూత్ ఇన్ ఐ' అనే అరుదైన శస్త్ర వైద్య విధానంతో చూపుని ప్రసాదించారు. దీన్ని వాంకోవర్‌లోని మౌంట్ సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ నిర్వహించింది. ఈ మేరకు డాక్టర్ గ్రెగ్ మోలోనీ శస్త్ర చికిత్స గురించి వివరిస్తూ..ఈ ప్రక్రియ గురించి చాలామంది వైద్యులకు తెలియదని అన్నారు. ఇది క్రియాత్మక కార్నియాను సృష్టించడానికి రోగి పంటిలో లెన్స్‌ను అమర్చి చేస్తారని చెప్పారు. ఇది సంక్లిష్టమైన ప్రక్రియని, రెండు దశల్లో నిర్వహించినట్లు తెలిపారు. ముందుగా రోగి నోటిలో దంతాన్ని ఒకటి తీసి సరైన ఆకృతిలోకి మార్చి, దానిలో ప్లాస్టిక్ లెన్స్‌ని చొప్పిస్తారు. ఈ సవరించిన దంతాన్ని ఆమె చెంపలో మూడు నెలలపాటు ఉంచుతారు. ఆ తర్వాత అవసరమైన కణాజాలాన్ని అభివృద్ధి చేసిన తర్వాత నేరుగా కంటిలో అమర్చుతామని వివరించారు. ఆమె చెంప నుంచి కణజాల అంటుకట్టుతో దీన్ని అమర్చడం సాధ్యమవుతుందని అన్నారు. ఎందుకంటే సహజ బంధన కణజాలం దంతంలో లేకపోవడంతో ఇలా చేయాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు.అయితే ఈ ప్రక్రియ అన్ని దృష్టి సమస్యలకు సరిపోయే వైద్య విధానం మాత్రం కాదని డాక్టర్ మోలోనీ నొక్కి చెప్పారు. ఆటో ఇమ్యూన్ వ్యాధులు, రసాయన కాలిన గాయాలు లేదా ఇతర గాయాలు, కండ్లకలక మచ్చల వల్ల తీవ్రమైన కార్నియల్ అంధత్వంతో బాధపడుతున్న వ్యక్తులకు ఈ వైద్య విధానం ఉపయోగపడుతుందని అన్నారు. ఈ శస్త్ర చికిత్స మంచి ఫలితం ఇవ్వాలంటే మాత్రం సదరు రోగులకు ఆరోగ్యకరమైన రెటీనా, ఆప్టిక్ నరాలను కలిగి ఉండాలని అన్నారు. చివరగా సదరు రోగి గెయిల్ లేన్ తాను పదేళ్లుగా చూడలేదని..ఇప్పుడూ గనుక ఈ ప్రక్రియ సఫలమైతే భయం, ఆశ రెండూ ఒకేసారి కలుగుతాయంటూ కన్నీళ్లు పెట్టుకుందామె. కంటి చూపు వస్తే మాత్రం తప్పక చూడాల్సిన అద్భుతాలు ఎన్నో ఉన్నయంటూ సంతోషభరితంగా చెబుతోంది లేన్.(చదవండి: చికెన్ 65'కి ఆ పేరెలా వచ్చింది..? ఆ నెంబర్‌తో పిలవడానికి రీజన్..?) -
హతవిధీ..! నిద్రలో పళ్ల సెట్ మింగేయడంతో..!
పళ్లు బాగా కదులుతున్నప్పుడు.. దంతవైద్యులు వాటిని తీసి, వాటి బదులు కృత్రిమ దంతాలు అమరుస్తారు. అలా అమర్చిన దంతాలు నిద్రలో ఉండగా ఊడిపోగా.. వాటిని మింగేశారో వ్యక్తి! అవి వెళ్లి ఊపిరితిత్తుల్లో ఇరుక్కుపోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. విశాఖపట్నంలో జరిగిన ఈ విషయం గురించి కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ సీహెచ్ భరత్ తెలిపారు.“ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నానికి చెందిన 52 ఏళ్ల ఉద్యోగి సుమారు రెండు మూడేళ్ల క్రితం పళ్లు కట్టించుకున్నారు. దంతవైద్యులు ఆయనకు ఎప్పటికీ అతుక్కునే ఉండే పళ్ల సెట్ అమర్చారు. అయితే, అవి కూడా అప్పుడప్పుడు ఊడే ప్రమాదం ఉంటుంది. ఈయన నిద్రలో ఉన్నప్పుడు అలాగే అది ఊడిపోయింది. అప్పుడు ఆయన తెలియకుండానే దాన్ని మింగేయడంతో అది నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోయింది. కుడి ఊపిరితిత్తి మధ్యభాగంలో ఇది ఇరుక్కుంది. అయితే అదే సమయంలో ఎడమ ఊపిరితిత్తి పూర్తిగా పనిచేస్తుండడం, కుడి ఊపిరితిత్తిలోనూ పైన, కింది భాగాలు పనిచేయడంతో శ్వాస సంబంధిత సమస్యలు రాలేదు గానీ, లోపల ఫారిన్ బాడీ ఉండడంతో బాగా దగ్గు వచ్చింది. దీంతో రోగి కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి వచ్చారు. ఇక్కడ ఆయనకు ముందుగా ఎక్స్ రే, తర్వాత సీటీ స్కాన్ చేసి చూస్తే.. కుడివైపు ఊపిరితిత్తిలో పళ్ల సెట్ ఉందని తెలిసింది. దాంతో ఆయనకు జనరల్ ఎనస్థీషియా ఇచ్చి, రిజిడ్ బ్రాంకోస్కొపీ అనే పరికరం సాయంతో అత్యంత జాగ్రత్తగా దాన్ని బయటకు తీశాం. దానికి రెండువైపులా లోహపు వస్తువులు ఉండడంతో వాటివల్ల ఊపిరితిత్తులకు గానీ, శ్వాస నాళానికి గానీ ఏమైనా గాయం అవుతుందేమోనని చాలా జాగ్రత్తగా తీయాల్సి వచ్చింది. ఒకవేళ అలా గాయమైతే అక్కడినుంచి రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంటుంది. అయితే అదృష్టవశాత్తు దాదాపు నోటివరకు వచ్చిన తర్వాతే చిన్న గాయం అయ్యింది, దాన్ని కూడా వెంటనే సరిచేయడంతో ఎలాంటి ఇబ్బంది కాలేదు. పెద్ద పరిమాణంలో ఉండి, వంపుతో ఉన్న, పదునైన వస్తువులను తీయడానికి రిజిడ్ బ్రాంకోస్కొపీ బాగా ఉపయోగపడుతుంది.సాధారణంగా మన శరీరంలో ఏదైనా వస్తువు ఎక్కడైనా అమర్చాల్సి వస్తే.. అలాంటి వాటికి కొంత జీవనకాలం ఉంటుంది. ఆ తర్వాత అవి ఎంతో కొంత పాడయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల అలాంటి సందర్భాల్లో తప్పనిసరిగా ఎప్పటికప్పుడు సంబంధిత వైద్యులను సంప్రదిస్తూ జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేతప్ప, ఒకసారి వేశారు కాబట్టి జీవితాంతం అవి అలాగే బాగుంటాయని అనుకోకూడదు. ముఖ్యంగా పళ్ల సెట్ కట్టించుకునేవారు ఎప్పటికప్పుడు దంతవైద్యులను సంప్రదిస్తూ దాన్ని చూపించుకోవాలి. ఇలా నిద్రలో మింగేసి, అది ఎక్కువకాలం ఉండిపోతే లోపల దానిచుట్టూ కండ పెరిగిపోయి, ఇన్ఫెక్షన్ కూడా ఏర్పడే ప్రమాదం ఉంటుంది” అని డాక్టర్ భరత్ తెలిపారు.పల్మనాలజిస్ట్ డాక్టర్ సీహెచ్ భరత్, కిమ్స్ ఐకాన్ ఆస్పత్రి(చదవండి: పెద్దపేగు కేన్సర్ నివారణకు...) -
అడవిలో పెద్దపులికైనా తప్పని కష్టంరా సామీ అది!
మాంసాహారం తిన్నతరువాత ఒక విచిత్రమైన ఇబ్బంది ఉంటుంది. చికెన్ లేదా మటన్ కర్రీని లొట్టలేసుకుంటూ తిన్నంత సేపు బాగానే ఉంటుంది కానీ మాంసపు తునకలు పళ్ల సందుల్లో ఇరుక్క పోయినపుడు ఇబ్బంది ఉంటుంది కదా నా సామి రంగా. వాటిని తొలగించేందుకు టూత్ పిక్‌లు, పిన్సీసులతో పెద్ద యుద్ధమే చేయాలి. ఏదీ లేకపోతే.. చివరికి నాలుకతో అయినా సరే దాన్ని లాగి పడేసేదాకా మనశ్శాంతి ఉండదు. అడవిలో ఒక పులికి కూడా ఇలాంటి సమస్యే ఎదురైంది. ఒక పెద్ద మాంసం ముక్క దాని పంటిలో చిక్కుకుంది. దీంతో నానా కష్టాలు పడుతున్న పులిని చూసిన వెటర్నరీ వైద్యులు దాని కోరల్లో ఇరుక్కున్న మాంసం ముక్కను లాగి పడేశారు. కేవలం 16 సెకన్లుఉన్న ఈ వీడియో 30.3 లక్షలకుపైగా వ్యూస్‌ను దక్కించుకుంది. నేచర్ ఈజ్ అమేజింగ్ అనే ట్విటర్ హ్యాండిల్ దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది.Vet removing a bone stuck to a tigers tooth pic.twitter.com/WjmqFNw8fZ— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) October 15, 2024 -
Bangemudha: పంటినొప్పులకు విరుగుడట!
ఈ చెట్టు కాండానికి నాణెం కొడితే పంటినొప్పులు తగ్గుతాయట! అలాగని భక్తుల విశ్వాసం. నేపాల్ రాజధాని కఠ్మాండూలోని దర్బార్ చౌరస్తా నుంచి థమేల్ వైపు వెళ్లే మార్గంలో ఉంటుంది ఈ విచిత్రం. వైశాదేవ్ ఆలయ ప్రాంగణంలో ‘బంగెముధా’ అనే చెట్టు కాండం శతాబ్దాలుగా ఉంది. ఆలయాన్ని దర్శించుకునే భక్తుల్లో దంతబాధలు ఉన్నవారు ఈ కాండానికి మేకులతో నాణేలను కొట్టి తగిలిస్తారు. దీనివల్ల దంతబాధలు తగ్గిపోతాయని వారు నమ్ముతారు. నేపాల్ ప్రాంతాన్ని లిచ్ఛావి వంశస్థులు పాలించే కాలం నుంచి– అంటే, సుమారు క్రీస్తుశకం 400–750 మధ్య కాలం నుంచి ఈ కాండం ఇక్కడే ఉన్నట్లు చెబుతారు. ఆధునిక దంతవైద్యం ఇటీవలి కాలంలో బాగా అభివృద్ధి చెందినప్పటికీ, ఇక్కడి జనాలు దంతబాధల నివారణకు ఇప్పటికీ ఈ చెట్టు కాండాన్నే నమ్ముకుంటూ ఉండటం విశేషం. ప్రతిరోజూ వందలాది భక్తులు ఈ చెట్టుకాండానికి నాణేలు కొట్టి మొక్కుకుని వెళుతుంటారు. ఈ కాండంలోని పెద్ద తొర్ర లోపల బంగారు దేవతా విగ్రహం ఉండేదని, అది చోరీకి గురైందని కూడా కఠ్మాండూ ప్రజలు చెప్పుకుంటుంటారు. అయితే, తొర్ర లోపలి విగ్రహానికి సంబంధించి ఆధారాలేవీ లేవు. వైశాదేవ్ ఆలయ పరిసరాల్లో డజనుకు పైగా దంతవైద్యుల క్లినిక్‌లు ఉన్నా, జనాలు ఇక్కడకు పెద్దసంఖ్యలో వస్తుండటం చూసి విదేశీ పర్యాటకులు ఆశ్చర్యపోతుంటారు. -
పిల్లలు నిద్రలో పళ్లు కొరుకుతోంటే ఏం చేయాలి?
చిన్నారులు నిద్రలో పళ్లు కొరుకుతున్నారంటే అది వారిలో అంతర్గతంగా ఉన్న ఆందోళన, టెన్షన్, ఒత్తిడి కారణం వల్ల కావచ్చు. ఇలా నిద్రలో పళ్లు కొరికే కండిషన్‌ను వైద్యపరిభాషలో ‘బ్రక్సిజమ్’ అంటారు. పిల్లల్లో ఇది చాలా సాధారణంగా కనిపించడంతో పాటు వారి మెుదటి ఐదేళ్ల వ్యవధిలో మెుదలయ్యే సమస్య ఇది. సాధారణంగా చిన్నారుల్లో ఆందోళన, కోపం, వ్యాకులత, కంగారు, తొందరపాటుతో ఉండటం, పోటీ తత్వంతో వ్యవహరించడం వంటివి ఉన్నప్పుడు ఈ బ్రక్సిజమ్ సమస్య వారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఈ సమస్యను అధిగమించాలంటే ముందుగా వాళ్లలో ఆందోళన, వ్యాకులతకు కారణమయ్యే అంశాలేమిటో తెలుసుకుని, దాన్ని తగ్గించేందుకు ప్రయత్నించాలి. నిద్రకు వుుందు వాళ్లు సంతోషంగా, ఆహ్లాదంగా ఉండేలా తల్లిదండ్రులు చూడాలి. పిల్లలతో మాట్లాడుతూ వారి మనసుల్లో ఉన్న భయాలు, శంకలు తొలగించేలా వ్యవహరించాలి. అలాగే పిల్లలు నిద్రకుపక్రమించే సమయంలో కెఫిన్ ఎక్కువగా ఉండే పదార్థాలు (కాఫీ, చాక్లెట్లు వంటివి) ఇవ్వకూడదు. సమస్య మరీ ఎక్కువగా ఉంటే నోట్లో అమర్చే మౌత్గార్డ్స్, మౌత్పీసెస్తో కొంత ఉపయోగం ఉంటుంది. ఈ సమస్య వల్ల కొన్నిసార్లు డెంటల్ సమస్యలు – మాల్ అక్లూజన్, పళ్లు వదులు కావడం (లూజెనింగ్), పళ్లు ఊడిపోవడం, దవడ ఎముక జాయింట్ (టెంపోరో మాంబడి బులార్ జాయింట్) సమస్యలు కూడా రావచ్చు. అలాంటి సందర్భాల్లో దంతవైద్య నిపుణులను సంప్రదించాలి. -
Mouth Cancer: దంత సమస్యలకు, నోటి కేన్సర్‌కు సంబంధం ఉందా?
ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న ప్రాణాంతక వ్యాధి కేన్సర్. చిన్న పిల్లలనుంచి వృద్ధుల దాకా, మహిళలు, పురుషులు అనేక రకాల కేనర్ల బారిన పడుతున్నారు. ముఖ్యంగా అమెరికా, భారత్ సహా అధిక జనాభా ఉన్న దేశాల్లో ఈ కేన్సర్ మహమ్మారిలా వ్యాపిస్తోంది. వీటిల్లో ప్రధానమైంది నోటి కేన్సర్. ప్రపంచవ్యాప్తంగా ఆరో అత్యంత సాధారణ క్యాన్సర్. పొగాకు, సుపారీ లేదా పాన్ మసాలా నమలడం లాంటి చెడు అలవాట్ల కారణంగా మహిళల కంటే పురుషులను ఇది ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ప్రతి ఆరుగురిలో ఒకరు కేన్సర్‌తో మరణిస్తున్నారు. అయితే ప్రారంభ దశలో గుర్తించినప్పుడే దీనికి చికిత్స సాధ్యమవుతుంది. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి క్యాన్సర్ రావడం చాలా ఆందోళన కలిగిస్తుంది. నోటి కేన్సర్ కూడా ప్రమాదకారి అనే చెప్పవచ్చు. పొగాకు నమలడం, మద్యం సేవించడం లేదా సిగరెట్లు తాగడం వంటి చెడు అలవాట్లు ఉన్నవారిలో ఇది సర్వసాధారణం అని అందరికీ తెలుసు. కానీ ఇవేవీ లేని వ్యక్తికి నోటి కేన్సర్ వచ్చే అవకాశం ఉంది. నోటి లోపల, పెదవులు, చిగుళ్ళు, నాలుక, బుగ్గల లోపలిభాగం, అంగిలి, ఇలా నోటిలోని ఏ భాగంలోనైనా ఇది సోకవచ్చు. ఆ వ్యాధితో...అపుడసలు బుర్ర పని చేయలేదు : స్టార్ హీరోయిన్ నోటి కేన్సర్ లక్షణాలు సాధారణంగా దీన్ని ప్రారంభ దశలో గుర్తించడం అసాధ్యం. దంతాలు, చిగుళ్ళ వాపు, నోటి లోపల తెల్లటి మచ్చలు, దంతాలు వదులుగా మారడం మొదలవుతుంది. నోటి లోపల గడ్డలు లేదా గడ్డలు కనిపిస్తాయి. ఇది కాస్త ముదిరితే చెవుల్లో నొప్పి కూడా మొదలవుతుంది. ఇక్కడ నిర్లక్ష్యం చేస్తే వ్యాధి ముదిరి ఆహారం తీసుకోవడం చాలా కష్టమవుతుంది. ప్రధానంగా దంతాలు , చిగుళ్ల చుట్టూ నిర్వచించబడని ఇన్ఫెక్షన్ లేదా విపరీతమైన నొప్పి, స్వరపేటిక, వాయిస్‌లో మార్పులు అంటే బొంగురు పోవడం, లేదా ముక్కు, నాసోఫారింజియల్, నొప్పి తొలి సూచిక కావచ్చు. నోటిని క్రమం తప్పకుండా శుభ్రం చేసిన తర్వాత కూడా నోటి దుర్వాసన (హాలిటోసిస్) ఉన్నా, మింగడంలో ఇబ్బంది (డిస్ఫాగియా) ,నోట్లోగడ్డలు కూడా తొలి సంకేతం. సిగరెట్, బీడీ, సిగార్, పొగాకు. ఆల్కహాల్ ఎక్కువగా తాగే వారికి కూడా నోటి కేన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. వాయిస్‌లో మార్పు వచ్చినా, నోరు, నాలిక మీద తెల్లటి మచ్చలు పుండ్లు త్వరగా మానక పోయినా, నోటిని తరచూ శుభ్రం చేసుకుంటున్నా దుర్వాసన వస్తున్నా, మింగడం కష్టం మారినా, ఉన్నట్టుండి దంతాలు వదులుగా మారి, నొప్పి పుడుతున్నా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. నోట్: ఈ లక్షణాలు ఉన్న వారందరికి కేన్సర్ సోకినట్టు కాదు అనేది గుర్తించాలి. కానీ, కొన్ని పరీక్షల ద్వారా ఈ వ్యాధిని నిర్ధారించాల్సి ఉంటుంది. దీన్ని తొలి దశలో గుర్తించడమే చికిత్సలో కీలకం, అందుకే ముందస్తు పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. -
వైద్యుడి భార్య అత్యుత్సాహం.. పన్ను నొప్పితో వెళితే ప్రాణాలు తీసింది..
మల్కన్‌గిరి (ఒడిశా): జిల్లాలోని కలిమెల సమితిలో ఓ వైద్యుడి భార్య అత్యుత్సాహానికి రోగి మృతి చెందాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. తపస్‌పాల్ అనే వ్యాపారి గత కొద్ది రోజులుగా పన్ను నొప్పితో బాధ పడుతున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం కలిమెల సమితిలోని వైద్యుడు రవీంద్రనాథ్ వద్ద వెళ్లాడు. ఆ సమయంలో వైద్యుడు లేకపోవడంతో ఆయన భార్య బసంతి తానే స్వయంగా వ్యాపారి పన్ను తొలగించింది. అయితే, ఇంటికి వచ్చిన కొద్ది సేపటికే అతని పరిస్థితి విషమించింది. ఎంతసేపటికీ రక్తం ఆగకపోవడంతో కుటుంబ సభ్యులు అతడిని కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. దీనిపై మృతుని కుటుంబ సభ్యులు కలిమెల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వైద్యుడితోపాటు అతని భార్య ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. (చదవండి: ఇదేం పాడు బుద్ధి...పోలీసు అయ్యి ఉండి క్రిమినల్స్‌లా...) -
Tooth Extraction: ఇదేం పైత్యం.. 13 పళ్లు రాలగొట్టుకున్న మహిళ!
లండన్: ఏదైనా గొడవ జరిగితే నీ పళ్లు రాలగొడతా అని తిడతారు. ఎవరైనా కొడితే ఒకటో రెండో పళ్లు రాలిన సంఘటనలు ఉన్నాయి. కానీ, తమకు తామే సొంతగా పళ్లు రాలగొట్టుకున్నవారు ఎవరైనా ఉన్నారా? అంటే నేనున్నానని చెబుతున్నారు బ్రిటన్‌కు చెందిన ఓ మహిళ. దంత వైద్యుడు లేడనే కారణంతో 13 పళ్లు రాలగొట్టుకుంది. ఇదెక్కడి పైత్యంరాబాబు అనిపిస్తోంది కాదా? కానీ, దానికొక కారణం లేకపోలేదు లెండీ. బూరి సెయింట్స్ ఎడ్మండ్స్కు చెందిన డేనియల్ వాట్స్ అనే 42 ఏళ్ల మహిళ దీర్ఘకాలంగా చిగుళ్ల వ్యాధితో బాధపడుతోంది. అయితే.. ఆమెకు పరిచయం ఉన్న స్థానిక ఎన్హెచ్ఎస్ డెంటిస్ట్ ఏడేళ్ల క్రితమే తన క్లినిక్‌ను మూసివేయటం వల్ల నిస్సహాయురాలిగా మారిపోయారు. ఆ తర్వాత మరో ‘ఈ బాధతోనే రోజులు గడుపుతున్నా. పెయిన్‌కిల్లర్స్ తీసుకుంటూ పనికి వెళ్తున్నా.నా పిల్లలు కనిపిస్తే నవ్వలేకపోతున్నా. కనీసం తెలిసివారితోనూ సరిగా మాట్లాడలేకపోతున్నా.’ అని తెలిపారు డేనియల్ వాట్స్. ఇంకా 8 తొలగించాలి.. ఆమె ఇప్పటికే 14 పళ్లను తొలగించుకున్నారు. ఇంకా ఎనిమిది తొలగించాల్సిన అవసరం ఉందని వైద్యులు తెలిపారు. దీంతో ఆమెకు ప్రైవటు ఆసుపత్రిలో చికిత్స అందించేందుకు.. స్థానిక కౌన్సిలర్ కాటీ పార్కర్ 1500 పౌండ్లు విరాళాలు సేకరించే పనిలో పడ్డారు.‘డేనియల్ కోసం విరాళాలు సేకరించటం సంతోషంగా ఉంది. ఆమె ఇందుకు ఒప్పుకోదు కానీ, చేయాల్సి వచ్చింది’ అని పేర్కొన్నారు. తన కోసం విరాళాలు ఇచ్చేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు ముందుకు వస్తున్న నేపథ్యంలో కన్నీటిపర్యంతమయ్యారు డేనియల్. ప్రజల నుంచి సేకరించిన విరాళాలతో వైద్యం చేసుకునేందుకు మైడెంటిస్ట్ వద్ద అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఆగస్టు మధ్యలో పడాపోయిన నాలుగు దంతాలను తొలగించనున్నారు. మిగిలిన నాలుగు మరుసటి రోజున తీసేస్తారు. ‘అవును, నా పళ్లు ఎలాగైనా తొలగించాల్సిన అవసరం ఏర్పడింది. కానీ, వాటిని నేనే తొలగించుకోనూ. పళ్లు లేకుండా, నొప్పితో తిరగాల్సి వస్తోంది.’ అని పేర్కొన్నారు డేనియల్. ఇదీ చదవండి: గులాబీ వర్ణంలోకి ఆకాశం.. సినిమాను తలపించిన దృశ్యం.. ఏలియన్స్ పనేనా? -
సీఎం కేసీఆర్ పంటికి శస్త్రచికిత్స
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పంటికి సోమవారం శస్త్రచికిత్స జరిగింది. కొద్దిరోజులుగా తీవ్ర పంటినొప్పితో సతమతమవుతున్న కేసీఆర్ పరీక్షల నిమిత్తం ఆదివారం సాయంత్రం ఢిల్లీ వచ్చిన విషయం తెలిసిందే. సోమవారం మధ్యాహ్నం ఢిల్లీకి చెందిన ఓ ప్రముఖ వైద్యుడికి సంబంధించిన ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించారు. అనంతరం కేసీఆర్‌కు శస్త్రచికిత్స చేసి ఓ పంటిని తొలగించినట్లుగా ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. శస్త్రచికిత్స నిమిత్తం అనస్తీషియా సైతం ఇవ్వడంతో కేసీఆర్ రోజంతా విశ్రాంతిలోనే గడిపారు. మరో రెండ్రోజులపాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లుగా చెబుతున్నారు. తుగ్లక్‌రోడ్డులోని కేసీఆర్ నివాసానికి పలువురు ఎంపీలు మధ్యాహ్నం వెళ్లినప్పటికీ ఆయన విశ్రాంతిలో ఉండటంతో కలవలేక కేవలం భోజనం చేసి వెళ్లిపోయారు. బాబూ జగ్జీవన్ రామ్‌కు సీఎం కేసీఆర్ నివాళి సాక్షి, హైదరాబాద్: భారత మాజీ ఉప ప్రధాని, కుల రహిత సమాజం కోసం తన జీవితాంతం కృషి చేసిన బడుగుబలహీన వర్గాల నేత, డా.బాబూ జగ్జీవన్ రామ్ 115వ జయంతిని పురస్కరించుకుని, ఆయన దేశానికి చేసిన సేవలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్మరించుకున్నారు. ఏప్రిల్ 5న ఆయన జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ బాబూ జగ్జీవన్ రామ్‌కు ఘనంగా నివాళులర్పించారు. దేశ స్వాతంత్య్రం కోసం, సామాజిక సమానత్వం కోసం పోరాడిన నేత బాబూ జగజ్జీవన్ రామ్ అని, ఆయన ఆశయాల సాధన దిశగా రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు వంటి పథకాలను అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. సామాజిక ఆర్థిక రంగాల్లో దళితుల ఆత్మగౌరవాన్ని అత్యున్నతంగా నిలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం చిత్త శుద్ధితో కృషి చేస్తున్నదన్నారు. -
Black Fungus: పన్ను నొప్పి ఉందని వెళితే..
సాక్షి, హైదరాబాద్: కరోనా రెండో వేవ్ మొదలైనప్పటి నుంచి బ్లాక్ ఫంగస్ కేసులు కూడా పెరుగుతున్నాయి. కరోనా సోకినవారిలో చాలా మంది హోం ఐసోలేషన్‌లోనే ఉంటూ మందులు వాడుతున్నారు. ఇందులో కొందరు ఇష్టమొచ్చినట్టుగా స్టెరాయిడ్లు, యాంటీబయాటిక్స్ ఉపయోగిస్తుండటంతో.. కరోనా నియంత్రణలోకి వచ్చినా బ్లాక్ ఫంగస్ వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. బాధితులు ఏదో పంటి సమస్య అనుకుని డెంటిస్టుల దగ్గరికి వెళితే.. ఫంగస్ ఉన్నట్టు బయటపడుతోంది. కరోనా సోకి తగ్గినవారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, దంతాలకు సంబంధించి ఏ ఇబ్బంది తలెత్తినా వెంటనే పరీక్ష చేయించుకోవాలని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మ్యూకోర్మైకోసిస్ లక్షణాలు కనిపిస్తే.. త్రీడైమన్షనల్ సీటీ స్కాన్ ద్వారా సమస్య తీవ్రతను కచ్చితంగా అంచనా వేయొచ్చని, తగిన చికిత్స తీసుకోవచ్చని చెప్తున్నారు. ఈ తరహా కేసులకు సంబంధించిన లక్షణాలు, సమస్యలు, చికిత్స తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యనిపుణులు ప్రసాద్ మేక, ప్రత్యూష, సూర్యదేవర నిశాంత్ పలు సూచనలు చేశారు. ఆ వివరాలు వారి మాటల్లోనే.. ‘మాక్సిల్లా’ఎముకపై ముందుగా ప్రభావం ముక్కుకు నోటికి మధ్యలో (అంగిటిపై) ఉన్న ‘మాక్సిల్లా’ ఎముకపై ఫంగస్ ముందుగా ప్రభావం చూపుతుంది. దీని వెనుకవైపు చెవి, ముక్కు, గొంతు (ఈఎన్టీ) విభాగం పరిధిలోకి వచ్చే వ్యవస్థలు ఉంటాయి. కిందివైపు దంత సంబంధిత వ్యవస్థలు ఉంటాయి. ఫంగస్ చాలా వరకు ముక్కు నుంచే ప్రవేశిస్తుంది. కరోనా ఇన్ఫెక్ట్ అయ్యే ప్రాంతం కూడా అక్కడే ఉండడంతో సమస్య తీవ్రత పెరుగుతుంది. సైనస్ సంబంధిత సమస్యలు, నొప్పి అధికంగా ఉండడం వల్ల ఈఎన్టీ వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. అదే నోటిలో దుర్వాసన, పళ్లు కదలడం, చిగుళ్ల వాపు, చీము రావడం వంటి సమస్యలు వస్తే వెంటనే డెంటిస్ట్‌లను సంప్రదించాలి. ఇలాంటి సమస్యలు లేదా లక్షణాలతో వచ్చిన పేషెంట్లను పరీక్షించినప్పుడు బ్లాక్ ఫంగస్ కేసులు బయటపడుతున్నాయి. ఈ సమస్యను గుర్తించాక తీవ్రతను బట్టి ఏ భాగంలో ఎలాంటి చికిత్స చేపట్టాలనేది నిర్ణయిస్తారు. మాక్సిల్లా లేదా ప్యాలెట్లలో ఇన్పెక్షన్ పెరిగితే పన్ను లేదా పంటి చుట్టూ ఎముకను కట్ చేయాల్సి ఉంటుంది. ఈ చికిత్సను ఈఎన్టీ, డెంటల్ సర్జన్లు చేస్తారు. మాక్సిల్లా ఆపరేషన్ అంటే డెంటల్, ప్లాస్టిక్ సర్జరీలు చేయాల్సి ఉంటుంది. – డాక్టర్ సూర్యదేవర నిషాంత్, డెంటల్ స్పెషలిస్ట్ ఏమాత్రం ఆలస్యం చేయొద్దు.. ఈఎన్టీ, డెంటల్, ఆప్తాల్మాలజీ, న్యూరాలజీ అంశాలకు సంబంధించిన సమస్య బ్లాక్ ఫంగస్. ఇది ముక్కులోంచి ప్రవేశించి పైదవడ, సైనస్, కళ్లు, మెదడుపై ప్రభావం చూపుతుంది. ఉన్నట్టుండి దంతాలు వదులుకావడం, అక్కడక్కడా తెల్లపొక్కులు ఏర్పడటం, చిగుళ్లకు రంధ్రాల మాదిరిగా ఏర్పడి చీము కారడం, అంగిటి నల్లబడటం, పన్ను తీసేసినప్పుడు గాయం ఆలస్యంగా మానడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను కలిసి టెస్టులు చేయించుకోవాలి. ఎలాంటి లక్షణాలు లేకున్నా పైదవడ నొప్పి, వాపు వస్తే.. ఫంగస్ వ్యాపించిన మేర కణజాలాన్ని తొలగించాలి, యాంటీ ఫంగల్ డ్రగ్స్ ఇవ్వాలి. ఒకవేళ పైదవడ పూర్తిగా తొలగించాల్సి వస్తే.. అప్చురేటర్ ద్వారా వివిధ స్థాయిల్లో చికిత్స చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కనుగుడ్డు తొలగించాల్సి వస్తే ఆర్టిఫిషియల్ కన్నును డెంటిస్ట్‌లే అమర్చాల్సి ఉంటుంది. ఆలస్యమైతే ప్రమాదం బ్లాక్ ఫంగస్ లక్షణాలు బయటపడిన వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలి. 3, 4 రోజుల్లోనే ఈ ఫంగస్ మెదడుకు చేరుకుని, ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు కోవిడ్ కారణంగా షుగర్ పేషెంట్లు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి, స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడినవారికి, కేన్సర్, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ పేషెంట్లకు బ్లాక్ ఫంగస్ ఎక్కువగా సోకుతుంది. కోవిడ్ వచ్చి తగ్గినవారు.. ఫంగస్ లక్షణాలు ఏమైనా ఉన్నాయా, ముఖంపై నొప్పి, నల్లబారడం, ముక్కులోంచి రక్తం, కన్ను వాపు, హైఫీవర్, తరచుగా తలనొప్పి వంటివి ఏమైనా ఉన్నాయా అన్నది ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. బెటాడిన్ మౌత్‌వాష్‌తో తడిపిన దూది లేదా వస్త్రంతో నోటిని శుభ్రం చేసుకోవాలి. –ప్రసాద్ మేక, ప్రత్యూష మేక, డెంటిస్ట్‌లు, కిమ్స్ ఆస్పత్రి చదవండి: కరోనా మూడో వేవ్ వస్తుందా?.. వస్తే.. ఎలా గుర్తించాలి? -
పంటి నొప్పిని పట్టించుకోండి లేదంటే..
పన్ను నొప్పే కదా అని తేలిగ్గా తీసుకోకండి. పంటిలో ఏర్పడిన చిన్న ఇన్ఫెక్షన్ను నియంత్రించక పోవడంతో ఒక మహిళ ప్రాణాపాయ స్థితిలో 5 నెలల పాటు ఆసుపత్రిలో గడపాల్సి వచ్చింది. రెండుసార్లు గుండె ఆగిపోయి ప్రాణం పోయినంత పనైంది. దాదాపు 30 కిలోల బరువును కోల్పోయింది. నమ్మలేకపోతున్నారా! ఇది నిజం. తూర్పు యార్క్‌షైర్‌లోని స్నైత్కు చెందిన రెబెక్కా డాల్టన్ (30)కు గత ఏడాది డిసెంబరులో జ్ఞాన దంతంలో చీముగడ్డ ఏర్పడింది. యాంటీబయాటిక్స్ ఇచ్చిన డాక్టరు దాన్ని తొలగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అయితే ఆ సమయంలో ఆమె నిండు గర్భిణీ కావడంతో పట్టించుకోలేదు. దీంతో మార్చి నెలలో మళ్లీ తిరగబెట్టింది. సమస్య తీవ్రమై ఇన్ఫెక్షన్ మెదడు దాకా పాకిపోయింది. ఫలితంగా మతిమరుపు సమస్య ఉత్పన్నమైంది. అంతేకాదు నడవడానికి కూడా ఇబ్బంది పడటంతో ఆమె తిరిగి వైద్యులను సంప్రదించారు. దీంతో పరీక్షలు నిర్వహించిన వైద్యులు, మెదడు, గుండె, కాలేయంలో బాక్టీరియా గడ్డలను గుర్తించారు. వెంటనే మెరుగైన చికిత్స కోసం ఆమెకు హల్ రాయల్ వైద్యశాలలోని న్యూరోలాజికల్ విభాగానికి తరలించారు. ఐదు నెలలు ఆసుపత్రిలో చికిత్స తర్వాత, రెబెక్కా కోలుకుని గత వారం డిశ్చార్జ్ అయ్యారు. ఈ సంఘటన తన జీవితాన్నే మార్చేసిందనీ, 30 ఏళ్ల వయసులో కనీసం టాబ్లెట్ కూడా తీసుకోలేని స్థితిలో ఒకరి మీద ఆధారపడటం తనను షాక్‌కు గురిచేసిందని రెబెక్కా తన బాధలను గుర్తు చేసుకున్నారు. 30 కిలోల కంటే ఎక్కువ బరువు కోల్పోయాననీ, ఇప్పటికీ తన పని తాను చేసుకోలేకపోతున్నానని వాపోయారు. ఈ ఉదంతం జీవితంపై తన దృక్పథాన్నే మార్చేసిందని చెప్పుకొచ్చారు. సో... బీకేర్‌ఫుల్. యాంటిబయోటిక్స్ వాడాం కదా..నొప్పి పోయిందిలే అనే నిర్లక్ష్యం అసలు వద్దు..ఎందుకంటే చాలాసార్లు పరిస్థితి చేయిదాటి పోయేంతవరకు ప్రమాదాన్ని గుర్తించలేని పరిస్థితి రావచ్చు. అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. మరోవైపు ఆమెకు కచ్చితంగా కరోనా వస్తుందని భయపడిపోయానని రెబెక్కా తల్లి తెలిపారు. అదృష్టవశాత్తూ కోవిడ్-19 పరీక్షల్లో నెగిటివ్ రావడం సంతోషం కలిగించిందన్నారు. కాగా గతంలో యుకెకు చెందిన ఆడమ్ మార్టిన్ కూడా దాదాపు ఇదే సమస్యతో ప్రాణాపాయం నుంచి బైటపడ్డారు. పళ్లలో పాప్ కార్న్ ఇరుక్కోవడంతో అది గమ్ ఇన్ఫెక్షన్కు దారి తీసింది. అది కాస్తా దంతాల నుంచి గుండె వరకు వ్యాపించడంతో వైద్యులు ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి గుండెల్లో ఒక కవాటాన్ని తొలగించిన సంగతి తెలిసిందే. -
హెల్త్ టిప్స్
►పంటినొప్పి ఉన్నప్పుడు వెల్లుల్లి రేకను చిదిమి అందులో రాతి ఉప్పును ఉంచి నొప్పి ఉన్నచోట పెట్టాలి. కొంతసేపటికి నొప్పి తగ్గుతుంది. రోజూ ఉదయం ఒకటి – రెండు వెల్లుల్లి రేకలను నమిలి తింటే పంటినొప్పి రాదు, దంతాలు ఆరోగ్యంగా, పటిష్టంగా ఉంటాయి. ►ఉల్లిపాయను నలగ్గొట్టి నొప్పి ఉన్న చోట పెట్టాలి. పిప్పిపన్ను ఉంటే ఇలా ప్రతిరోజూ పెడుతుంటే క్రమేపీ బ్యాక్టీరియా నశిస్తుంది. ప్రతిరోజూ రెండు – మూడు నిమిషాల పాటు పచ్చి ఉల్లిపాయ ముక్కను నమిలితే పంటికి, చిగుళ్లకు సంబంధించిన సమస్యలు రావు. ►నిమ్మరసంతో చిగుళ్లను, పళ్లను వేలితో రుద్దాలి. ఇలా చేస్తుంటే పళ్లు వదులయ్యే సమస్య రాదు. చిగుళ్ల నుంచి రక్తం కారడం తగ్గుతుంది. పంటిగార ఉంటే అది తగ్గే వరకు రోజూ ఐదు నిమిషాలపాటు నిమ్మరసంతో కాని రసం పిండేసిన తొక్కతో కాని రుద్దాలి. -
హెల్త్ టిప్స్
పంటి నొప్పి తగ్గాలంటే ఒక స్పూను దాల్చినచెక్క పొడిలో ఐదు స్పూన్ల తేనె కలిపి నొప్పి ఉన్న చోట పెట్టాలి. ఇలా రోజుకు మూడుసార్లు చేస్తే నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. ఇవి లేకపోతే... లవంగాన్ని కొద్దిగా చిదిమి నొప్పి ఉన్నచోట అదిమినట్లు పెట్టి కొద్దిసేపు అలాగే ఉంచాలి. శ్వాస తాజాగా ఉండాలంటే ఉదయం పళ్లు తోముకున్న తరువాత ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో ఒక స్పూను తేనె, ఒక స్పూను దాల్చిన చెక్క కలిపి ఆ మిశ్రమంతో పుక్కిలించాలి. ఉదయం ఒకసారి ఇలా చేస్తే రోజంతా నోరు శుభ్రంగా ఉండి దుర్వాసన దరి చేరదు.కఫంతో కూడిన దగ్గు బాధిస్తుంటే... గోరువెచ్చటి పాలలో చిటికెడు మిరియాల పొడి కలిపి తాగాలి. -
డెంటల్ కౌన్సెలింగ్
నాకు ఆర్నెల్ల క్రితం పంటి నొప్పి వచ్చింది. దాంతో డెంటిస్ట్ పై వరసలో పళ్లలో, కింది వరస పళ్లలో రెండు కొత్త క్యాప్స్ పెట్టారు. మళ్లీ రెండు నెలలకు నొప్పి, చిగురువాపు వచ్చాయి. అప్పుడు డెంటిస్ట్ క్యాప్స్ తొలగించి క్లీన్ చేసి మళ్లీ వాటిని తిరిగి అమర్చారు. కొంతకాలంలోనే ఇలా రెండుమూడుసార్లు చేయాల్సి వచ్చింది. నొప్పి నివారణ మందులు వాడుతున్నప్పుడు బాగానే ఉన్నా మళ్లీ మళ్లీ నొప్పి వస్తోంది. నా సమస్యకు సరైన పరిష్కారం చెప్పండి. - బాలయ్య, విశాఖపట్నం ఇన్నిసార్లు చికిత్స జరిగాక కూడా మీరు చెప్పిన విధంగా మాటిమాటికీ పంటి నొప్పి, చిగురు వాపు రావడం పంటి ఆరోగ్యానికి సరైన సూచన కాదు. మాటిమాటికీ క్యాప్‌ను తీసి మళ్లీ అమర్చడం వల్ల మీకు ఉన్న సమస్య తీరదు. నొప్పి నివారణ మందుల్ని మాటిమాటికీ వాడటంతో డ్రగ్ రెసిస్టెన్స్ వచ్చి మళ్లీ అదో సమస్య కావచ్చు. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వ్యాధినిర్ధారణలోగాని, చికిత్సలో ఏదో లోపం ఉన్నట్లుగా అనిపిస్తోంది. మీకు నొప్పి వచ్చినప్పుడు మందులు వాడుతూ ఉండటం కంటే... సమస్య పూర్తిగా పరిష్కారమయ్యేలా అవసరాన్ని బట్టి సరైన చికిత్స చేయించాల్సి ఉంటుంది. మీరు మరో డెంటిస్ట్‌ను కలిసి వారి అభిప్రాయం తీసుకోండి. - డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి ఆర్థోడాంటిస్ట్ స్మైల్ మేకర్స్ డెంటల్ హాస్పిటల్స్, మూసారంబాగ్, హైదరాబాద్


