సాక్షి, చైన్నె: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం సోమవారంతో ముగిసింది. సుమారు 5 వేలకు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజున ఎడప్పాడిలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి పలువురు కీలక నేతలు నామినేషన్‌లు సమర్పించారు. అయితే, పళనిస్వామి నామినేషన్ అఫిడవిట్‌పై చర్చ మొదలైంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ మాజీ సీఎం పళనిస్వామి నామినేషన్ చర్చనీయాంశంగా మారింది. ఆయన తన కుటుంబానికి రూ.8.99 కోట్ల ఆస్తులున్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అలాగే, తనకు చరాస్తులు రూ.50.86 లక్షలు ఉన్నాయని.. ఇల్లు, ఇంటి స్థలం, వ్యవసాయ భూమి, వంటి స్థిరాస్తులేవని చెప్పారు. తనకుగానీ, తన కుటుంబానికి గానీ ఎలాంటి వాహనాల్లేవని వెల్లడించారు. ఆయన సతీమణి రాధకు స్థిర, చరాస్థులు కలిపి రూ.5.61 కోట్లు ఉన్నట్లు, ఉమ్మడి కుటుంబం పేరుమీద మరో రూ.2.87 కోట్ల ఆస్తి ఉన్నట్లు పళనిస్వామి చెప్పారు. దీంతో, ఆయన అఫిడవిట్ చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియా వేదికగా పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. ఆయన అబద్దం చెబుతున్నారని ఆరోపిస్తున్నారు.
ముగిసిన నామినేషన్ల పర్వం
మార్చి 15న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకాగా, 30వ తేది నుంచి నామినేషన్లు స్వీకరించారు. ఇందులో మూడు రోజులు సెలవు దినాలు వచ్చాయి. ఎట్టకేలకు సోమవారం సాయంత్రం మూడు గంటలతో నామినేషన్లు ముగిశాయి. మంగళవారం పరిశీలన జరుగుతోంది. ఉప సంహరణ తర్వాత ఈనెల 9వ తేదీన తుది జాబితాను ప్రకటించనున్నారు. సమాచారం మేరకు రాష్ట్రంలో 5072 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో పురుషులు 4097, మహిళలు 974, ఇతరులు ఒకరు ఉన్నారు.


