న్యూఢిల్లీ: ‘ఉద్యోగమే ప్రాణంగా భావించి, రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసినా ఫలితం శూన్యం.. సెలవులు కూడా తీసుకోకుండా అహర్నిశలు శ్రమించినా.. గూగుల్ లాంటి దిగ్గజ సంస్థ కూడా తనను నిర్దాక్షిణ్యంగా ఉద్యోగంలో నుంచి తీసేసిందని’ ఒక టెక్కీ ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగ భద్రత అస్సలు లేదని, ఏ క్షణంలోనైనా కంపెనీలు మనల్ని సాగనంపొచ్చని యువతకు ఆయన రియాలిటీ చెక్ ఇస్తున్నారు.
జేసన్ జాంగ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గత నెలలో గూగుల్ చేపట్టిన లేఆఫ్స్‌లో తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. అప్పటినుంచి ఫేస్ చేస్తున్న తన నిరుద్యోగ జీవితాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా నెటిజన్లతో పంచుకుంటున్నారు. ‘నేను ఎప్పుడూ నా పనికే మొదటి ప్రాధాన్యత ఇచ్చాను. మరింత కష్టపడితే, రోజులో ఎక్కువ గంటలు పనిచేస్తే, నా వెకేషన్స్ వాయిదా వేసుకుంటే.. నా శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుందని బలంగా నమ్మాను. కానీ, ఇవేవీ నా ఉద్యోగాన్ని కాపాడలేకపోయాయి’ అని జాంగ్ తన తాజా వీడియోలో వాపోయాడు. రాత్రులు, వీకెండ్స్ అని తేడా లేకుండా తన జీవితమంతా ఆఫీస్ పనులకే పరిమితమయ్యానని గుర్తుచేసుకున్నాడు.
ప్రాణం పెట్టి పనిచేస్తే ఉద్యోగం ఊడదన్నది ఒక భ్రమ మాత్రమేనని జాంగ్ స్పష్టం చేశాడు. తనతో పాటు పనిచేసిన ఎంతో మంది ప్రతిభావంతులైన ఉద్యోగులు కూడా ఇలాగే ఉద్యోగాలు కోల్పోయారని తెలిపారు. ‘కంపెనీలు ఎప్పుడైనా మిమ్మల్ని వదిలించుకోగలవు.. కార్పొరేట్ రంగంలో ఇదే ఇప్పుడు కొత్త సాధారణంగా మారిపోయింది" అని పేర్కొన్నారు. ఈ చేదు అనుభవం తర్వాత, తాను ఏదో ఒకటి సొంతంగా చేయాలని ఆలోచన చేస్తున్నట్లు జాంగ్ తెలిపాడు.
నెటిజన్ల రియాక్షన్..
జాంగ్ వీడియోపై నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. ‘మనం ఎప్పుడూ ఇతరుల కోసమే కష్టపడతాం కానీ, మన కోసం పనిచేయం. ముందు మీ ఆరోగ్యానికి, వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇవ్వండి. మీరు లేకపోయినా కంపెనీలో పనులు ఆగవు, కానీ మీ జీవితం ఆగిపోతుంది’ అని ఒకరు విలువైన సలహా ఇచ్చారు. చేస్తున్న ఉద్యోగంతో పాటే ఇతర అవకాశాలు, సైడ్ బిజినెస్ కూడా వెతుక్కోవాలని మరొకరు సూచించారు. 25 ఏళ్లకే తాను కూడా ఇలాగే ఉద్యోగం కోల్పోయి ఏడు నెలలు తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు ఒక యూజర్ తన అనుభవాన్ని పంచుకుంటూ.. జాంగ్‌కు భవిష్యత్తులో మంచి వాతావరణం ఉన్న ఉద్యోగం దొరకాలని ఆకాంక్షించారు.
ఇది కూడా చదవండి: వార్నీ.. వేలికి సిరా ఉంటే చాలు.. ఆఫర్లే ఆఫర్లు!


