పిల్లలపై ప్రేమ చూపించడంలో.. ప్రవక్త ముహమ్మద్‌ ఆదర్శం! | Prophet Muhammad Parenting Lessons For Parents | Sakshi
Sakshi News home page

పిల్లలపై ప్రేమ చూపించడంలో.. ప్రవక్త ముహమ్మద్‌ ఆదర్శం!

Nov 12 2026 8:40 AM | Updated on Nov 12 2026 8:42 AM

Prophet Muhammad Parenting Lessons For Parents

సన్నిధి

ఇస్లాం వెలుగు

పిల్లలపై ప్రవక్త ఆప్యాయత!

మందలింపుల కంటే మమకారమే ముఖ్యం.. పిల్లల మనసులను గెలుచుకోవడమే నిజమైన పెంపకం పిల్లలు కుటుంబానికి ఆనందం.. సమాజానికి భవిష్యత్తు. వారికి మంచి విద్య, ఆహారం, సౌకర్యాలు అందించడం ఎంత ముఖ్యమో.. ప్రేమ, ఆప్యాయత, గౌరవం పంచడం కూడా అంతే ముఖ్యం.

అయితే నేటి ఉరుకుల పరుగుల జీవితంలో పిల్లల భావాలను అర్థం చేసుకోవడం, వారితో సమయం గడపడం తగ్గిపోతోంది. చిన్న చిన్న తప్పులకే మందలింపులు, ఇతరులతో పోలికలు వారి మనసులపై ప్రభావం చూపుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల పట్ల ప్రేమ, కరుణ, సహనం ఎలా ఉండాలో తన ఆచరణ ద్వారా ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు ప్రవక్త ముహమ్మద్‌ (స). ఆయన జీవితం నేటి తల్లిదండ్రులకు కూడా గొప్ప మార్గదర్శకం.

ప్రేమను వ్యక్తం చేయడంలోనే గొప్పతనం!
ప్రవక్త ముహమ్మద్‌ (స) తన మనుమలు హజ్రత్‌ హసన్‌ (ర), హుస్సేన్‌ (ర)లను ఎంతో ఆప్యాయంగా ముద్దాడేవారు. ఒకసారి ఆయన మనుమడిని ముద్దాడటం చూసిన అఖ్రా బిన్‌ హాబిస్‌ అనే వ్యక్తి తనకు పదిమంది పిల్లలున్నా ఎవరినీ ముద్దాడలేదని చె΄్పాడు. అప్పుడు ప్రవక్తవారు‘‘దయ చూపనివారిపై దయ చూపబడదు’’ అని సమాధానమిచ్చారు. (సహీహ్‌ ముస్లిం) పిల్లలపై ప్రేమను మాటల్లోనే కాకుండా చేతల్లోనూ చూపించాలని ఈ సంఘటన తెలియజేస్తుంది.

చిన్నారి బాధను అర్థం చేసుకున్న ప్రవక్త!
అనస్‌ బిన్‌ మాలిక్‌ (ర) చిన్న తమ్ముడు అబూ ఉమైర్‌కు ఒక చిన్న పక్షి ఉండేది. దానితో అతడు ఎంతో ఆనందంగా ఆడుకునేవాడు. ఒకరోజు ఆ పక్షి చనిపోవడంతో బాలుడు బాధపడ్డాడు. విషయం తెలుసుకున్న ప్రవక్త ముహమ్మద్‌ (స) అతడిని ప్రేమగా పలకరిస్తూ, ‘‘అబూ ఉమైర్‌! నీ చిన్న పిచ్చుక ఏమైంది?’’ అని అడిగారు. (సునన్‌ అబీ దావూద్‌) పెద్దలకు చిన్న విషయంగా అనిపించినా పిల్లలకు అవి ఎంతో ముఖ్యమైనవిగా ఉంటాయి. వారి బాధను గుర్తించి స్పందించడం ఎంత అవసరమో ఈ సంఘటన చెబుతోంది.

పదేళ్లపాటు మందలించని మహనీయుడు!
అనస్‌ బిన్‌ మాలిక్‌ (ర) సుమారు పదేళ్లపాటు ప్రవక్తవారికి సేవ చేశారు. ఆ కాలంలో ప్రవక్తవారు తనను ఒక్కసారి కూడా అసహనంతో మందలించలేదని ఆయన వెల్లడించారు. (సహీహ్‌ అల్‌ బుఖారీ) పిల్లలు తప్పులు చేయడం సహజం. ప్రతి తప్పుకూ కోపగించడం కంటే సహనంతో వారికి మంచి చెడులను వివరించడం అవసరం. భయంతో కాకుండా ప్రేమతో క్రమశిక్షణ నేర్పించాలన్నది ఈ సంఘటనలోని సందేశం.

కుమార్తెకు ఇచ్చిన గౌరవం!
ప్రవక్త ముహమ్మద్‌ (స) తన కుమార్తె హజ్రత్‌ ఫాతిమా (ర) పట్ల ఎంతో గౌరవం చూపేవారు. ఆమె తన వద్దకు వచ్చినప్పుడు లేచి నిలబడి ఆహ్వానించి, ప్రేమగా ముద్దాడి తన స్థానంలో కూర్చోబెట్టేవారు. (సునన్‌ అత్తిర్మిజీ) పిల్లలు చిన్నవారని వారి అభిప్రాయాలను తక్కువ చేయకూడదని, వారికి ప్రేమతోపాటు గౌరవం కూడా ఇవ్వాలని ఈ సంఘటన తెలియజేస్తుంది.
– ముహమ్మద్‌ ముజాహిద్‌

ఇదీ చదవండి: కార్తీక మాసంలో దీపం ఎప్పుడు వెలిగించాలి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement