కేరళలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార హోరు తారస్థాయికి చేరింది. పాలక ఎల్డీఎఫ్, విపక్ష యూడీఎఫ్ కూటములు పోటాపోటీ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. బీజేపీ కూడా ఈసారి రాష్ట్రంలో గట్టిగా ఉనికి చాటుకోవాలని కృతనిశ్చయంతో ఉంది. ఈ క్రమంలో ఎన్డీయేలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఎన్నికలకు సంబంధించిన కీలక సమావేశంలో ఎన్డీయే అభ్యర్థి ఒకరు అసహనం వ్యక్తం చేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తిరువనంతపురంలోని మాస్కాట్ హోటల్‌లో ఎన్డీయే కూటమి ఎన్నికల కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో ఎన్డీయే కూటమి అభ్యర్థులు, స్థానిక బీజేపీ నేతలు పాల్గొన్నారు. సమావేశంలో కేంద్రమంత్రి జైశంకర్ ప్రసంగిస్తున్న సమయంలో అక్కడ హైడ్రామా చోటుచేసుకుంది. జైశంకర్ కేవలం.. రాజీవ్ చంద్రశేఖర్ అభ్యర్థిత్వాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఆయన విజయాన్ని ఖాయం చేయాలని ఓటర్లను కోరారు. అయితే, ఆయన ప్రసంగంలో వట్టియూర్కావు నియోజకవర్గం కూటమి అభ్యర్థి ఆర్. శ్రీలేఖ పేరును ప్రస్తావించకపోవడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అవమానంగా భావించారు.
దీంతో, కూటమి అభ్యర్థి శ్రీలేఖ నిరసనగా వాకౌట్ చేయడంతో హై డ్రామా చోటుచేసుకుంది. అంతేకాకుండా ప్రారంభోపన్యాసంలో శ్రీలేఖ పేరును గానీ, ఆమె నియోజకవర్గాన్ని గానీ ప్రస్తావించలేదని తెలిసింది. ఈ క్రమంలో అసంతృప్తితో ఉన్న శ్రీలేఖ ఎన్డీయే నేతలను ప్రశ్నిస్తూ ఆ ప్రాంగణం నుండి నిష్క్రమించారు. ప్రచారం చివరి, కీలక దశలోకి ప్రవేశిస్తున్న తరుణంలో ఆమె అలా వెళ్లిపోవడం స్థానిక నాయకత్వాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఇంతలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ నాయకులు వేగంగా జోక్యం చేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఎస్. ఓమన, వి.వి. రాజేష్ సహా రాష్ట్ర నాయకులు, శ్రీలేఖ సమస్యలను పరిష్కరించడానికి ఆమెతో చర్చలు జరిపారు. వారు నచ్చజెప్పిన తర్వాత, ఆమె తిరిగి హోటల్‌కు చేరుకుని కార్యక్రమాలలో పాల్గొన్నారు.
Heartwarming news coming out of Kerala:
> S. Jaishankar was in Vattiyoorkavu to campaign for R. Sreelekha.
> During his speech, Jaishankar mentioned Rajiv Chandrashekhar, who's fighting from another constituency.
> But he forgot to mention Sreelekha. She left the stage in… pic.twitter.com/IpMe1ulQCr— Jawaharlal Nehru (@PMNehru) April 6, 2026
ఇదిలా ఉండగా.. ఆర్. శ్రీలేఖ వట్టియూర్కావు నియోజకవర్గానికి ఎన్డీఏ అభ్యర్థి. ఆమె కేరళలో తొలి మహిళా ఐపీఎస్ అధికారి, అలాగే రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ (DGP) పదవిని చేపట్టిన మొదటి మహిళ. రిటైర్మెంట్ తర్వాత బీజేపీలో చేరి, స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి విజయాలు సాధించారు. ప్రస్తుతం ఆమె వట్టియూర్కావు నుంచి పోటీ చేస్తున్నారు. అయితే, తరచూ వివాదాల్లో నిలవడం ఆమె ప్రచారానికి సవాలుగా మారుతోంది.


