బెంగాల్ రణరంగం: ‘దీదీ’ ముంగిట అతిపెద్ద గండం | This Assembly Election is Mamata Banerjee's toughest poll battle | Sakshi
Sakshi News home page

బెంగాల్ రణరంగం: ‘దీదీ’ ముంగిట అతిపెద్ద గండం

Apr 7 2026 7:26 AM | Updated on Apr 7 2026 8:40 AM

This Assembly Election is Mamata Banerjee's toughest poll battle

గడచిన 15 ఏళ్లుగా పశ్చిమ బెంగాల్ రాజకీయాలను ఏకఛత్రాధిపత్యంగా శాసిస్తున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తన ప్రయాణంలో ఎన్నో రాజకీయ సవాళ్లు ఎదురయ్యాయి. అయితే ప్రతిసారీ ఆమెదే పైచేయి అవుతూ వచ్చింది. దశాబ్దం క్రితం శారద, నారద వంటి కుంభకోణాలు చుట్టుముట్టినా, 2011లో మునుపటి కన్నా 27 సీట్లు అదనంగా సాధించి, ఆమె సత్తా చాటారు. ఇక 2021లో అధికార వ్యతిరేకత, బీజేపీ సృష్టించిన భారీ ఫిరాయింపుల సునామీని సైతం ‘లక్ష్మీర్ భండార్’ అనే మహిళా సంక్షేమ పథకం సాయంతో మమత తిప్పికొట్టారు. అలాగే రికార్డు స్థాయిలో 215 సీట్లు కైవసం చేసుకున్నారు. అయితే ఈ  ఏప్రిల్‌(2026) నెలాఖరులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు ‘దీదీ’కి నిద్రలేకుండా చేస్తున్నాయి. ఈసారి ఆమెకు ప్రధాన శత్రువులు ప్రతిపక్షాలు కాదు.. ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణే అని విశ్లేషకులు అంటున్నారు.

లోలోపల టెన్షన్..
పైకి అంతా సవ్యంగానే ఉన్నట్లు, ధీమాగా కనిపిస్తున్నా.. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)అభ్యర్థుల్లో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. ‘చాలా ఒత్తిడి ఉంది.. 226 స్థానాల టార్గెట్‌ను చేరుకోవడం కష్టమే అనిపిస్తోంది’ అని స్వయంగా ఓ టీఎంసీ అభ్యర్థి పెదవి విరవడం క్షేత్రస్థాయి పరిస్థితికి అద్దం పడుతోంది. ఏప్రిల్ 23న తొలిదశ పోలింగ్ జరగనుంది. కాగా 152 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా 35,97,704 మంది ఓటర్ల భవితవ్యం ఎన్నికల సంఘం చేపట్టిన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) కారణంగా గాలిలో దీపంలా మారింది. ఎంతమంది ఓటు హక్కు కోల్పోతారోనన్న స్పష్టత లేకపోవడం తృణమూల్ శ్రేణులను వెంటాడుతోంది.

కంచుకోటకు భారీ దెబ్బ
ఓటర్లే పునాదిగా నిర్మించుకున్న మమత కంచుకోటను ఈసీ ఓటర్ల సవరణ ప్రక్రియ బలంగా కొడుతోందని టీఎంసీ భావిస్తోంది. విచారణ (అడ్జుడికేషన్)లో ఉన్న 60.06 లక్షల మంది ఓటర్లలో ఏప్రిల్ 5 నాటికి 57 లక్షల కేసులను ఈసీ పరిష్కరించింది. అయితే, ఈ ప్రక్రియ ఎంత అస్తవ్యస్తంగా ఉందో చెప్పేందుకు ఓ గణాంకం సాక్ష్యంగా నిలుస్తోంది. ముస్లిం జనాభా అధికంగా ఉండే నార్త్ దినాజ్‌పూర్‌లోని ఒక్క 'గోల్పోఖర్' నియోజకవర్గంలోనే 78,475 మంది ఓటర్లు విచారణలో ఉండగా.. గిరిజన జనాభా అధికంగా ఉండే బంకురా, పురూలియా జిల్లాలను పూర్తిగా కలిపినా ఆ సంఖ్య 72,694 మాత్రమే ఉండటం గమనార్హం.

‘కేంద్రం కుట్రపూరితంగా..’
బరాక్‌పూర్ టీఎంసీ ఎంపీ పార్థా భౌమిక్  మాట్లాడుతూ ‘మైదానంలో మాకు ప్రతిపక్షమే లేదు. మేం నేరుగా ఎన్నికల సంఘంతోనే పోరాడుతున్నాం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం కుట్రపూరితంగా ఈసీ ద్వారా ప్రజల ఓటు హక్కును హరించాలని చూస్తోందని, అయినా బెంగాల్ ప్రజలు నాలుగోసారి మమతా దీదీకే పట్టం కడతారని మంత్రి చంద్రమా భట్టాచార్య ధీమా వ్యక్తం చేశారు. ఈసారి ఎన్నికల గణాంకాలు టీఎంసీకి ఏమాత్రం సానుకూలంగా లేవు. 2021లో 55 స్థానాల్లో టీఎంసీ 15,000 లోపు మెజారిటీతో బయటపడింది. అందులో 39 చోట్ల మెజారిటీ 10 వేల లోపే. ఒకవేళ ఏమాత్రం వ్యతిరేక పవనాలు వీచినా, ఈ 55 సీట్లు చేజారి, టీఎంసీ బలం 170కి పడిపోతుంది.

సొంత నియోజకవర్గంలో సెగలు
2024 లోక్‌సభ లెక్కల ప్రకారం చూస్తే, అసెంబ్లీ సెగ్మెంట్లలో 15 వేల లోపు స్వల్ప మెజారిటీ ఉన్న స్థానాలు 69కి పెరిగాయి. దీదీ సొంత నియోజకవర్గం భవానీపూర్, మానిక్తల, రాస్ బిహారీలలో మార్జిన్ తగ్గగా.. రాజార్‌హట్-గోపాల్‌పూర్‌లో మెజారిటీ కేవలం 74 ఓట్లే! ఈ లెక్కన స్వల్ప స్వింగ్ వచ్చినా టీఎంసీ మ్యాజిక్ ఫిగర్ కంటే తక్కువగా 146కి పడిపోయే ప్రమాదం ఉంది. ముస్లిం బెల్ట్ అయిన నార్త్ దినాజ్‌పూర్, మాల్డా, ముర్షిదాబాద్, బీర్భూమ్ (తొలి దశ పోలింగ్)లలోని 52 స్థానాలతో పాటు, సౌత్, నార్త్ 24 పరగణాలు, హౌరా జిల్లాల్లో టీఎంసీకి ఎదురులేదని విశ్లేషకులు చెబుతున్నారు.

వణికిస్తున్న నార్త్‌ బెంగాల్‌
నార్త్ బెంగాల్ మాత్రం టీఎంసీ పార్టీకి అతిపెద్ద బలహీనతగా మారింది. ఓటర్ల జాబితా అప్పీళ్ల ప్రక్రియను సరిదిద్దేందుకు పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ప్రతిరోజూ ప్రచారం ముగిశాక అర్ధరాత్రి వరకూ కుస్తీ పడుతున్నారు. తమ సగం శ్రమను ఈసీతో పోరాడటానికే వెచ్చించాల్సి వస్తోందని టీఎంసీ వర్గాలు వాపోతున్నాయి. మరోవైపు ఈ ఎన్నికల్లో బీజేపీ వంద సీట్లు దాటినా అది తమకు పెద్ద ప్రమాద హెచ్చరికేనని టీఎంసీ చెబుతోంది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీని చిత్తు చేస్తే, ఆ ప్రభావం 2029 లోక్‌సభ ఎన్నికల వరకు ఉంటుందని కూడా విశ్వసిస్తోంది. ‘మే 4తో మా పోరాటం ముగియదు.. 2029 వరకు కొనసాగుతుంది’ అంటూ ఓ టీఎంసీ నేత చేసిన వ్యాఖ్యలు.. ఈ ఎన్నికలు ఆ పార్టీని ఎంతలా భయపెడుతున్నాయో చెప్పకనే చెబుతున్నాయి.

ఇది కూడా చదవండి: విజయ్‌ కొత్త అఫిడవిట్‌.. వెలుగులోకి రెండు కేసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement