పెళ్లికి ముందు సూది మందు | Men, women Interest in special injections for easy weight loss Before wedding | Sakshi
Sakshi News home page

పెళ్లికి ముందు సూది మందు

Apr 5 2026 2:18 AM | Updated on Apr 5 2026 11:34 AM

Men, women Interest in special injections for easy weight loss Before wedding

సులభంగా బరువు తగ్గేందుకు ప్రత్యేక ఇంజెక్షన్లపై ఆసక్తి 

దేశంలో యువతీ యువకుల్లో పెరిగిన వినియోగం 

ఢిల్లీలో ‘మౌంజారో వధువు’ప్యాకేజీని తెచ్చిన ఓ క్లినిక్‌..  

దీనికోసం ప్రీవెడ్డింగ్‌ ప్యాకేజీలు తెచ్చిన మరికొన్ని క్లినిక్‌లు 

ఓవర్‌ ద కౌంటర్‌ డ్రగ్‌గా విక్రయాలతో ప్రమాదమంటున్న నిపుణులు

సాక్షి, హైదరాబాద్‌: పెళ్లికి ముందు బరువు తగ్గే సులభమైన మార్గాల వెతుకులాటలో యువతీ యువకులు నిమగ్నమవుతున్నారు. వెయిట్‌లాస్‌కు సంబంధించిన ప్రత్యేక ఇంజెక్షన్లు, మందులపై ఆసక్తి చూపుతున్నారు. దీంతో భారత్‌లో వీటి వినియోగం వేలంవెర్రిగా పెరిగిపోతోంది. పెళ్లికి ముందు వ్యాయామం, ఆహార నియమాలతో ఆశించిన ఫలితాలు రాలేదంటూ సడన్‌గా బరు వు తగ్గేందుకు ‘మౌంజారో’(టిర్జెపాటైడ్‌) ఇంజెక్షన్‌ తీసుకోవడం ఇటీవల పెళ్లీడు యువతలో బాగా పెరిగింది. పెళ్లి రోజు న నాజూగ్గా, అందంగా కనిపించాలనే తాపత్రయం కారణంగా భారత్‌లో ఇదొక కొత్త ట్రెండ్‌గా మారింది. ఇది ఎక్కడివరకు వెళ్లిందంటే... ఢిల్లీలోని ఓ క్లినిక్‌ ఏకంగా ‘మౌంజారో బ్రైడ్‌’పేరిట ఓ ప్రత్యే క ప్యాకేజీని ప్రకటించింది. మరికొన్ని క్లినిక్‌లు.. చర్మ, కేశాలంకరణతోపాటు ఈ ఇంజెక్షన్లను ప్రీ–వెడ్డింగ్‌ ప్యాకేజీల్లో చేర్చే వరకు పరిస్థితి ఏర్పడింది. మనదేశంలో మధుమేహం, బరువు తగ్గుదల కోసం అను మతి పొందిన తొలి జీఎల్‌పీ–1 మందు ‘మౌంజారో. దీన్ని ఎలి లిల్లీ సంస్థ ఉత్పత్తి చేసి విక్రయిస్తోంది. దీని పోటీ దారు నోవో నార్‌డిస్క్‌ తయారుచేసిన ‘వెగోవీ’కూడా అందుబాటులోకి వచ్చింది. 

శారీరక రూపానికి ప్రాధాన్యంతో... 
భారత్‌లో సంప్రదాయ వివాహాల్లో వధువు, వరుడి శారీరక రూపం, ఆర్థిక స్థితికి సంబంధించి అధిక ప్రాధాన్యతను కలిగి ఉంటున్నాయి. పెళ్లిలో ఒక నిర్దిష్ట పద్ధతిలో కనిపించాలనే సామాజిక ఒత్తిడి దీనికి కారణం. గతేడాది భారత్‌లో ఈ రెండు సంస్థలు తమ ఊబకాయ నివారణ మందులను విడుదల చేయగా, కొన్ని నెలల్లోనే మౌంజారో అమ్మకాలు రెట్టింపయ్యాయి. ఈ మందులోని క్రియాశీల పదార్ధమైన సెమాగ్లుటైడ్‌ పేటెంట్‌ గడువు ముగియడంతో, భారతీయ ఔషధ తయారీదారులు ఇటీవల నోవో మందు చౌక వెర్షన్ల విక్రయాలు ప్రారంభించి, దాని లభ్యతను విస్తృతం చేశారు. ఈ మందులు ఊబకాయం ఉన్నవారిగా వర్గీకరించిన పెద్దలు లేదా మధుమేహం, అధిక రక్తపోటు లేదా స్లీప్‌ అప్నియా వంటి బరువు సంబంధిత వైద్య పరిస్థితితో అధిక బరువు ఉన్నవారి కోసం ఉద్దేశించినవిగా ఉన్నాయి. భారత్‌లో మౌంజారో ఇంజెక్షన్‌ పెన్‌ అత్యల్ప డోస్‌ ధర నెలకు రూ.13,125, గరిష్ట డోస్‌ ధర రూ. 25,781గా ఉంది. వెగోవీ అత్యల్ప డోస్‌ను నెలకు రూ.5,660, గరిష్ట డోస్‌ను రూ.16,400కి విక్రయిస్తున్నారు.  

ఇమ్యునో డిప్రెషన్‌ బారిన పడే ప్రమాదం 
ఎలాంటి వెయిట్‌లాస్‌ చికిత్స అయినా మెటబాలిక్‌ సిండ్రోమ్‌తో సడన్‌గా బరువు తగ్గితే రోగ నిర్ధారణ శక్తికి నష్టం జరుగుతుంది. అందువల్ల వైద్యుడిని సంప్రదించకుండా ‘ఓవర్‌ ద కౌంటర్‌’గా ఈ మందులు తీసుకోవడం అత్యంత ప్రమాదకరం. ఈ ఇంజెక్షన్లను మెడిసిన్‌గా వాడాలే తప్ప జ్వరం, ఒళ్లు నొప్పులకు క్రోసిన్‌ టాబ్లెట్‌గా వాడకూడదు. ఈ మందులతో సడన్‌గా బరువు తగ్గితే తీవ్రమైన ఇమ్యునో డిప్రెషన్‌తో క్షయ, ఇతర ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదముంది. సడన్‌ వెయిట్‌లాస్‌తో యాంగ్జయిటీ ట్రమెర్స్, తీవ్రమైన వెన్నునొప్పుల బారిన కూడా పడే అవకాశాలున్నాయి. ఈ బరువు తగ్గుదల మందులు కూడా శాశ్వత పరిష్కారంకాదు. ఈ ఇంజెక్షన్లను తీసుకోవడం ఆపేస్తే వెంటనే బరువు పెరుగుతారు. సాధారణంగా అయితే 6 నెలల నుంచి ఏడాది వరకు ఈ మందులను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ మెడిసిన్‌ మార్కెట్లోకి వచ్చి ఏడాదే అవుతోంది. అందువల్ల వీటి దీర్ఘకాల ప్రభావాలు, దు్రష్పభావాలు ఏమిటనేది ఇంకా పూర్తిస్థాయిలో తెలియడం లేదు. తగిన డైట్, వ్యాయామానికి ఇది ప్రత్యామ్నాయం కాదని గుర్తించాలి. 
–డా. బూర నర్సయ్యగౌడ్, బేరియాట్రిక్‌ సర్జన్‌   

Advertisement
 
Advertisement
Advertisement