పాకిస్తాన్‌కు వార్నింగ్‌.. అభిషేక్‌ బెనర్జీ సంచలన వ్యాఖ్యలు | Abhishek Banerjee Responds On Pak Kolkata Threat Comments | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌కు వార్నింగ్‌.. అభిషేక్‌ బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

Apr 7 2026 7:32 AM | Updated on Apr 7 2026 8:37 AM

Abhishek Banerjee Responds On Pak Kolkata Threat Comments

కోల్‌కత్తా: బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం హీటెక్కింది. పాకిస్తాన్‌ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ వ్యాఖ్యలకు తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ బెనర్జీ స్ట్రాంగ్‌ కౌంటరిచ్చారు. తామే పాకిస్తాన్‌లోని వారి ఇళ్లలోకి చొరబడి చంపేస్తామని హెచ్చరించారు. దీంతో, బెంగాల్‌ రాజకీయంలో మరింత చర్చకు దారి తీసింది.

తృణముల్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ సోమవారం బెంగాల్‌లోని సిలిగురిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోల్‌కతాపై పాకిస్తాన్‌ ఇటీవల చేసిన హెచ్చరికకు కేంద్రం స్పందించిన తీరుపై విమర్శలు గుప్పించారు. అనంతరం, ఆయన మాట్లాడుతూ.. ‘భారత్-పాకిస్తాన్ మధ్య భవిష్యత్తులో ఘర్షణలు తలెత్తితే కోల్‌కతా లక్ష్యం కావచ్చని పాకిస్తాన్‌ నాయకుడు ఒకరు మాట్లాడారు. కోల్‌కతాను పేల్చివేస్తామని ఖవాజా ఆసిఫ్ అన్నారు. మన ప్రధానమంత్రి, హోం మంత్రి, రక్షణ మంత్రి.. ఆయన వ్యాఖ్యలకు మౌనంగా ఉండిపోయారు. కానీ, నేను మాత్రం ఊరుకోను. నేను నా జాబితాలో ఖవాజా ఆసిఫ్ పేరు రాసుకున్నాను. మమతా బెనర్జీ, ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రోజు.. మేము వారి ఇళ్లలోకి చొరబడి వారిని చంపుతాము’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.  

అలాగే, అతను పాకిస్తాన్‌లో కూర్చుని కోల్‌కతాపై దాడి చేస్తామని బెదిరిస్తున్నాడు. దీనిపై అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ మౌనంగా ఉన్నారు. బెంగాల్‌ విషయంలో మాత్రం అమిత్‌ షా మమ్మల్ని టార్గెట్‌ చేస్తున్నారు. ఆయన ప్రతీరోజు మమ్మల్ని బంగ్లాదేశీయులు, పాకిస్తానీయులు అని పిలుస్తారు. కానీ, పాకిస్తాన్ కోల్‌కతాను బెదిరించినప్పుడు మాత్రం ఆయన మూగ ప్రేక్షకుడుగా మారిపోతారు. ప్రధాని మోదీ కూడా బెంగాల్‌లో టీఎంసీని ఓడించాలని ఎన్నికల ప్రచారంలో చెబుతున్నారు. కానీ, పాకిస్తాన్‌ వ్యాఖ్యలపై ఆయన కూడా స్పందించరు అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు. ఆయన వ్యాఖ్యలతో బెంగాల్‌లో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. 

ఇక, అంతకుముందు.. భారత్‌ను ఉద్దేశించి పాక్‌ రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ మరోసారి ప్రేలాపనలు చేశారు. భవిష్యత్తులో భారత్ ఏదైనా దాడులకు పాల్పడితే.. కోల్‌కతానూ లక్ష్యంగా చేసుకుంటామన్నారు. ప్రతిదాడులను ఆ ప్రాంతం వరకూ తీసుకెళ్తామంటూ వ్యాఖ్యానించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి.  

Advertisement
 
Advertisement
Advertisement