మెయిన్ రోడ్‌కాకుండా షార్ట్ కట్‌లో వెళ్లాలనే నిర్ణయం కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రధాన రహదారిలోంచి కాకుండా, వేరే రూట్‌లో వెళితే తొందరగా ఇంటికి చేరుకోవచ్చని భావించారు. కానీ అదే మృత్యువుకు షార్ట్‌కట్ అవుతుందని అస్సలు ఊహించలేదు.
నాసిక్ జిల్లాలోని దిండోరి తహసీల్‌లో శుక్రవారం అర్ధరాత్రి, కారు బావిలో పడిపోవడంతో, ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు పిల్లలతో సహా తొమ్మిది మంది సభ్యులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘోర విషాదం తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. వివరాలు ఇలా ఉన్నాయి.
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పెద్దలు, ఆరుగురు పిల్లలతో కలిసి ఒకే కారులో దిండోరిలో ఒక కోచింగ్ సెంటర్ నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ తరువాత వీరంతా సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ గ్రామానికి బయలుదేరారు. షార్ట్‌కట్‌లో వెళ్లాలని కారు నడుపుతున్న సునీల్ నిర్ణయించుకున్నాడు. ఇదే ఘోర తప్పిదంగా మారిపోయింది.
నివేదికల ప్రకారం వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు రోడ్డు పక్కన ఉన్న బావి గోడను ఢీకొట్టి అందులోకి దూసుకు పోయింది. బావిలో 40 అడుగుల లోతు వరకు నీరు ఉంది. కారు బావిలో పడిపోయిన శబ్దం విన్న స్థానికులు అగ్నిమాపక దళానికి ఫోన్ చేశారు. నివాసితులు సహాయక చర్యలకు ప్రయత్నించి నప్పటికీ, చీకటి బావి లోతు వారికి చాలెంజ్‌గా మారింది. అగ్నిమాపక సిబ్బంది లైట్లను ఉపయోగించి వాహనాన్ని గుర్తించారు. తాళ్ల సాయంతో కారును బావి నుండి బయటకు లాగారు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది. కారులో ఉన్నవారందరూ కన్నుమూశారు.
మృతులలో సునీల్ దర్గుడే (32), అతని భార్య రేష్మా (27), కుమార్తె గుణవంతి (11), సునీల్ వదిన ఆశా (32), ఆమె పిల్లలు శ్రేయాష్ (11), శ్రావణి (11), శ్రద్ధ (13), సృష్టి (14), మరో బంధువు సమృద్ధి (7) ఉన్నారు.

ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. బాధితులలో ఒకరైన సునీల్ దర్గుడేపై అజాగ్రత్తగా డ్రైవింగ్ చేసినందుకు అభియోగాలు మోపగా, బావి యజమాని రాజేంద్ర రాజేపై నిర్లక్ష్యం కేసు పెట్టారు.
ఇదీ చదవండి: రనౌట్ వివాదం : అంపైర్‌ను పొడిచి చంపేశాడు
రహదారికి ఇంత దగ్గరగా ఉన్న రాకాసిలా నోరుతెచుకుని ఉన్న అంత పెద్ద బావిని నిర్లక్ష్యంగా ఎందుకు వదిలేశారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ బావిని చాలా ఏళ్ల క్రితం నిర్మించారు, కానీ బావిని మూసివేయలేదు. ఈ విషయంపై పౌర అధికారులు, బావి యజమాని మధ్య వివాదం నడుస్తోంది. ఈ విషాద ఘటనం తరువాత ఈ బావిని పూడ్చివేసే పనులను స్థానిక అధికారులు మొదలు పెట్టారు.
ఇదీ చదవండి: ఇద్దరు చిన్నారులను మింగేసిన రెడీ మేడ్ దోస పిండి


