కార్తీక మాసంలో దీపం ఎప్పుడు వెలిగించాలి? | Karthika Masam Deepa Aradhana Importance | Sakshi
Sakshi News home page

కార్తీక మాసంలో దీపం ఎప్పుడు వెలిగించాలి?

Nov 12 2026 8:29 AM | Updated on Nov 12 2026 8:29 AM

Karthika Masam Deepa Aradhana Importance

సన్నిధి

మాసమంతా పర్వదినాలే!

రేపు నాగుల చవితి

శరద్‌ ఋతువు ఉత్తరభాగంలో వచ్చే కార్తీక మాసంలో నెల రోజులు పర్వదినాలే. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు కార్తీక మహత్యాన్ని వివరించినట్లు, దానిని శౌనకాదిమునులకు సూతుడు మరింత వివరంగా చెప్పినట్లు కార్తీక పురాణంలో ఉంది. 

కార్తీక మాసంలో దశమి, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో, కమలాలతో పూజిస్తే ధనానికి లోటుండదనీ, సకల సౌఖ్యాలు కలుగుతాయని, అంత్యమున జన్మరాహిత్యం కలుగుతుందనీ అంటారు. ఆరుద్ర నక్షత్రం రోజు, మహాశివరాత్రినాడు సోమ వారం నాడు, కార్తీకపున్నమి నాడు రుద్రాభిషేకంచేసి, బిళ్వ దళాలతోనూ, రుద్రాక్షలతోనూ పూజించిన వారికి అనంతమైన సుఖాలు కలుగుతాయని కార్తీక పురాణం చెబుతోంది.

ఈ మాసంలో కార్తీక దీపారాధన చాలా ముఖ్యమైనది. కార్తీకదీపాన్ని ఇంట్లో లేదా తులసికోట దగ్గిర భక్తి శ్రద్ధలతో వెలిగిస్తారు. ఉదయం సూర్యోదయానికి ముందు బ్రాహ్మీ ముహూర్తంలోనూ, సాయంత్రం సూర్యాస్తమయం తరవాత ప్రదోషకాలంలోనూ కార్తీక దీపాన్ని వెలిగి స్తారు. పూజాగదిలో ఇంటి సింహ ద్వారం దగ్గర, తులసికోట దగ్గర కనీసం రెండు లేదా ఐదు దీపాలు వెలిగిస్తారు.

దీపం పెట్టే స్థలాన్ని శుభ్రపరచి ముగ్గుపెట్టి ప్రమిదకు పసుపు, కుంకుమ బొట్లు పెడతారు. ప్రమిద నేరుగా నేల మీద కాకుండా, అరి టాకు లేదా తమల పాకుపై ప్రమిదను ఉంచుతారు. కార్తీక మాసంలో తామర వత్తుల దీపం వెలిగిస్తే ఐశ్వర్యం లభిస్తుందనీ, జిల్లేడు వత్తులతో వెలిగిస్తే గణపతి అనుగ్రహం, అరటినార వత్తులతో వెలిగిస్తే కుటుంబ ప్రశాంతత కలుగుతుందని నమ్ముతారు.

కార్తీక ΄ûర్ణమిరోజున 365 వత్తుల దీపాన్ని వెలిగిస్తారు. ఈ దీపాన్ని ఎప్పుడూ నేరుగా అగ్గిపుల్లతోగాని కొవ్వొత్తితోగాని వెలిగించకూడదు. ముందుగా ఒక ఏకహారతి దీపాన్ని కర్పూరకళికతో వెలిగించి లేదా అగర బత్తిని అగ్గిపుల్లతో వెలిగించి,దానిసాయంతో 365 వత్తులప్రధాన దీపాన్ని వెలిగించాలి. దీపం వెలిగించిన తరువాత దానికి పసుపు, కుంకుమ, అక్షతలు, పూలు, సమర్పించి, దామోదరాయ నమః లేదా ‘ఓం నమశ్శివాయ’ అని స్మరిస్తూ నమస్కారం చేస్తారు.

‘దీపంజ్యోతిపరబ్రహ్మ దీపం సర్వతమోపహం
దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మీ నమో స్తుతే:’
జీవాత్మకే కాదు పర మాత్మకు కూడా దీపం ప్రతిరూపం. 
దీపావళి అమావాస్య తరవాత వచ్చే పంచమిని ‘లాభ పంచమి’ ‘జ్ఞాన పంచమి’ అని పిలుస్తారు. ముఖ్యంగా గుజరాత్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలలోని పలు ప్రాంతాలలో దీనిని ‘లాభ్‌ పాప్చ్‌’ అని వైభవంగా జరుపుకుంటారు. దీపావళి పండుగ తరవాత తమ తమ వ్యాపారాలకు కొద్దిరోజుల విరామం యిచ్చి ఈ రోజు లక్ష్మీ దేవి పూజలు చేసి, కొత్త ఖాతాపుస్తకాలను తెరిచి, వాటిపై ‘శుభ్‌ లాభ్‌’ అని రాసి పూజలు చేస్తారు. జ్ఞానపంచమి పేరుతో జైనమతస్థులు చాలా వైభవంగా జరుపు కుంటారు. తమ పవిత్ర గ్రంథాలను శుభ్రం చేసి పూజ చేస్తారు. జ్ఞానం పెరగాలని, బుద్ధి వికసించాలని ప్రార్థనలు జరుపుతారు.

కార్తీక బహుళ ఏకాదశి పర్వ దినం నాడు ఏకాదశీదేవి జన్మించింది. మురాసురుడు అనే రాక్షసుడు శ్రీ మహా విష్ణువు యోగనిద్రలో ఉన్నపుడు ఆయనను చంపడానికి ప్రయత్నించగా, విష్ణుమూర్తి శరీరం నుండి ఒక శక్తిమం తమైన కన్య ఉద్భవించి, ఆ రాక్షసుడిని సంహరిస్తుంది. అప్పుడు విష్ణుమూర్తి ఆ కన్యకు ‘ఏకాదశి’ అని పేరుపెట్టాడు. ఎవరైనా ఏడాది పొడవునా ఏకాదశి వ్రతాన్ని్రపాంభించాలనుకుంటే దానికి ఈ కార్తీక బహుళ ఏకాదశి లేదా ఉత్పత్తి ఏకాదశి ప్రశస్తమైన రోజు.

కార్తీక మాసంలో ప్రతి రోజూ ఒక్కొక్క దేవతకు అనుసంధానమై వుంటుంది. ఈ బహుళ ఏకాదశి తిథి కుబేరుడితోముడిపడి ఉంది. అందువల్ల ఈ రోజున పూజలు ఆచరించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, ఐశ్వర్యం సిద్ధిస్తుందని విశ్వసిస్తారు. ఈ రోజున విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన తులసిదళాలను ఆయనకు సమర్పిస్తారు. శివాలయాల లోను, కేశవాలయాలలోను అఖండ దీపాలను వెలిగించి ఆరాధించడం పరిపాటి. ఇంకా కార్తీక బహుళ ద్వాదశినాడు క్షీరాబ్ధి ద్వాదశి వ్రతం చేసుకుంటారు. అమావాస్య మరునాడు పోలిపాడ్యమిగా జరుపుకుంటారు.
– శిష్టా నాగేశ్వరరావు, సీనియర్‌ పాత్రికేయులు

దీపావళి అమావాస్య తరవాత వచ్చే కార్తీక శుక్ల పక్ష చతుర్థి నాడు నాగుల చవితి పర్వదినం. ఈవ్రతాన్ని ముఖ్యంగా వివాహితలు తమ పిల్లల ఆరోగ్యం, ఆయుష్షు, కుటుంబ శ్రేయస్సు కాంక్షించి చేసుకుంటారు. నాగుల చవితి రోజున ఉదయాన్నే తలస్నానం చేసి, సమీపంలో వున్న పుట్ట దగ్గరకు వెళ్లి, పుట్టలో పాలు, బియ్యప్పిండి, లడ్డులను సమర్పిస్తారు. చవితి రోజున ప్రత్యేకించి, చలిమిడి, వడపప్పు, చిమ్మిలి (నువ్వులు –బెల్లం ముద్ద)ప్రసాదాలు తయారు చేసి దేవుడికి సమర్పిస్తారు. ఇక ఆరోజంతా ఉపవాస దీక్షలో ఉంటారు.

జాతకంలో కుజదోషం, కాలసర్పదోషం లేదా రాహు, కేతు దోషాలు ఉన్నవారు ఈ రోజున నాగపూజ చేయడం వల్ల ఆయాదోషాల తీవ్రత తగ్గుతుందని విశ్వసిస్తారు. శాస్త్రీయంగా పరిశీలిస్తే సర్పాలు పంటలను నాశనం చేసే ఎలుకలను, కీటకాలను తింటూ రైతులకు మేలు చేస్తాయి. అందువల్ల ఈ పండుగను ప్రకృతిని అనుసరించి జీవన విధానం సాగించే ప్రాముఖ్యతను సూచిస్తుంది.

నిర్వహణ : డి.వి.ఆర్‌. భాస్కర్‌

ఇదీ చదవండి: తప్పులు చేసినవారినీ ఉన్నతులుగా తీర్చిదిద్దే సద్గురువులు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement