ఎన్నికల వేళ.. షాకిస్తున్న కేరళ సర్కారు వైఖరి! | Kerala Govt backs review of SC verdict allowing women's entry | Sakshi
Sakshi News home page

ఎన్నికల వేళ.. షాకిస్తున్న కేరళ సర్కారు వైఖరి!

Apr 7 2026 8:11 AM | Updated on Apr 7 2026 8:31 AM

Kerala Govt backs review of SC verdict allowing women's entry

తిరువనంతపురం: శబరిమల ఆలయంలోనికి అన్ని వయసుల మహిళల ప్రవేశ వ్యవహారంలో కేరళ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ.. మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ, సంప్రదాయాలను కాపాడాలని కోరుతున్న వారికి మద్దతుగా నిలుస్తూ, ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.

శబరిమలలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేరళ ప్రభుత్వం గతంలో పూర్తిగా సమర్థించింది. ఇప్పుడు తన వ్యూహాన్ని మార్చుకుంది. 10 నుంచి 50 ఏళ్ల లోపు మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ, దాఖలైన రివ్యూ పిటిషన్లను తాము సమర్థిస్తున్నామని, వ్యతిరేక వర్గంతో కలిసి తమ వాదనలు వినిపించేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. రాష్ట్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్ నిషే రాజెన్ శోంకర్, పిటిషనర్ల నోడల్ కౌన్సిల్ కృష్ణకుమార్ సింగ్‌కు ఈ మేరకు అధికారికంగా లేఖ పంపారు.

శతాబ్దాల నాటి మతపరమైన ఆచారాల్లో జోక్యం చేసుకునే ముందు కోర్టులు.. మత పెద్దలు, సామాజిక సంస్కర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం లిఖితపూర్వకంగా సుప్రీంకు తెలిపింది. అయితే కచ్చితమైన వైఖరి చెప్పకుండా దాటవేసిన సర్కార్, ఇప్పుడు మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకించే వారితో చేతులు కలపడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ రివ్యూ పిటిషన్లపై మంగళవారం(నేటి) నుంచి వాదనలు ప్రారంభం కానున్నాయి. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ వాదనలకు నాయకత్వం వహిస్తూ, మతపరమైన అంతర్గత ఆచారాలపై తీర్పునిచ్చే అధికారం కోర్టులకు లేదని వాదించనున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25(1) ప్రకారం ఆచారాల్లో సంస్కరణలను బలవంతంగా రుద్దలేరని ఆయన స్పష్టం చేయనున్నారు.  

అనంతరం ఆలయ ట్రస్టు తరపున సీనియర్ న్యాయవాది వి.గిరి, ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు తరపున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీలు మహిళల ప్రవేశానికి వ్యతిరేకంగా తమ వాదనలు వినిపించనున్నారు. ఏప్రిల్‌ 9న కేరళ ప్రజలు పోలింగ్ బూత్‌లకు వెళ్లి ఓటు వేయడానికి ముందుగా, సుప్రీంకోర్టులో ఈ కీలక వాదనలు జరగనుండటం గమనార్హం. అయితే సింఘ్వీ వాదనలకు ముందే కోర్టు ముందు తమ తాజా వైఖరిని వినిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం  ప్రయత్నిస్తోందని సమాచారం. ఏదేమైనప్పటికీ ఎన్నికల ముందు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సంచలనంగా మారింది.

ఇది కూడా చదవండి: బెంగాల్ రణరంగం: ‘దీదీ’ ముంగిట అతిపెద్ద గండం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement