శబరిమల వివాదం: సుప్రీంకోర్టులో కేంద్రం కీలక వాదన | Sabarimala Case Back In Supreme Court As Centre Backs Tradition Over Gender Equality Debate, Read More Details | Sakshi
Sakshi News home page

శబరిమల వివాదం: సుప్రీంకోర్టులో కేంద్రం కీలక వాదన

Apr 7 2026 11:43 AM | Updated on Apr 7 2026 1:28 PM

Sabarimala Case Entry Of Women Would Alter Nature Of Worship

ఢిల్లీ: సుప్రీంకోర్టులో శబరిమల కేసుపై మంగళవారం రాజ్యాంగ ధర్మాసనం విచారణ ప్రారంభించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. 2018లో శబరిమలలో మహిళల పై నిషేధాన్ని ఎత్తివేస్తూ ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. 10 నుంచి 50 ఏళ్ల మహిళల శబరిమల ప్రవేశం పై నిషేధ విధించడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది.

సుప్రీంకోర్టు తీర్పును సవాల్ చేస్తూ  80 రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. శబరిమల తీర్పునే కాకుండా...మత స్వేచ్ఛ , సమానత్వపు హక్కు అంశాలపై  తొమ్మిదిమంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. శబరిమలలో మహిళలపై ఆంక్షలు మతాచారమని.. అవి న్యాయ సమీక్షకు అతీతమైనవని   కేంద్ర ప్రభుత్వం, కేరళ ప్రభుత్వం వాదిస్తున్నాయి. 

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ 2018లో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణకు ముందు కేంద్ర ప్రభుత్వం కీలక వాదనలు వినిపించింది. ఒక ప్రార్థనా మందిరంలోకి ఎవరు ప్రవేశించాలనేది 'లింగ వివక్ష' కిందకు రాదని, అది దేవతామూర్తి స్వభావం, తరతరాల మత విశ్వాసాలతో ముడిపడి ఉన్న అంశమని స్పష్టం చేసింది.

మహిళల అపవిత్రత లేదా వారి న్యూనతకు సంబంధించినది కాదని కేంద్రం తన లిఖితపూర్వక వాదనలలో స్పష్టం చేసింది. స్వామివారు 'నైష్ఠిక బ్రహ్మచారి కావడం వల్లే శతాబ్దాలుగా ఈ ఆచారాలు అమలులో ఉన్నాయని తెలిపింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు వివరణ ఇస్తూ.. ‘మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తే అక్కడి పూజా విధానాల మౌలిక స్వభావమే పూర్తిగా మారిపోతుంది. ఇది రాజ్యాంగం కల్పించిన మతపరమైన స్వేచ్ఛను దెబ్బతీయడమే. దశాబ్దాలుగా పురుషులతో పాటు, మహిళలు సైతం ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగానే స్వామివారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తున్నారు’ అని పేర్కొన్నారు. ఆలయ ప్రవేశంపై ఉన్న ఆంక్షలను సమర్థించాలని సుప్రీంకోర్టును కోరారు.

మతపరమైన ఆచారాలను ‘హేతుబద్ధత', ‘ఆధునికత’ లేదా 'శాస్త్రీయత' వంటి ప్రమాణాలతో బేరీజు వేయడం సరికాదని కోర్టుకు సూచించింది. ఈ వివాదం పూర్తిగా మత విశ్వాసాలు, స్వయంప్రతిపత్తి పరిధిలోకి వచ్చే అంశమని, దీనిపై న్యాయసమీక్ష తగదని అభిప్రాయపడింది. మత గ్రంథాలను అన్వయించడానికి లేదా వేదాంతపరమైన ప్రశ్నలను నిర్ధారించడానికి న్యాయమూర్తులకు ఆ స్థాయి శిక్షణ లేదని, అది వారి పరిధిలో లేని అంశమని కేంద్రం తన వాదనల్లో తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement