తిరువనంతపురం: కేరళ రాష్ట్రాన్ని 2018లో వణికించిన మహా వరదలు ప్రకృతి విపత్తు కాదు, కేవలం కొందరి ధనదాహంతో జరిగిన ‘మానవ తప్పిదమే’ అని వెల్లడించే ఒక సంచలన ఆడియో వెలుగులోకి వచ్చింది. అవినీతి, ఇసుక మాఫియాల వల్లే ఆ ఘోరం జరిగిందని ఆరోపిస్తూ మువట్టుపుజ ఎమ్మెల్యే, యూడీఎఫ్ అభ్యర్థి మ్యాథ్యూ కుజల్నాదన్ ఒక ఆడియో క్లిప్‌ను తాజాగా విడుదల చేశారు.
వివరాల్లోకి వెళితే.. కుజల్నాదన్ విడుదల చేసిన ఈ ఆడియో, ప్రస్తుత విద్యుత్ శాఖ మంత్రి కె. కృష్ణన్‌కుట్టి మాట్లాడినట్లుగా భావిస్తున్నారు. అప్పటి జలవనరుల శాఖ మంత్రి మాథ్యూ టి. థామస్ హయాంలో జరిగిన అవకతవకలు, లంచగొండితనమే ఈ భయంకరమైన వరదలకు కారణమని ఆ ఆడియోలో వెల్లడవుతోంది. ప్రైవేట్ కాంట్రాక్టర్‌కు చెందిన కోట్ల రూపాయల ఇసుక నిల్వలను కాపాడేందుకు తోట్టప్పల్లి స్పిల్‌వేను ఒక నెల ముందే తెరవాల్సి ఉన్నా.. ఉద్దేశపూర్వకంగానే మూసి ఉంచారని ఆ ఆడియోలో ఆరోపించారు.
చీఫ్ ఇంజనీర్ జోషితో పాటు అప్పటి సీపీఎం ఎమ్మెల్యే జార్జ్ థామస్ సోదరి, మంత్రి మాథ్యూ టి. థామస్ కుమ్మక్కై.. కాంట్రాక్టర్‌కు రూ. 300 కోట్ల లాభం చేకూర్చేందుకు స్పిల్‌వే గేట్లు ఎత్తకుండా జాప్యం చేశారని అందులో పేర్కొన్నారు. ఒకవేళ గేట్లు సకాలంలో తెరిచి ఉంటే ఆ ఖనిజ ఇసుక కొట్టుకుపోయేది. ఒక ప్రైవేట్ విద్యుత్ కంపెనీకి రూ.8 కోట్ల లాభం చేకూర్చడానికి మణియార్ ప్రాజెక్టులో చట్టవిరుద్ధంగా నీటిని నిల్వ చేశారని ఆ ఆడియో ద్వారా తెలుస్తోంది. ఆ తర్వాత అకస్మాత్తుగా ఆ అదనపు నీటిని వదలడం వల్లే చెంగన్నూర్ లాంటి ప్రాంతాలు సర్వనాశనం అయ్యాయని అందులో పేర్కొన్నారు.
దీనికి తోడు తమిళనాడుకు మళ్లించాల్సిన దాదాపు 1,400 క్యూసెక్కుల నీటిని, పొరుగు రాష్ట్రంలో జరుగుతున్న రూ.200 కోట్ల నిర్మాణ ప్రాజెక్టును కాపాడేందుకు ఉద్దేశపూర్వకంగా చాలకుడి నదీ పరీవాహక ప్రాంతంలోకి మళ్లించారని మరో తీవ్ర ఆరోపణ వెలుగుచూసింది. నీటి ప్రవాహం తమ పనులకు ఆటంకం కలిగించకుండా కాంట్రాక్టర్లు అధికారులకు భారీగా ముడుపులు చెల్లించారని ఆడియోలో ఉంది. కేరళ ప్రజల ప్రాణాలు, ఆస్తులను పణంగా పెట్టి ఈ నేత ఎన్ని కోట్లు వెనకేసుకున్నారో సమాధానం చెప్పాలని కుజల్నాదన్ మీడియా సమావేశంలో సూటిగా ప్రశ్నించారు. ఈ ఆడియో వ్యవహారం ఇప్పుడు కేరళ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఇది కూడా చదవండి: శబరిమల వివాదం: సుప్రీంకోర్టులో కేంద్రం కీలక వాదన


