వార్నీ.. వేలికి సిరా ఉంటే చాలు.. ఆఫర్లే ఆఫర్లు! | Cafe Coffee Day offers for Kerala voters on polling day | Sakshi
Sakshi News home page

వార్నీ.. వేలికి సిరా ఉంటే చాలు.. ఆఫర్లే ఆఫర్లు!

Apr 7 2026 8:55 AM | Updated on Apr 7 2026 9:06 AM

Cafe Coffee Day offers for Kerala voters on polling day

తిరువనంతపురం: ఓటు వేయడం మన ప్రాథమిక బాధ్యతే కాదు.. అది ఇప్పుడు అదిరిపోయే ఆఫర్లను కూడా అందిస్తోంది. ఏప్రిల్ 9న జరగనున్న కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను పోలింగ్ బూత్‌లకు రప్పించేందుకు ఎన్నికల సంఘం పలు సంస్థలతో కలిసి వినూత్న ప్రయత్నాలు చేస్తోంది. ఓటు హక్కు వినియోగించుకున్న వారికి ప్రముఖ ‘కేఫ్ కాఫీ డే’(సీసీడీ) బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఓటు వేసినట్లు వేలిపై ఉన్న సిరా చుక్కను చూపిస్తే చాలు.. కాఫీపై ఏకంగా 25 శాతం డిస్కౌంట్ అందిస్తోంది.

ముందు వచ్చిన వారికే ఛాన్స్..
ఓటింగ్ శాతాన్ని, ముఖ్యంగా యువత భాగస్వామ్యాన్ని పెంచే లక్ష్యంతో ఎన్నికల సంఘం, కేఫ్ కాఫీ డే సంయుక్తంగా ఈ ఆఫర్‌ను తీసుకువచ్చాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రతన్ యు. కేల్కర్ వెల్లడించారు. అయితే ఈ ఆఫర్ అందరికీ కాదు.. రాష్ట్రంలోని ప్రతి కేఫ్ కాఫీ డే ఔట్‌లెట్‌లో.. సిరా చుక్కను చూపించిన మొదటి 15 మంది కస్టమర్లకు మాత్రమే ఈ 25శాతం రాయితీ లభిస్తుంది. ముందుగా ఓటు వేసిన వారికే ఈ లక్కీ ఛాన్స్ దక్కనుంది.

తొలి ఓటుకు తీయని ‘హల్వా’..
యువతను ఆకట్టుకునేందుకు కేవలం కాఫీ డిస్కౌంట్ మాత్రమే కాదు.. తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకునే యువ ఓటర్లకు సాంప్రదాయబద్ధంగా తీయటి ‘హల్వా’ను బహుమతిగా ఇవ్వాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.

ఉబెర్ ఉచిత రైడ్స్.. రూ.1 కే బియ్యం పిండి
ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు సులభంగా చేరుకునేందుకు ప్రఖ్యాత క్యాబ్ సేవల సంస్థ ‘ఉబెర్’ సైతం ముందుకు వచ్చింది. ఎర్నాకులం, తిరువనంతపురం నగరాల్లో.. పోలింగ్ స్టేషన్‌కు రెండు కిలోమీటర్ల పరిధిలో ప్రయాణించే ఓటర్లకు ఉచిత రైడ్‌లను ఉబెర్ అందిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ 'సప్లైకో' (SupplyCo) స్థానిక ప్రజల ప్రయోజనార్థం మరో ప్రత్యేక పథకాన్ని పరిశీలిస్తోంది. ఎన్నికల ముగిసిన వెంటనే అంటే ఏప్రిల్ 10, 11 తేదీలలో కేవలం ఒక్క రూపాయినే (Re 1) బియ్యం పిండిని అందించే యోచనలో ఉంది. మొత్తానికి.. ఓటర్లలో ఉత్సాహం నింపి, ఈ ప్రజాస్వామ్య పండుగలో అందరినీ భాగస్వాములను చేసేందుకు కేరళలో ముందెన్నడూ చూడని రీతిలో ఆఫర్లు సిద్ధమయ్యాయి.

ఇది కూడా చదవండి: ఎన్నికల వేళ.. షాకిస్తున్న కేరళ సర్కారు వైఖరి!

Advertisement
 
Advertisement
Advertisement