‘సైలెంట్ పీరియడ్’ షురూ.. ఈ 48 గంటల్లో.. | What is the 48 hour silent period ahead of voting? | Sakshi
Sakshi News home page

‘సైలెంట్ పీరియడ్’ షురూ.. ఈ 48 గంటల్లో..

Apr 7 2026 1:58 PM | Updated on Apr 7 2026 2:12 PM

What is the 48 hour silent period ahead of voting?

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరానికి సమయం ఆసన్నమైన వేళ, కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. పోలింగ్‌కు ముందు తప్పనిసరిగా అమలు చేసే 48 గంటల ‘సైలెంట్ పీరియడ్’లో రాజకీయ పార్టీలు, మీడియా పాటించాల్సిన కఠిన నిబంధనలను మరోసారి స్పష్టం చేసింది.

సైలెంట్ పీరియడ్ అంటే ఏంటి?
అస్సాం, కేరళ, పుదుచ్చేరిలలో ఏప్రిల్ తొమ్మదిన పోలింగ్ జరగనుంది. తమిళనాడులో ఏప్రిల్ 23న, పశ్చిమ బెంగాల్‌లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951, సెక్షన్ 126 (1)(b) ప్రకారం.. పోలింగ్ ప్రక్రియ ముగియడానికి ముందున్న 48 గంటల సమయాన్ని ‘సైలెంట్ పీరియడ్’ అని అంటారు. ఈ సమయంలో ఓటర్లను ప్రభావితం చేసే లేదా ఏదైనా రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉండే ఎలాంటి సమాచారాన్ని మీడియా లేదా ఇతర పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రసారం చేయకూడదు.

ఈ 48 గంటల్లో నిబంధనలు ఏంటి?
ఎలక్ట్రానిక్ మీడియాలో ఎన్నికలకు సంబంధించిన అంశాలు, ఒపీనియన్ పోల్స్, సర్వే ఫలితాలు ప్రసారం చేయడం పూర్తిగా నిషేధం.
టీవీ, రేడియో, కేబుల్ నెట్‌వర్క్‌లు, సినిమా హాళ్లలో రాజకీయ ప్రకటనలు ఇవ్వకూడదు. ఎస్ఎంఎస్, వాయిస్ మెసేజ్‌లు, ఆడియో విజువల్ ప్రదర్శనల ద్వారా ప్రచారం చేయరాదు.
స్టార్ క్యాంపెయినర్లు, రాజకీయ నాయకులు ప్రెస్ మీట్లు నిర్వహించడం గానీ, ఎన్నికల గురించి ఇంటర్వ్యూలు ఇవ్వడం గానీ చేయకూడదు.
పోలింగ్ ప్రాంతంలో మద్యం విక్రయాలు, పంపిణీపై పూర్తి నిషేధం (డ్రై డే) ఉంటుంది.

ఎగ్జిట్ పోల్స్‌పై బ్యాన్
ఓటర్లు ప్రభావితం కాకుండా ఉండేందుకు ఎగ్జిట్, ఒపీనియన్ పోల్స్‌పై ఈసీ పూర్తి నిషేధం విధించింది. ఏప్రిల్ 9వ తేదీ ఉదయం 7 గంటల నుంచి ఏప్రిల్ 29 సాయంత్రం 6.30 గంటల వరకు ఈ బ్యాన్ అమలులో ఉంటుంది. ఈ ఐదు రాష్ట్రాలతో పాటు గోవా, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లో జరిగే ఎనిమిది ఉప ఎన్నికలకూ ఇది వర్తిస్తుంది. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలకు ఈ నిబంధనలు సమానంగా వర్తిస్తాయి.

ఉల్లంఘిస్తే ఏమవుతుంది?
ఈ నిబంధనలను ఉల్లంఘించి ఈ 48 గంటల సైలెంట్ పీరియడ్‌లో ప్రచారం చేసినా, నిబంధనలు అతిక్రమించినా రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా.. లేదంటే రెండూ విధించే అవకాశం ఉంది.
 
ఇది కూడా చదవండి: కేరళ వరదలు.. సంచలన ఆడియో విడుదల

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement