చిన్న విస్తరిలో ఎక్కువ.. పెద్ద అరిటాకులో తక్కువ! ఇదెలా సాధ్యం? | Fox Tiger Food Portion Size Psychology Story | Sakshi
Sakshi News home page

చిన్న విస్తరిలో ఎక్కువ.. పెద్ద అరిటాకులో తక్కువ! ఇదెలా సాధ్యం?

Nov 22 2026 5:26 AM | Updated on Nov 22 2026 5:26 AM

Fox Tiger Food Portion Size Psychology Story

ఫండే

పిల్లల కథ

ఒక అడవిలో నక్క, తన బుజ్జి నక్కతో కలిసి కొత్తగా భోజనశాల తెరిచింది.
ప్రారంభోత్సవానికి మిగిలిన జంతువులతో పాటు మృగరాజు సింహం కూడా వచ్చి, విస్తరాకులో గుమ్మడి డిప్పనిండా తెచ్చిన చేపల పులుసు భోజనం చేసి తృప్తి చెందాడు. ఖరీదైన కానుకలు ఇచ్చి అభినందించాడు. దాంతో నక్క చేసే చేపల పులుసు గురించి పక్క అడవికి కూడా పాకింది.

తన భోజనశాలకు వచ్చిన అతిథుల నుంచి పైకం తీసుకొని, మోదుగు ఆకులతో చేసిన చిన్న విస్తరి వేసేది. ఒక గుమ్మడికాయ డిప్ప నిండా చేపల పులుసు తీసుకువచ్చి, వేడివేడిగా భోజనం వడ్డించేది.  
అతిథులు రుచికరమైన చేపల పులుసుతో భోజనం చేసి, తృప్తిగా కడుపు నిమురుకుంటూ వెళ్లేవి. ఎప్పుడైనా నక్క పక్క అడవికి పోయినప్పుడు బుజ్జి నక్కే భోజనశాల చూసుకునేది.

ఒకసారి పక్క అడవి పులి రాజు అటుగా పోతూ నక్క భోజనశాల వద్ద ఆగాడు. సమయానికి నక్క భోజనశాలలో లేదు. ఆరోజు తన చెల్లెలిని చూడటానికి పక్క అడవికి పోయింది నక్క. 
పులి రాజు రాకను చూసిన బుజ్జి నక్క పులికి ఎదురు వెళ్లి, లోనికి ఆహ్వానించింది. 
బుజ్జి నక్క గుమ్మడి డిప్పనిండా చేపల పులుసు తీసుకువచ్చి వేడివేడిగా పులి రాజుకు భోజనం వడ్డించింది. 
పులి రాజు పైసలు ఇచ్చి అసంతృప్తిగా అక్కడినుంచి తన అడవికి బయలుదేరాడు. దారిలో పులి రాజును చూసిన నక్క, ‘రాజా! మా చెల్లికి ఆరోగ్యం బాగా లేదని తెలిసి మీ అడవికి వెళ్లి వస్తున్నాను. మా భోజనశాలలో చేపల పులుసు ఆరగించారా!?’ ఆశగా అడిగింది నక్క.

‘పులుసు కమ్మగానే ఉంది కానీ, కొంచమే వడ్డించడం వలన కడుపునిండ లేదు!’ నిరాశగా చెబుతూ ముందుకు కదిలాడు పులి రాజు. 
నక్క పరుగు పరుగున భోజనశాలకు చేరింది. బుజ్జి నక్కని పిలిచి వాకబు చేసింది. ‘అందరికీ వడ్డించినట్లే పులి రాజు ఇచ్చిన పైసలు తీసుకొని గుమ్మడి డిప్పనిండా చేపల పులుసుతో వేడివేడిగా వడ్డించాను. పైగా పులి రాజు వచ్చాడని అందరికీ వేసినట్లు చిన్న విస్తరి వేయకుండా, పెద్ద అరిటాకును ప్రత్యేకంగా తెప్పించి అందులో వడ్డించాను!’ అంది బుజ్జి నక్క. 
దాంతో చేసిన పొరపాటు గ్రహించింది నక్క.

మరోసారి పులి రాజు వచ్చినప్పుడు నక్క మోదుగు ఆకు విస్తరిపరిచి, గుమ్మడి డిప్పనిండా చేపల పులుసు తెచ్చి కొద్దిగా వడ్డించింది. మిగతాది కొసరి కొసరి వడ్డించింది. దాంతో పులి రాజు తృప్తిగా భోజనం చేసి అక్కడి నుంచి ఆనందంగా కదిలాడు. 
ఒకే పరిమాణంలో ఉన్న పదార్థం చిన్నా, పెద్ద ఆకులలో వడ్డించటం వలన కలిగే దృష్టి కోణం వేరుగా ఉంటుందని, అందుకే అరిటాకులో అదే పరిమాణంలో ఉన్న భోజనం కొంచంగా పులి రాజుకు కనిపించిందని గ్రహించింది బుజ్జి నక్క.
- పైడిమర్రి రామకృష్ణ

అసంవిభాగీ దుష్టాత్మా కృతఘ్నో నిరపత్రపః
తాదృగ్నరాధిపో లోకే వర్జనీయో నరాధిప
ఇవ్వవలసిన వాళ్లకు ఇవ్వనివాడు, దుష్టబుద్ధి, కృతజ్ఞత లేనివాడు, సిగ్గులేనివాడు అయిన రాజును పరిత్యజించాలి.

ఇదీ చదవండి: పుచ్చిపోయిన పళ్లు మళ్లీ పెరుగుతాయా? శాస్త్రవేత్తల కొత్త ప్రయోగం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement