పంటి రక్ష ప్రాణాలకు రక్ష అన్నా పర్వాలేదు. ఎందుకంటే నోరు అనే సింహద్వారానికి పళ్లు ద్వార పాలకులు.వాటిని దాటి ఏదీ రాలేదు. కానీ నోటి ఆరోగ్యం దెబ్బతింటే అది గొంతు ఇన్ఫెక్షన్లనూ, దీర్ఘకాలంలో అక్కడి నుంచి గుండెనూ దెబ్బతీసే ముప్పు లేకపోలేదు. అందుకే నోటి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంటే పంటి ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవడమే. మనకు తెలియకుండా...మన రోజువారీ అలవాట్లలో భాగంగా చాలా పనులు చేస్తుంటాం.
ఉదాహరణకు పంటికి లుంగజుట్టుకు పోయే చాక్లెట్లు తింటుంటాం.కూల్ వాటర్ తాగుతూ పంటి కిందికి ‘ఐస్’వస్తే నమిలేస్తుంటాం. ఇలా మనం చాలా తేలిగ్గా తీసుకుని చేసే కొన్ని పనులు పంటి ఆరోగ్యాన్నీ... దీర్ఘకాలంలో ఒంటి ఆరోగ్యాన్నీ దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అలాంటి అలవాట్లు ఏమిటో తెలుసుకుని, వాటి నుంచి దూరంగా ఉండటం ఎలాగో, తద్వారా పంటి, ఒంటి ఆరోగ్యాలను కాపాడుకోవడం ఎలాగో తెలుసుకుందాం...
ఇప్పటి తరం పిల్లల దూకుడు గురించి చెప్పడానికి చాలానే ఉంటుంది. నేటి యువతలో నలుగురు కలిసి ఎక్కడో పిక్నిక్‌కు అంటూ కూల్‌డ్రింక్ బాటిల్స్ తీసుకెళ్లారనుకోండి. అక్కడ ఓపెనర్ దొరకక΄ోతే పళ్లతోనే బాటిల్ మూతలను ఓపెన్ చేసే నైపుణ్యం ఇప్పటి యువకుల సొంతం. అలాగే చాలామంది తమకు తెలియకుండానే పంటిని దెబ్బతీసే పనులు చాలానే చేస్తుంటారు.
ఉదాహరణకు రాస్తూ రాస్తూ ఏదో ఆలోచిస్తూ పెన్ను చివరను నోట్లో పెట్టుకుని తేలిగ్గా కొరుకుతూ ఉండవచ్చు. అలాగే పొద్దున్నే బ్రష్ నోట్లో వేసుకుని నలుగురు కలిసి మాట్లాడుకునే టైమ్‌లో బ్రషింగ్‌కు బదులు బ్రష్‌ను నములుతూ ఉండిపోయే పల్లెల్లోని రచ్చబండ బ్యాచ్‌కు కొదవే లేదు. చల్లటి నీళ్లనో లేదా ‘ఛిల్ల్’టి డ్రింక్స్ తాగుతూ ఆ నీళ్లకు పళ్లు అదేపనిగా తాకుతూ ఉండేలా తాగేవారికి లోటు లేదు.
మనం అంతగా పట్టించుకోకుండా చేసే ఇలాంటి చాలా పనులు పళ్లకు హాని చేయవచ్చు. నోరు అనేది దేహానికి సింహద్వారం అని చెప్పుకున్నాం కదా. మరి ఆ నోట్లోకి హానికరమైన బ్యాక్టీరియా వచ్చి చేరాక అవి గొంతులోకి... అక్కడ్నుంచి దేహంలోకీ పోతూ... మొత్తం ఒంటికే చేటు తెచ్చే ముప్పు ఎప్పుడూ ΄పొంచే ఉంటుంది. అందుకే అలాంటి కొన్ని చెడ్డ అలవాట్లను చిన్నారులు, యువత దృష్టికి తెచ్చి... వాటిని మాన్పించేలా చేయడమే ఈ కథనం ఉద్దేశం.
టైటానిక్‌కు ఐస్‌బర్గ్ లాంటిదే... పంటికి ‘ఐస్’ వాటర్...
మంచి టేస్టీ బిర్యానీతో పాటు చల్లటి కూల్‌డ్రింక్ తాగుతుండటం చాలామందికి అలవాటు. అంతేకాదు... ఇటీవలి ఫాస్ట్ ఫుడ్స్ అయిన బర్గర్, పిజ్జాలతో పాటు కోలా క్రిండ్స్ తీసుకోవడం ఇంకొందరికి పరిపాటి. ఒకవేళ వాళ్లు తీసుకోక΄ోయినప్పటికీ... ఇలాంటి ఫాస్ట్‌ఫుడ్స్‌తో పాటు కాంప్లిమెంటరీ డ్రింక్‌గా కూల్‌డ్రింక్స్ చాలా మాల్స్‌లో దొరుకుతూ ఉండటం మామూలే. అందునా ఆ డ్రింక్స్‌లో ఐస్ క్యూబ్స్ వేసి మరీ ఇస్తుంటారు.
కొందరు నోట్లోకి వచ్చిన ఆ ఐస్ ముక్కను ఉమ్మేస్తే బాగుండదనుకుని నుములుతూ ఉండటమూ మామూలే. ఇక రకరకాల ఫ్లేవర్స్‌లో దొరికే ‘ఐస్’ఫ్రూట్స్ తినే చిన్నారులు ఒక దశవరకూ వాటిని చప్పరించాక... ఇక ఓపిక తగ్గిపోయి... వాటిని నమిలి మింగేస్తుంటారు. మరికొందరు బాక్సింగ్, కిక్‌బాక్సింగ్, ఫుట్‌బాల్ ప్లేయర్స్ తమ పళ్ల రక్షణ కోసం ఐస్ ముక్కల్ని నోట్లో పెట్టుకుంటారు. అలాంటి ఐస్ ముక్కల కారణంగా చాలామంది పళ్లు దెబ్బతింటాయి.
తొలిదశలో కాస్తంత భరించేలా ఉన్న అవే ఐస్ ముక్కలు... పంటి ఎనామిల్ దెబ్బతిన్న తర్వాత జిల్లంటూ బాధించేవరకూ పరిస్థితి వెళ్తుంది. ఐస్ క్యూబ్స్ లేదా ఐస్ నోట్లోకి తీసుకోవడం కారణంగా నోట్లోని ఉష్ణోగ్రత అకస్మాత్తుగా మారిపోవడం వల్ల ఎనామిల్‌లో పగుళ్లు (క్రాక్స్) వచ్చే ప్రమాదం ఉంటుంది.
పరిష్కారం: పెద్దవాళ్లు ఐస్ ముక్కలతో కూడిన డ్రింక్స్ తీసుకుంటున్నా... లేదా చిన్నారులు ఐస్‌ఫ్రూట్లూ, ఐస్‌క్యాండీ తింటున్నా వీలైనంతవరకు ఐస్‌ను నమలకూడదు. అసలు పంటికి ఐస్ తగలకుండా జాగ్రత్త పడాలి. ఇక బాక్సింగ్, కిక్‌బాక్సింగ్ వంటి ఆటగాళ్లు ఐస్‌కు బదులు పళ్ల రక్షణ కోసం మౌత్‌గార్డ్‌నే వాడటం మేలు.
పళ్లను ఓపెనర్‌గా వాడటం సరికాదు...
పిక్నిక్‌లకు వెళ్లేప్పుడు ఆర్భాటంగా కూల్‌డ్రింక్స్ తీసుకెళ్లే యువకుల్లో చాలామంది ఓపెనర్‌ను తీసుకెళ్లడం మరచి΄ోయి, సీసా మూతలు తీయడానికి పళ్లను వాడుతుంటారు. బట్టలు కుట్టే టైలర్లలో కొందరు దారం ఎక్కించే ముందర సూదిని పంటితో పట్టుకోవడమూ అక్కడక్కడా కనిపించే దృశ్యమే. అంతేకాదు వాళ్లలో కొందరు దారాన్ని పంటితోనే తెంపుతుంటారు. షాంపూ షాచేలను చింపడానికి కొందరు పళ్లనే ఉపయోగిస్తుంటారు.
పరిష్కారం: పంటి రక్షణ కోసం గుర్తుంచుకోవాల్సిందేమిటంటే... మన పళ్లు ఓపెనర్లు కాదు. అలాగే కత్తెరకు బదులుగా పళ్లను వాడటమూ సరికాదు. ఈ పనులు చేసే చాలామందిలో పళ్ల ఎనామిల్ దెబ్బతినే ప్రమాదముంది. పంటి తాలూకు చిన్న ముక్క ఊడి΄ోయే ముప్పు కూడా పొంచి ఉంటుంది. ఇలాంటి పనులతో పళ్లు త్వరగా దెబ్బతింటారు. అందుకే సీసా మూతలు తీయడానికి ఓపెనర్‌నే వాడాలి. షాంపూ షాచేలు చిం΄ాలంటే కత్తెరనే వాడాలి. అంతేతప్ప పళ్లను వాడకూడదని గుర్తుంచుకోవాలి.
పండ్లరసాల్లోని చక్కెర పళ్లకు ముప్పు...
పండ్లరసాలు ఆరోగ్యానికి చాలామంచివంటూ చాలామంది వాటిని తాగేస్తూ ఉంటారు. అలాగే ఎనర్జీ డ్రింక్స్ అనీ, స్పోర్ట్స్ డ్రింక్స్ అనీ తాగేస్తూ తమకు ఆరోగ్యంతో కూడిన శక్తి సమకూరుతోందంటూ ఆనందిస్తుంటారు. నిజానికి ఫ్రూట్ జ్యూసుల్లో, స్పోర్ట్స్ డ్రింక్స్‌లో ఉండే చక్కెరతో పళ్లు పుచ్చిపోవడం, దంతక్షయానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాదు... లైమ్‌జ్యూస్‌ల వంటి పుల్లటి పండ్లరసాల్లోనియాసిడ్ వల్ల పళ్లు దెబ్బతినే ముప్పు పెరుగుతుంది.
పరిష్కారం: చక్కెర మోతాదు ఎక్కువగా ఉండే పండ్లరసాలను వీలైనంత తక్కువగా తీసుకోవాలి. అలాంటి పానీయాలు తాగేటప్పుడు ఆ ద్రవం వీలైనంతవరకు పంటికి తగలకుండా తాగడం మేలు. ఇక తీపి ఎక్కువగా ఉండే డ్రింక్స్ లేదా పండ్లరసాలు తాగాక నోరు శుభ్రంగా కడుక్కోవడం మరచి΄ోవద్దు.
పండ్లూ... పళ్లు... ప్రాధాన్యం దేనికి...
ఏ సీజన్‌లో దొరికే మంచి తాజాపండ్లను ఆయా సీజన్‌లలో తినడం మంచి అలవాటే. అది ఆరోగ్యానికి మేలు చేసే అంశమే. కాకపోతే మరీ చక్కెర మోతాదులు ఎక్కువగా ఉండే పండ్లనూ, పులుపు మోతాదు కాస్తంత ఎక్కువగా ఉండే బత్తాయి, ద్రాక్ష, ఆరెంజ్ జ్యూస్‌లను వీలైనంత మేరకు పళ్లకు తగలకుండా తీసుకోవడం మేలు. ఎందుకంటే పుల్లటి పండ్లలో ఉండే ఆ పులుపులో ఉండే ఆమ్ల గుణం పంటిని దెబ్బతీసే ముప్పు ఎప్పుడూ ఉంటుంది.
పరిష్కారం: పండ్లను ఫ్రూట్‌జ్యూస్‌లుగా తాగడం కంటే వాటిని కొరికి తినడం మంచిది. ఒకవేళ జ్యూస్ రూపంలో తాగాలనుకుంటే... ఆ పానీయంలో చక్కెర కలుపుకోవడం తగదు. ఇక జ్యూస్ రూపంలో తాగినప్పటికీ... వెంటనే నోరు కడుక్కోవడం మరచిపోవద్దు.
కరకరలాడే చిప్స్‌తో కిరికిరి...
చిప్స్ కరకరలాడుతూ నాలుకకు రుచిగా ఉండవచ్చు. కానీ పళ్లకు అంత మంచివి కాదు. పైగా కరకరలాడే పదార్థాలు పళ్లకు ప్రమాదం తెచ్చిపెట్టే అవకాశాలెక్కువ. అంతేకాదు చిప్స్ లాంటి చిరుతిండ్లలో స్టార్చ్ కూడా ఎక్కువ. ఈ స్టార్చ్ లాలాజలం తగలగానే దాదాపు చక్కెరలా మారిపోయి పంటిని దెబ్బతీసే ముప్పు మరీ ఎక్కువ. అందుకే చిప్స్ లాంటివి తిన్న 20 నిమిషాల తర్వాత అవి పంటిని దెబ్బతీయడం మొదలు పెడతాయి.
అంతేకాదు... పంటి మధ్యన చిక్కుకునే చిప్స్ తాలూకు చిన్న చిన్న ముక్కలతో దంత క్షయం ముప్పు మరింత పెరుగుతుంది. ఇక మరికొందరు పిల్లలూ, ఆ మాటకొస్తే కొందరు పెద్దలు కూడా ఎప్పుడూ ఏదో ఓ చిరుతిండిని నములుతూ ఉంటారు. దాంతో చిరుతిండిలో ఉండే పిండిపదార్థాలూ, చక్కెర వంటి పంటికి ముప్పు తెచ్చే అంశాలు పళ్లను దెబ్బతీస్తాయి.
పరిష్కారం: వీలైతే తరచూ చిరుతిండ్లు తినే అలవాటుకు దూరంగా ఉండటం మేలు. లేదంటే చిరుతిండి తిన్న వెంటనే నోరు శుభ్రంగా కడుక్కోవాలి. చిరుతిండ్లకు బదులుగా క్యారట్ వంటిని నములుతూ ఉండటం మంచిది.
ఇక చిప్స్ లాంటి చిరుతిండ్లను వీలైనంత తక్కువగా తినాలి. ఒకవేళ తప్పక తినాల్సివచ్చినప్పుడు తిన్నవెంటనే నోరు కడుక్కోవడం, వీలైతే ఫ్లాసింగ్ చేసుకోవడం (దారంతో పళ్ల మధ్య చేరే చిన్న చిన్న ముక్కలను శుభ్రపరచుకోవడం) తప్పనిసరి.
కాఫ్ సిరప్‌తోనూ దంతక్షయం...
చాలామంది కాఫ్ సిరప్ అనేది దగ్గు తగ్గేలా చేసే ఓ మందు అనుకుంటారు గానీ అందులో ఔషధంతో పాటు చక్కెర మోతాదులూ ఉంటాయి. ఆ చక్కెర పంటి ఆరోగ్యానికి ప్రమాదం తెచ్చిపెట్టే అవకాశాలుంటాయి.
పరిష్కారం: దగ్గు మందును వీలైనంత మేరకు పలువరసకు తగలకుండా గొంతులో ΄ోసుకోవడం మేలు. అలాగే దగ్గు మందు తాగిన వెంటనే నోరు కడుక్కోవడం మరచిసెవద్దు.
తప్పుడు బ్రష్షింగ్ సరికాదు...
చాలామంది బ్రష్ చేసుకోడానికి నోట్లో బ్రష్ పెట్టుకుంటారు గానీ... ఆ ప్రక్రియను వేగంగా ముగించకుండా అదేపనిగా నములుతుంటారు. ఇక కొందరు తప్పుడు పద్ధతుల్లో బ్రష్షింగ్ చేసుకుంటూ ఉంటారు. ఇంకొందరు నోరు శుభ్రంగా ఉండాలనే తపనతో విపరీతంగా బ్రష్ చేసుకుంటారు. ఈ అన్ని చర్యలతోనూ పళ్లు త్వరగా అరిగిపోయే ముప్పు ఉంటుంది.
పరిష్కారం: మృదువైన బ్రిజిల్స్ ఉన్న టూత్‌బ్రష్‌ను ఎంచుకోవాలి. పంటి మీద ఎక్కువ ఒత్తిడితో బ్రష్షింగ్ చేయకూడదు. బ్రష్షింగ్ చేసే సమయంలో పంటికి అడ్డంగా కాకుండా నిలువుగా బ్రష్ చేసేలా టూత్‌బ్రష్‌ను కదిలించాలి. సున్నాలు చుడుతున్నట్లుగా (సర్క్యులర్‌గా) కదిలిస్తూ బ్రష్ చేసుకోవడం సరైన పద్ధతి. ఈ సమయంలో చిగుర్లకూ మాలిష్ జరుగుతుండేలా బ్రష్ కదలికలు (స్ట్రోక్స్) ఉండాలి.
బ్రషింగ్ పూర్తయ్యాక వేలిచివరతో చిగుర్లను మాలిష్ చేస్తున్నట్లుగా సున్నాలు చుడుతున్నట్లుగా కదిలించాలి. కనీసం ప్రతి మూడు నెలలకు ఒకసారైనా బ్రష్‌ను మార్చడం మేలు. ఒకవేళ జ్వరం రావడం లేదా ఆరోగ్యం చెడిపోవడం జరిగితే... కోలుకున్న వెంటనే బ్రష్‌ను మార్చడం మంచి పద్ధతి. ఇలా ఆరోగ్యం చెడి΄ోయినప్పుడు బ్రష్ మార్చడానికి మూడు నెలలు ఆగడం అనే నిబంధన పనికిరాదు.
ఆ జబ్బుతో పంటికి ముప్పు...
కొందరు ‘బ్రక్సిజం’ అనే జబ్బు కారణంగా పదే పదే పళ్లు కొరుకుతూ ఉంటారు. ఇలాంటి వారు రోజువారీ ఒత్తిడుల కారణంగా తమకు తెలియకుండానే నిద్రలో పళ్లు కొరుక్కుంటూ ఉంటారు. ఇలా పళ్లు కొరుకుతూ ఉండేవారిలో పళ్లు త్వరగా అరిగిపోతాయి. ఇక మరీ గట్టి పదార్థాలను అదేపనిగా నమలడం కూడా పంటి అరుగుదలను వేగవంతం చేస్తుంది.
పరిష్కారం: నిద్రలో పళ్లు కొరికే అలవాటు ఉన్నవారు కారణాన్ని తెలుసుకుని, ఆ అలవాటును మానుకోవాలి. బ్రక్సిజం ఉంటే చికిత్స తీసుకోవడం, ఒత్తిడి ఉన్నవారు దాన్ని తగ్గించుకునేందుకు ధ్యానం, రిలాక్సేషన్ టెక్నిక్స్ అనుసరించాలి.
ఎంత తక్కువ అయినా ముప్పే...
గుండెపోటు నివారణకు తోడ్పడుతుందంటూ కొందరు రెడ్‌వైన్ తాగుతుంటారు. మిగతా ఆల్కహాలిక్ డ్రింక్స్‌తో ΄ోలిస్తే రెడ్‌వైన్ ఆరోగ్యకరమనే అపోహ చాలామందిలో ఉంటుంది. నిజానికి రెడ్‌వైన్‌లో క్రోమోజెన్ ట్యానిన్స్ అనే రంగునిచ్చే పదార్థాలు ఉంటాయి. ఇవి పంటి ఎనామిల్‌ను దెబ్బతీస్తాయి. దాంతో పళ్లు మెరుపును కోల్పోతాయి. అంతేకాదు... ఎంత తక్కువ మోతాదులోనైనా ఆల్కహాల్ ఒంటికి ముప్పు తెచ్చే అంశమే!
పరిష్కారం: అది ఎంతటి ఖరీదైన లేదా నాణ్యమైన రెడ్‌వైన్ అయినప్పటికీ అది మద్యమే తప్ప ఆరోగ్యప్రదాయిని కానే కాదు. అదీ ఒకరకమైన మద్యమే కాబట్టి ఆ అలవాటును మానుకోవడమే మేలు.
గోళ్లు కొరికే అలవాటు... పళ్లకు చేటు...
కొందరు అదేపనిగా గోళ్లు కొరుక్కుంటుంటారు. ఈ చెడ్డ అలవాటుతో పళ్లు దెబ్బతింటాయి. గోళ్ల ద్వారా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నోటి ద్వారా కడుపులోకి వెళ్లి ఆరోగ్యం దెబ్బతినవచ్చు.
పరిష్కారం: గోళ్లు కట్ చేసుకోవాలనుకుంటే నెయిల్ కట్టర్‌నే వాడాలి. టెన్షన్ వల్ల ఈ అలవాటు వస్తే... ధ్యానం, రిలాక్సేషన్ టెక్నిక్స్ వంటి వాటితో ఆ దురలవాటుకు దూరం కావాలి.
పళ్లు కుట్టుకోవడం ఓ బ్యాడ్ హ్యాబిట్...
చాలామంది ఏదైనా తినగానే టూత్‌పిక్స్‌తో పళ్లు కుట్టుకుంటారు. ఈ అలవాటు వల్ల పళ్ల మధ్య సందులు మరింత పెరిగే ముప్పు ఉంటుంది. ఫలితంగా పళ్ల మధ్య మరింత ఆహారం చిక్కుకుని, బ్యాక్టీరియా పెరగడం, దాంతో పళ్లు మరింత వదులు కావడం వంటి ముప్పు ఉంటుంది.
పరిష్కారం: పళ్లు కుట్టుకునే అలవాటు మానేయాలి. వీలైతే ఫ్లాసింగ్ చేసుకోవాలి.
చివరగా... ఇక్కడ పేర్కొన్న చెడు అలవాట్లను వదులుకుంటే అవి చాలావరకు నోటికీ, పలువరసకు, పంటి చిగుర్లకు మాత్రమే కాదు... మొత్తం దేహానికే మంచి చేస్తాయని, ఓవరాల్ ఆరోగ్యానికీ మంచిదని గుర్తుంచుకోవవడం మేలు.
‘టీత్’కు ముప్పు తెచ్చిపెట్టే టీలు... కాఫీలు
కొందరు కాఫీలు, టీలు చాలా ఎక్కువగా తాగుతుంటారు. ఇక తమ పనిలో ఒత్తిడిని అధిగమించడానికి టీ, కాఫీలను అలవాటు చేసుకుంటుంటారు. కొంతలో కొంత టీ వల్ల అంతగా ముప్పు ఉండదేమోగానీ... కాఫీలో ఉండే అసిడిక్ గుణం వల్ల పలువరస పచ్చగా మారే ముప్పు ఉంటుంది.
టీ కూడా మరీ ఎక్కువగా తాగుతూ ఉంటే అదీ తెల్లటి పలువరస రంగుమారేలా చేస్తుంటుంది. అంతేకాదు... బాగా వేడివేడిగా ఉండే టీ, కాఫీలలోని ఉష్ణోగ్రత వల్ల పంటి ఎనామిల్ దెబ్బతీనే అవకాశమూ ఉంటుంది. అందుకే చాలాకాలం పాటు టీ, కాఫీలు మితిమీరి తాగుతుండే కొందరిలో పంటి మెరుపు తగ్గే ముప్పు కూడా ఉంటుంది. ఇక కాఫీ, టీలలో ఉండే చక్కెర పంటికి అంటుకుపోవడం వల్ల పళ్లమధ్య క్యావీటీలూ, పిప్పిపళ్లు వచ్చే ముప్పు కూడా ఎక్కువే.
పరిష్కారం: కాఫీ, టీలు తాగే అలవాటు ఉన్నవారు వాటిని పరిమితంగానే తీసుకోవాలి. ఇప్పటికే ఈ అలవాట్ల కారణంగా పళ్లు పచ్చబారి ఉంటే బ్లీచింగ్ చేయించుకోవడం ద్వారా వాటిని మళ్లీ మెరిసేలా చేసుకోవచ్చు.
పాన్‌లూ, జర్దా / ఖైనీలు వద్దు...
చాలామంది అదేపనిగా పాన్ తింటూ ఉంటారు. అందులో వక్కలను నములుతూ ఉంటారు. ఇక అందులో జర్దా, ఖైనీ వంటి పొగాకు ఉత్పాదనలు నోటి ద్వారా తీసుకుంటూ ఉంటారు. ఇందులో పాన్‌లోని కఠినమైన వక్కలను తినడం ఒక ప్రమాదమైతే... ఇక నోటి ద్వారా పొగాకును తీసుకోవడం పంటికీ, ఒంటికీ... ఈ రెంటికీ చాలా ప్రమాదం. ఇక పాన్ తినేవారి నోట్లో పళ్లు ఎర్రగా, చాలాకాలం నుంచి అదే అలవాటు ఉన్నవారిలో నల్లబారి ఉండటం చూస్తుంటాం.
పరిష్కారం: పాన్ తినే అలవాటు ఉన్నవారు తక్షణం ఆ అలవాటు మానివేయడం తప్పనిసరి. లేదంటే పళ్లకే కాదు మొత్తం దేహానికే ఈ అలవాటు చేటు తెచ్చిపెట్టవచ్చు. పాన్‌పరాగ్‌లూ, జర్దా వంటి పొగాకు ఉత్పాదనల వల్ల నోటి క్యాన్సర్ వచ్చే ముప్పు చాలా ఎక్కువ.
సిగరెట్లతో వచ్చే ముప్పు ఎన్నో రెట్లు...
సిగరెట్ అలవాటు అనేది కేవలం పళ్లను మాత్రమే దెబ్బతీయదు. అది పూర్తిగా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్నీ, గుండెనూ... ఒక్కోసారి పూర్తిగా శరీర ఆరోగ్యానికి ముప్పుగ పరిణమించవచ్చు. సిగరెట్ అలవాటు ఉన్నప్పుడు అది కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు... నోటి దుర్వాసనతో నలుగురిలో స్వేచ్ఛగా మాట్లాడగిగే సోషలైజింగ్‌కూ పరిమితులు విధిస్తుంది. పొగాకు వల్ల పంటి చిగుర్లకూ ఎన్నో రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు... నోటి క్యాన్సర్లూ, పెదవుల, నాలుక, గొంతు క్యాన్సర్‌ల (హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ల) ముప్పును తెచ్చిపెడుతుంది.
పరిష్కారం: సిగరెట్లతో / పొగతాగడం వల్ల ఆరోగ్యానికి కలిగే ముప్పు తప్పాలంటే తప్పక పొగతాగే అలవాటును వదిలివేయాల్సిందే. అప్పటికీ ఆ అలవాటును వదలలేకపోతే డాక్టర్ సలహా మేరకు కొంతకాలం పాటు చ్యూయింగ్ గమ్స్ వంటి ప్రత్యామ్నాయాలు చూసుకోవాలి. ఇలాంటి ప్రత్యామ్నాయాలు కూడా కొద్దికాలం కోసమే.
పెన్సిల్‌ను కొరకవద్దు...
కొందరు ఏదైనా రాస్తూ రాస్తూ ఉండి మధ్యమధ్యన ఏదో ఆలోచిస్తూ పెన్సిల్‌ను గానీ లేదా పెన్ క్యాప్‌ను గానీ పళ్ల మధ్య పెట్టుకొని కొరుకుతుంటారు. పెన్సిల్ మధ్యన ఉండే లెడ్ చాలా ప్రమాదకారి. ఈ లెడ్‌పాయిజన్ చిగుర్ల రంగును నల్లగా మారుస్తుంది. పైగా లెడ్ పాయిజన్ మేనికి కూడా ప్రమాదకరమే.
పరిష్కారం: రాస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు పళ్లమధ్యకు పెన్నూ, పెన్సిల్ పెట్టుకోవద్దు. మరీ తప్పనప్పుడు చ్యూయింగ్‌గమ్ వంటివి నములుతూ ఉండటం కాస్తంత బెటర్. అసలు నమిలే అలవాటును మానుకోవడమే ఆరోగ్యానికి మేలు.
పళ్లకు చుట్టుకుపోయే చాక్లెట్లు...
తియ్యటి చాక్లెట్లు అంటే పిల్లలందరికీ ఇష్టమే. పైగా కొందరు పెద్దవాళ్లు కూడా తమకు మంచి ఆరోగ్య సమకూరడానికి డార్క్ చాక్లెట్లు తీసుకుంటూ ఉంటారు. అయితే చాక్లెట్లలో చాలావరకు పళ్లకు చుట్టుకుపోతూ ఉంటాయి. అలా చుట్టుకుపోవడంతో అందులోని చక్కెరను చాలాసేపు పంటిని అంటిపెట్టుకునే ఉంటూ... దంతక్షయానికి దారి తీస్తుంది. అంతేకాదు.. అలా చాలాకాలం పాటు చాక్లెట్లు చుట్టుకుపోవడం, పళ్లపైన ఉండే గుంటవంటి ప్రదేశంలో ఇరుక్కుపోవడం వల్ల పళ్లమధ్య రంధ్రాలు (క్యావిటీలు) పడే అవకాశాలెక్కువ.
ఈ రంధ్రం లోతు పెరుగుతున్న కొద్దీ... అందులో ఆహారపదార్థాలూ, చాక్లెట్ల వంటి చుట్టుకు΄ోయే పదార్థాలు మరింత ఎక్కువగా ఇరుక్కుపోతూ ఆ రంధ్రాలను మరింత లోతు ఎక్కువయ్యే ముప్పు ఉంటుంది. ఇలాంటి చర్యల వల్లనే పిల్లల్లో పిప్పిపళ్లు వస్తుంటాయి.
పరిష్కారం: పంటిని చుట్టుకు΄ోయే చాక్లెట్లు, క్యాండీలు తీసుకున్న వెంటనే బ్రష్ చేసుకోవడం లేదా ఆ చుట్టుకుపోయిన పదార్థాలు పూర్తిగా తొలగిపోయేలా వేలిని ఉపయోగించి నోరు కడుక్కోవాలి.
పాల బాటిల్ పళ్ల మధ్య పెట్టడం సరికాదు...
కొందరు పిల్లలు రాత్రంతా పాలసీసా పళ్ల మధ్య పెట్టుకుని నిద్రపోతుంటారు. పిల్లలు అల్లరి చేయకుండా ఉండటానికి చాలామంది తల్లులు ఈ అలవాటును ప్రోత్సహిస్తుంటారు. నిజానికి ఈ దురలవాటు వల్ల పిల్లలకు ‘మిల్క్‌బాటిల్ కేరిస్’ అనే సమస్య వచ్చే అవకాశముంది. దాంతో చిన్నారుల్లో పిప్పిపళ్లు వచ్చి పళ్లన్నీ దెబ్బతినే ప్రమాదం ఉంది. పైగా పాలలో ఉండే చక్కెరవల్ల కూడా పళ్లు పుచ్చిపోతాయి.
పరిష్కారం: రాత్రివేళల్లో పిల్లల నోటికి పాలసీసా ఇవ్వడం సరికాదు. మరీ తప్పనిసరై చిన్నారులకు పాలను పట్టించాల్సి వస్తే గ్లాసు / స్పూన్ / ఉగ్గుగిన్నెతో పాలు పట్టించాలి. పిల్లలు పాలు తాగాక పెద్దపిల్లలకు బ్రషింగ్ చేయించడమూ లేదా బ్రషింగ్‌కు వీలుకాకపోతే కనీసం ఒక గ్లాసు నీళ్లయినా తాగించడం అవసరం.
డాక్టర్ ప్రత్యూష, కన్సల్టెంట్, డెంటల్ – కాస్మెటిక్ సర్జన్


