రనౌట్‌ వివాదం : అంపైర్‌ను పొడిచి చంపేశాడు | Cricket umpire stabbed to death by spectator over run out call in Visakhapatnam | Sakshi
Sakshi News home page

రనౌట్‌ వివాదం : అంపైర్‌ను పొడిచి చంపేశాడు

Apr 7 2026 2:31 PM | Updated on Apr 7 2026 3:47 PM

Cricket umpire stabbed to death by spectator over run out call in Visakhapatnam

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో  క్రికెట్‌ మ్యాచ్‌లో రనౌట్ నిర్ణయం  అంపైర్‌ ప్రాణం తీసింది.  స్థానిక మ్యాచ్‌లో  21 ఏళ్ల క్రికెట్ అంపైర్‌ను కత్తితో పొడిచి చంపిన వైనం దిగ్భ్రాంతి రేపింది. 

ఎన్‌డీటీవీ కథనం ప్రకారం  బాధితుడు, డోల అజిత్ బాబు, తన తోటి అంపైర్ బుదుమూరి చిరంజీవితో కలిసి స్థానిక మైదానంలో ఆదివారం క్రికెట్‌ ఆడారు. మూడు జట్లు పాల్గొంటున్న ఈ మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించాడు అజిత్‌. ఇందులో భాగంగా అఇత్‌ రనౌట్ నిర్ణయంపై రెండు ప్రాంతాలకు చెందిన ఆటగాళ్ల మధ్య వాగ్వాదం చెలరేగగా, ఇద్దరు అంపైర్లు దానిని మైదానంలోనే పరిష్కరించారు. 

అయితే, అంతా సద్దుమణిగింది అనుకుంటున్న తరుణంలో  26 ఏళ్ల కాంతా కిషోర్ (ప్రేక్షకుడు) ఆగ్రహానికి గురై అంపైర్లను, ఆటగాళ్లను దూషించడంతో పరిస్థితి హింసాత్మకంగా మారింది.  మ్యాచ్ ముగిసిన తర్వాత,  మాట్లాడుదాం రమ్మంటూ కిషోర్ సమీపంలోని ఒక ప్రదేశానికి అంపైర్లను పిలిపించాడు, అతని అభ్యర్థన మేరకు అజిత్ బాబు, చిరంజీవి, మరికొందరు స్నేహితులు అక్కడికి వెళ్లారు. వారు అక్కడికి వెళ్లగానే మరో సారి వాగ్వాదం చెలరేగింది.దీంతో కిషోర్ అకస్మాత్తుగా కత్తి తీసి ఇద్దరు అంపైర్లపై దాడి చేశాడు,సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మల్లేశ్వరరావు తెలిపారు. ఈ దాడిలో అజిత్ బాబు ఛాతీపై కత్తిపోటుకు గురై అక్కడికక్కడే కుప్పకూలి పోయాడు. పారిపోయే ప్రయత్నంలో చిరంజీవికి తీవ్ర రక్తస్రావ గాయాలయ్యాయని, జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించిన మరో వ్యక్తి కూడా గాయపడ్డాడని  పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: ఇద్దరు చిన్నారులను మింగేసిన రెడీ మేడ్‌ దోస పిండి

గాయపడిన అజిత్ బాబును VIMS ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అక్కడ డాక్టర్లు అందుబాటులో లేక పోవడంతో, అపోలో ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ వైద్యులు ఆయన మరణించినట్లు ప్రకటించారు. మ్యాచ్‌లో ఆటగాడు కూడా కాని వ్యక్తి పథకం ప్రకారమే ఈ దాడి చేశాడని బాధితుడి సోదరుడు ఆరోపించాడు. పొరుగు కాలనీలోని వినాయక్ నగర్ నివాసి అయిన కిషోర్, ఈ వివాదంలోకి చొరబడి, దుర్భాషలాడి, ఆ తర్వాత మద్యం మత్తులో తిరిగి వచ్చి హత్య చేశాడని అతను చెప్పాడు. ఆ రోజు ఉదయం గ్రామ పెద్దలు ఒకే ఒక్క పరుగు విషయంలో తలెత్తిన విభేదాన్ని ఇప్పటికే పరిష్కరించినా ఈ హత్యకు పూనుకున్నాడని అజిత్‌ సోదరుడు వాపోయాడు. కిషోర్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించినప్పటికీ తప్పించు కొని పారిపోయాడని అజిత్‌ సోదరుడు ఆరోపించాడు. మృతుడి తండ్రి డోలా అప్పల రాజు దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు కిషోర్‌పై హత్య కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement