ప్రోస్టేట్ కేన్సర్ రోగుల్లో సరికొత్త ఆశాకిరణం | Prostate Cancer, Know About Advanced Treatments Improving Survival And Life Quality, Read Full Details Inside | Sakshi
Sakshi News home page

Prostate Cancer: రోగుల్లో సరికొత్త ఆశాకిరణంగా ఆధునాత చికిత్సలు

Apr 6 2026 12:31 PM | Updated on Apr 6 2026 12:45 PM

Prostate Cancer: Advanced treatments Improving Survival and Life Quality

ఒక వ్యక్తికి ప్రోస్టేట్ కేన్సర్ వ్యాపించిందని చెప్పినప్పుడు, అతని మొదటి ప్రశ్న సాధారణంగా సమయం గురించి ఉంటుంది. “నేను ఇంకా ఎంతకాలం జీవిస్తాను?” అనేది. ఇన్నేళ్లుగా, అధునాతన ప్రోస్టేట్ కేన్సర్ చికిత్స ప్రధానంగా జీవన కాలాన్ని ఎంతవరకు పెంచగలదో అనే కోణంలో చర్చించలు జరిగాయి. కానీ ఇప్పుడు ఆ సంభాషణ విస్తరించింది, ఆశాజనకంగా మారింది. ఇప్పుడులక్ష్యం కేవలం జీవితం పొడిగించడం మాత్రమే కాదు, ఆ సమయంలో శక్తి, స్వతంత్రత, రోజువారీ జీవనవిధానాన్ని కాపాడడం కూడా.

భారతదేశంలో ప్రోస్టేట్ కేన్సర్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రతి ఏడాది దాదాపు 37,948 కొత్త కేసులు నమోదవుతున్నాయి. వీటిలో గణనీయమైన శాతం కేసులు అధునాతన దశలోనే గుర్తించబడుతున్నాయి, అంటే కేన్సర్ ఇప్పటికే శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించి ఉంటుంది. కాలక్రమేణా, చాలామందిలో “కాస్ట్రేషన్ రెసిస్టెంట్ ప్రోస్టేట్ కేన్సర్” అభివృద్ధి చెందుతుంది, అంటే సాధారణ హార్మోన్ చికిత్సకు స్పందించకుండా వ్యాధి ముందుకు సాగుతుంది.

ప్రోస్టేట్ కేన్సర్ ఎలా పెరుగుతుందో అర్థం చేసుకోవడం ముఖ్యం. ఈ కేన్సర్ కణాలు ప్రధానంగా టెస్టోస్టెరోన్ అనే పురుష హార్మోన్‌పై ఆధారపడి పెరుగుతాయి. అందుకే, ఆండ్రోజెన్ డిప్రైవేషన్ థెరపీ (ADT) — అంటే శరీరంలో టెస్టోస్టెరోన్ స్థాయిని తగ్గించే చికిత్స — ఇప్పటివరకు ప్రధాన చికిత్సగా ఉపయోగించబడింది. ఇది కేన్సర్ పెరుగుదలను నెమ్మదింపజేస్తుంది, లక్షణాలను నియంత్రిస్తుంది.

అయితే, కొన్ని సందర్భాల్లో టెస్టోస్టెరోన్ స్థాయులు తగ్గినా కూడా కేన్సర్ కణాలు “ఆండ్రోజెన్ రిసెప్టర్
పాథ్‌వే”ను సక్రియం చేసి పెరుగుతూనే ఉంటాయి. ఆండ్రోజెన్ రిసెప్టర్ అనేది కణంలో ఉండే ఒక ప్రోటీన్, ఇది హార్మోన్ సంకేతాలను స్వీకరించి కణానికి పెరగమని సూచిస్తుంది. ఈ పరిస్థితిలో వ్యాధి కొనసాగితే దాన్ని కాస్ట్రేషన్ రెసిస్టెంట్ ప్రోస్టేట్ కేన్సర్ అంటారు.

గత దశాబ్దంలో చికిత్సలో కీలకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. కేవలం హార్మోన్ స్థాయులను
తగ్గించడం కాకుండా, ఇప్పుడు “ఆండ్రోజెన్ రిసెప్టర్ పాథ్‌వే ఇన్హిబిటర్స్” అనే కొత్త ఔషధాలు ఉపయోగిస్తున్నారు. ఇవి కేన్సర్ కణాల్లో జరిగే పెరుగుదల సంకేతాలను నేరుగా అడ్డుకుంటాయి. ఇవి
ADT తో కలిపి ఉపయోగించినప్పుడు మరింత ప్రభావవంతంగా పనిచేస్తాయి. మెటాస్టాటిక్ హార్మోన్ సెన్సిటివ్ ప్రోస్టేట్ కేన్సర్ పై నిర్వహించిన క్లినికల్ అధ్యయనాలు చూపుతున్నాయి.

ఈ రెండు చికిత్సల కలయిక వ్యాధి పురోగతిని గణనీయంగా ఆలస్యం చేస్తుంది. అంతేకాకుండా, కాస్ట్రేషన్ రెసిస్టెంట్ దశకు చేరే సమయాన్ని కూడా వాయిదా వేస్తుంది. ముఖ్యంగా ఎముకలకు వ్యాపించినప్పుడు వచ్చే నొప్పి కూడా ఆలస్యంగా వస్తుంది.

ఇవి చాలా ముఖ్యమైన ఫలితాలు. ఎందుకంటే వ్యాధి పురోగతిని ఆలస్యం చేయడం అంటే లక్షణాలను నియంత్రిస్తూ, రోజువారీ జీవనాన్ని సజావుగా కొనసాగించే సమయం ఎక్కువగా లభించడం. చాలామందికి ఇది చలనశీలతను కాపాడుకోవడం, కుటుంబంతో సమయం గడపడం, సాధారణ కార్యకలాపాలను కొనసాగించడం వంటి ప్రయోజనాలను అందిస్తుంది.

ఈ కొత్త చికిత్సల మరొక ముఖ్యమైన అంశం వాటి సహన శక్తి (tolerability). అధునాతన కేన్సర్
చికిత్సలో తరచుగా కనిపించే అలసట వంటి సమస్యలు తక్కువగా ఉంటాయి. వృద్ధాప్యంలో ఉన్న రోగులకు, ముఖ్యంగా డయాబెటిస్ లేదా గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి, ఈ సమతుల్యత చాలా ముఖ్యం. కెమోథెరపీ అవసరం లేకుండా మంచి ఫలితాలను ఇస్తున్న ఈ కలయిక చికిత్సలు, తీవ్రమైన చికిత్సలకు అనుకూలం కానీ రోగులకు ఒక మంచి ప్రత్యామ్నాయం.

భారతదేశం గ్లోబల్ క్లినికల్ రీసెర్చ్‌లో పాల్గొనడం కూడా పెరుగుతోంది. అంతర్జాతీయ పరిశోధనల్లో భారతీయ రోగుల భాగస్వామ్యం, చికిత్సల ప్రభావాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడంలో సహాయపడుతోంది. ప్రాక్టీస్‌లో ఆధారిత చికిత్సలను అమలు చేయడానికి దోహదం చేస్తోంది.

అధునాతన ప్రోస్టేట్ కేన్సర్ ఒక తీవ్రమైన నిర్ధారణ అయినప్పటికీ, ఇప్పుడు దీనిని ఒక దీర్ఘకాలిక వ్యాధిగా నిర్వహిస్తున్నారు. ఈరోజు చికిత్స లక్ష్యం—రోజువారీ జీవనంపై కనిష్ట ప్రభావంతో వ్యాధిని నియంత్రించడం. ఈ వ్యాధిని ఎదుర్కొంటున్న పురుషులు, వారి కుటుంబాల కోసం, వైద్యుడితో సమాచార ఆధారిత, ముందస్తు చర్చ చాలా ముఖ్యమైనది. 

అందుబాటులో ఉన్న చికిత్సలను అర్థం చేసుకోవడంద్వారా, వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా చికిత్సను రూపొందించుకోవచ్చు. చికిత్స క్లినికల్ ఆధారాలతో పాటు వ్యక్తిగత లక్ష్యాలకు అనుసంధానమైనప్పుడు, జీవితం కేవలం పొడిగించడమే కాకుండా, దాన్ని మెరుగైన విధంగా గడపడం కూడా సాధ్యమవుతుంది.

డాక్టర్‌ పాలంకి సత్య దత్తాత్రేయ, సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్
రెనోవా సౌమ్య కేన్సర్ సెంటర్, కర్కాణా, హైదరాబాద్

(చదవండి: ఈ తాత అందరికీ స్ఫూర్తి..! 90 ఏళ్ల వయసులో అంత ఫిట్‌గానా..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement