ఇంఫాల్: మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్తకర వాతావరణం చోటుచేసుకుంది. రాష్ట్రంలో సరిహద్దు భద్రతా దళ అధికారి ఇంటిపై రాకెట్ లేదా మోర్టార్ దాడి జరిగినట్టు తెలిసింది. ఈ దాడిలో సదరు అధికారి సతీమణి తీవ్రంగా గాయపడగా.. ఇద్దరు చిన్నారులు మృతి చెందినట్టు సమాచారం. దీంతో మణిపూర్‌లో కొత్తగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మణిపూర్‌లో సరిహద్దు భద్రతా దళ అధికారి ఓయినం మాలెంగాన్బా బిష్ణుపూర్‌లోని కొండ-లోయ సరిహద్దు వెంబడి ఉన్న మోయిరాంగ్ గ్రామంలోని ట్రోంగ్లాబి అవాంగ్ లేకైలో నివాసం ఉంటున్నారు. కాగా, మంగళవారం తెల్లవారుజామున ఆయన ఇంటిపైకి ఓ రాకెట్ దూసుకొచ్చింది. పేలుడు సమయంలో అతడి భార్య 37 ఏళ్ల ఓయినం ఓంగ్బీ బినీతా, వారి ఇద్దరు పిల్లలు, ఐదేళ్ల బాలుడు, ఐదు నెలల పసికందు ఇంట్లోనే ఉన్నారు. ఈ పేలుడు వల్ల భవన నిర్మాణానికి తీవ్ర నష్టం వాటిల్లడంతో పాటు, ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఇంఫాల్‌లోని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఇద్దరు పిల్లలు మరణించారు. పేలుడులో శకలాల గాయాలైన బినీతా చికిత్స పొందుతున్నారు. రాకెట్ పడిన కొద్ది క్షణాలకే పెద్ద పేలుడు శబ్దం వినిపించిందని, దీంతో గ్రామం మొత్తం భయాందోళనలకు గురైందని స్థానికులు తెలిపారు.
కాగా, ట్రోంగ్లావోబి, చురాచంద్‌పూర్ జిల్లాలు కొండ ప్రాంతాలకు సమీపంలో ఉంది. సాయుధ బృందాలు చురుకుగా ఉన్నాయని భావిస్తున్న ప్రాంతాలకు దగ్గరగా ఉండటం వల్ల దీనిని సున్నితమైనదిగా పరిగణిస్తున్నారు. చుట్టుపక్కల కొండలలోని ఎత్తైన ప్రదేశాల నుండి గతంలో కూడా క్షిపణులను ప్రయోగించారని గ్రామస్తులు పేర్కొన్నారు. దీనిని బట్టి చూస్తే చాలా కిలోమీటర్ల దూరం నుండి దీర్ఘశ్రేణి ఆయుధాలను ఉపయోగించారని తెలుస్తోంది. ఈ దాడి లోయ జిల్లాల్లో ఉద్రిక్తతలను తీవ్రంగా పెంచింది. ఈ ఘటన అనంతరం, ఆగ్రహించిన స్థానికులు బిష్ణుపూర్ గుండా చురాచంద్‌పూర్ వైపు వెళుతున్న రెండు ఆయిల్ ట్యాంకర్లకు, ఒక ట్రక్కుకు నిప్పంటించినట్లు తెలిసింది.
Fresh violence rocked Manipur after a suspected militant rocket attack killed two children and injured their mother in Tronglaobi village of Bishnupur district early Tuesday.#TheSentinel #Violence #Manipur pic.twitter.com/UfdZME7bmk
— The Sentinel (@Sentinel_Assam) April 7, 2026
కొంతమంది నిరసనకారులు మోయిరాంగ్ పోలీస్ స్టేషన్ వద్ద కూడా గుమిగూడి, స్థానిక యంత్రాంగంపై ఒత్తిడి పెంచారు. దీంతో, భద్రతా దళాలు ఆ ప్రాంతంలో మోహరించి హై అలర్ట్ ప్రకటించాయి. బాధ్యులను పట్టుకోవడానికి సమీపంలోని కొండ ప్రాంతాల్లో గాలింపు చర్యలు, నిఘా ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే తోంగం శాంతి ఈ దాడిని ఖండించి, దీని వెనుక ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హింసకు పాల్పడవద్దని, శాంతియుతంగా ఉండాలని అధికారులు నివాసితులకు విజ్ఞప్తి చేశారు. క్రమంగా పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య పాఠశాలల మూసివేస్తున్నట్టు అధికారులు తెలిపారు.


