‍జరిగిన దానికి సిగ్గుపడుతున్నా.. కూర్చుని మాట్లాడుకోవాల్సింది | Director Vignesh Shivan Reacts Issue With Dhanush Latest | Sakshi
Sakshi News home page

Vignesh Shivan: ధనుష్‌లో నాన్నని చూసుకున్నా.. ఆయన తిన్నాకే తినేవాడిని

Apr 5 2026 7:08 PM | Updated on Apr 5 2026 7:08 PM

Director Vignesh Shivan Reacts Issue With Dhanush Latest

తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్, హీరో ధనుష్ ఒకప్పుడు కలిసి సినిమాలు తీశారు. కానీ ఇప్పుడు వీళ్ల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంత కోపం మాత్రమే ఉంది. దానికి కారణం నయనతార పెళ్లి డాక్యుమెంటరీ. ఇది రిలీజైన టైంలో జరిగిన హంగామా ఏంటనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నయన్‌తో పాటు ఈమె భర్త విఘ్నేశ్ శివన్.. ధనుష్‌ని టార్గెట్ చేస్తూ చాలా విమర్శలు చేశారు. ఇప్పుడు చాన్నాళ్లకు వాటిపై విఘ్నేశ్ శివన్ స్పందించాడు. ధనుష్‌తో స్నేహం చెడిపోవడం తన జీవితంలోనే అతిపెద్ద పశ్చాత్తాపం అని చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: యాప్ చెప్పిందని బ్రేకప్.. ఫన్నీగా LIK ట్రైలర్)

'ధనుష్ అంటే చాలా ఇష్టం. జూలై 28న ఆయన పుట్టినరోజు. అదేరోజు మా నాన్న చనిపోయారు. దీంతో ధనుష్‌లో నాన్నని చూసుకున్నాను. ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే, ఇలాంటి జీవితం గడుపుతున్నానంటే దానికి ముఖ్య కారణం ఆయనే. వీఐపీ (రఘువరన్ బీటెక్) సినిమా షూటింగ్ టైంలో రెండేళ్లు ఆయనతోనే ఉన్నాను. ఆయన తిన్న తర్వాతే తినేవాడిని. ఒకప్పుడు మా మధ్య అంత అనుబంధం ఉండేది. కాకపోతే ఇప్పుడు ఆ ఫ్రెండ్‌షిప్ లేదు. జరిగిన దానికి చాలా సిగ్గుపడుతున్నాను. ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా సమస్య ఉంటే కూర్చుని మాట్లాడుకుంటే సరిపోయేది. కానీ అలాంటిదేం జరగలేదు. దూరం ఎందుకు వచ్చిందో తెలియడం లేదు. ధనుష్‌తో స్నేహం కోల్పోవడం నా జీవితంలో పెద్ద పశ్చాత్తాపం' అని తాజా ఓ ఇంటర్వ్యూలో విఘ్నేశ్ శివన్ తన మనసులోని బాధని బయటపెట్టాడు.

అసలేంటి వివాదం?
విఘ్నేశ్ శివన్ తీసిన రెండో సినిమా 'నానుమ్ రౌడీ దాన్'కి ధనుష్ నిర్మాత. విజయ్ సేతుపతి, నయనతార ఇందులో హీరోహీరోయిన్లుగా నటించారు. తెలుగులోనూ నేను రౌడీనే' పేరుతో దీన్ని రిలీజ్ చేశారు. అయితే ఈ మూవీ షూటింగ్ టైంలో విఘ్నేశ్, నయనతార ప్రేమలో పడ్డారు. కొన్నేళ్ల పాటు ప్రేమించుకుని 2022లో పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమ, పెళ్లిని చూపిస్తూ 'నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్' పేరుతో ఓ డాక్యుమెంటరీని నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేశారు. అయితే ఈ డాక్యుమెంటరీ.. తన నిర్మించిన 'నానుమ్ రౌడీ దాన్' సీన్స్ ఉండటంపై ధనుష్ టీమ్ అభ్యంతరం వ్యక్తం చేసింది.

నిర్మాత అనుమతి లేకుండా సీన్స్ ఎలా ఉపయోగిస్తారని ప్రశ్నిస్తూ పిటిషన్ వేసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన నయనతార ఓ లెటర్ రిలీజ్ చేసింది. డాక్యుమెంటరీలో కేవలం మూడు సెకన్ల ఫుటేజీ ఉపయోగించినందుకు ధనుష్ ఏకంగా రూ.10 కోట్ల పరిహారం డిమాండ్ చేశాడని చెప్పుకొచ్చింది. ఇది ఎంతవరకు న్యాయం అని ప్రశ్నించింది. ఇది జరుగుతున్న టైంలో విఘ్నేష్ శివన్ కూడా ధనుష్‌ని విమర్శిస్తూ ఇన్ స్టాలో పలు పోస్టులు పెట్టాడు. తర్వాత వాటిని డిలీట్ చేశాడు. ఇది జరిగిన తర్వాత విఘ్నేశ్-ధనుష్ స్నేహం బ్రేక్ అయింది. ఇప్పుడు ఇన్నాళ్లకు అప్పటి సంగతులని గుర్తుచేసుకున్న విఘ్నేశ్.. పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు.

విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ సినిమా 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ'.. ఈ శుక్రవారమే(ఏప్రిల్ 10) థియేటర్లలోకి రానుంది. ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా నటించారు. నయనతార ఓ నిర్మాతగా వ్యవహరించింది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగానే ధనుష్‌తో వివాదం గురించి స్పందించాడు.

(ఇదీ చదవండి: తక్కువ టైంలో చాలామందిని కోల్పోయా.. భరించడం నా వల్ల కాలేదు: యాంకర్ రష్మి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement