కార్తిక మాసంలో... ఉసిరి చెట్టును పూజిస్తే పాపాలు తొలగిపోతాయా? | Amla Tree Karthika Masam Benefits | Sakshi
Sakshi News home page

కార్తిక మాసంలో... ఉసిరి చెట్టును పూజిస్తే పాపాలు తొలగిపోతాయా?

Nov 13 2026 7:49 AM | Updated on Nov 13 2026 7:49 AM

Amla Tree Karthika Masam Benefits

భక్తి

కార్తిక మాసం

ఉసిరి చెట్టు సాక్షాత్తూ విష్ణు స్వరూపమని పద్మ పురాణంలో పరమశివుడు కార్తికేయుడికి చెబుతాడు. నిజానికి హిందువులు చెట్లను దైవాలుగా భావించి పూజాదికాలు నిర్వహిస్తుంటారు. కొన్ని చెట్లు దైవత్వాన్ని ఆపాదించుకోవడం వల్ల గ్రహదోషాలుంటే తొలగడమే కాకుండా సకల సిరి సంపదలు ఇంట పొంగి పొరలుతాయని భక్తుల ప్రగాఢ నమ్మిక.

ఈ చెట్టు ఇంటి ఆవరణలో ఉంటే మరీ మంచిది. ఉసిరి చెట్టులో విష్ణుమూర్తి కొలువుంటాడు. దేవదానవ సంగ్రామంలో క్షీరసాగర మథనం గావించినప్పుడు కొన్ని చుక్కలు భూమిపై పడ్డాయని పురాణాలు చెబు తున్నాయి. అచ్చోటనే ఉసిరి మొక్క మొలిచింది. అందువల్ల ఉసిరి సర్వరోగ నివారిణిగా మారింది. దీని గాలి సయితం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

ప్రధానంగా కార్తిక మాసంలో ఆ చెట్టును పూజించడమంటే శివకేశవులిద్దరినీ ఆరాధించినట్లే లెక్కని పెద్దలు చెబుతారు. చెట్టు మొదట్లో నివసించే ధాత్రిదేవితోపాటు దామోదరుడిని పూజించి దీపం వెలిగిస్తే అనంత కోటి పుణ్యఫలం లభిస్తుంది. ఉసిరికాయలపై వత్తులు వేసి దీపం వెలిగించవచ్చు.

‘ధాత్రిదేవి నమస్తుభ్యం
సర్వపాప క్షయంకరి
పుత్రాన్దేహి మహాప్రాజ్ఞే
యశోదేహి బలంచమే...’ శ్లోకాన్ని చదువుతూ కార్తిక మాసంలో వచ్చే ప్రతి సోమవారం, ద్వాదశి, ఏకాదశి, పౌర్ణమి తిథుల్లో దీపం పెట్టడం వల్ల గోదానంతో సమానమైన ఫలితం లభిస్తుందని నమ్మకం. అదే చెట్టుకింద కూర్చుని భోజనం చేస్తే అశ్వమేథ యాగం వల్ల ఒనగూరే ఫలితం చేకూరుతుంది. అందుకే కార్తిక మాసంలో వన భోజనాలు చేసే సంప్రదాయం వాడుకలోకి వచ్చింది.
– చెన్నాప్రగడ శర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement