దైవ శిక్ష నుంచి ఎవరూ తప్పించుకోలేరా? | Sagara 60-Thousand Sons Kapila Muni Vishnu Purana | Sakshi
Sakshi News home page

దైవ శిక్ష నుంచి ఎవరూ తప్పించుకోలేరా?

Oct 5 2026 7:56 AM | Updated on Oct 5 2026 7:56 AM

Sagara 60-Thousand Sons Kapila Muni Vishnu Purana

షట్చక్రవర్తులలో ఒకడైన సగరుడు సంతానం కోసం ఔర్వుడనే మునిని, తన ఇరువురు భార్యలతో కలిసి భక్తిశ్రద్ధలతో పూజించాడు. వంశవర్ధనుడైన ఒక్క పుత్రుడిని గాని, లేక లెక్కకు మిక్కుటంగా అరవై వేలమంది సంతానాన్ని గాని వరంగా ఇస్తాను, కోరుకోమన్నాడు ఔర్వుడు. మొదటి భార్యయైన సుకేశి కులదీపకుడైన ఒక్క పుత్రుడు చాలని కోరింది. రెండవ భార్య సుమతి అరవై వేలమంది సంతానాన్ని కోరింది. అలాగే ఇచ్చాడు ముని.

సుకేశికి అసమంజసుడనే పుత్రుడు కలిగాడు. సుమతికి అరవై వేలమంది పుత్రులు కలిగారు. పెరిగి పెద్దవాడైన అసమంజసునికి అంశుమంతుడనే పుత్రుడు కలిగాడు. సగరుని మిగతా అరవైవేల మంది సంతానం అంతా పాపకర్ములై దుష్కార్యములు చేస్తున్నారు.  దేవతలు సగరుడి సుతుల ఆగడాలను అరికట్టే ఉపాయం కోసం కపిల మహాముని వద్దకు వెళ్ళి శరణు వేడారు. అప్పుడు కపిలుడు సూచన ప్రాయంగా సగరపుత్రులకు భవిష్యత్తులో జరగబోయేది చెప్పాడు.

తే. పాపకర్ములై యొరుల కుపద్రవములు
   సేయువారల దైవంబు చెఱుచు గాన
   వారినెవ్వరు జెఱుపంగవలదు దమకు
   హానివృద్ధులు పాపపుణ్యముల గలుగు

పాపకర్మలు చేయడంలో ఆసక్తి కలిగినవారై, ఇతరులకు హానికలిగించే వ్యక్తులను దైవమే తగురీతిన శిక్షిస్తాడు. కాబట్టి అటువంటి వాళ్ళకు బుద్ధిచెప్పి బాగుచేయాలనే ఆలోచన చేసి భంగపడటం వివేకంతో కూడుకున్న పని అనిపించుకోదు. ఒక వ్యక్తికి జీవితంలో వృద్ధి, క్షయాలనేవి వారు చేసే పుణ్య, పాపకర్మలపై ఆధారపడి ఉంటాయే కాని మరొక విధంగా కాదు అని కపిలమహాముని దేవతలకు చెప్పాడు.

ఆ రీతినే, తండ్రి తలపెట్టిన అశ్వమేథ యాగానికి చెందిన యాగాశ్వాన్ని కపిలమహాముని ఆశ్రమంలో చూసిన సగరపుత్రులు, ముందు వెనుక ఆలోచించకుండా ఆ మునిని శిక్షించడానికి పూనుకోగా, ఆ మహాముని నేత్రాలనుండి వెలువడిన కోపాగ్ని జ్వాలలలో అరువది వేలమంది భస్మమయ్యారని వెన్నెలకంటి సూరన రచించిన శ్రీవిష్ణుపురాణం చెబుతోంది.
– భట్టు వెంకటరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement