కార్తీక మాసంలో ఈ వ్రతం ఆచరిస్తే ఇంతటి ఫలితమా? | Funday Devotional Story On Kartika Vratham Purunjaya Story | Sakshi
Sakshi News home page

కార్తీక మాసంలో ఈ వ్రతం ఆచరిస్తే ఇంతటి ఫలితమా?

Nov 8 2026 8:17 AM | Updated on Nov 8 2026 8:17 AM

Funday Devotional Story On Kartika Vratham Purunjaya Story

ఫండే

భక్త విజయం

పురంజయుడి కార్తీక వ్రతం

త్రేతాయుగంలో పురంజయుడు అనే రాజు అయోధ్యా నగరాన్ని రాజధానిగా చేసుకుని, పరిపాలించేవాడు. పట్టాభిషేకమైన తర్వాత ధర్మబద్ధంగానే రాజ్యపాలన సాగించాడు. కొన్నాళ్లు గడిచాక అతడిలో దురాశ మొదలైంది. రాజ్యాన్ని మరింతగా విస్తరించాలని, సంపదలను మరింతగా పోగు చేసుకోవాలని కోరిక తలెత్తింది. పొరుగు రాజ్యాలను మాయోపాయంతో వశపరచుకోవడం మొదలుపెట్టాడు. యజ్ఞ యాగాదులను, దాన ధర్మాలను పూర్తిగా విస్మరించాడు.

పురంజయుడి వల్ల దెబ్బతిని రాజ్యాలు పోగొట్టుకున్న రాజులందరూ అతడికి వ్యతిరేకంగా ఏకమయ్యారు. అకస్మాత్తుగా పురంజయుడి పైకి యుద్ధానికి వచ్చారు.  పురంజయుడు, హుటాహుటిన సైన్యాన్ని సిద్ధం చేసుకుని, యుద్ధానికి బయల్దేరాడు. ఆ యుద్ధంలో పురంజయుడు ఓడిపోయి, అడవులకు పారిపోయి తలదాచుకున్నాడు.

కీకారణ్యంలో ఒంటరిగా ఉంటూ, యుద్ధంలో ఎదురైన ఓటమికి దుఃఖిస్తూ ఉన్న పురంజయుడి వద్దకు ఒకనాడు సూర్యవంశ రాజులకు కులగురువైన సుశీలుడు వచ్చాడు. విచారగ్రస్థుడైన రాజును చూసి, ‘రాజా! దుఃఖించకు. జయాపజయాలు దైవాధీనాలు. నీ రాజ్యాన్ని నువ్వు తిరిగి పొందాలనుకుంటే నేను చెప్పినట్లు ఆచరించు. «నేను చెప్పినట్లు చేస్తే, నీకు పాపోపశమనం కలిగి, కోల్పోయిన రాజ్యలక్ష్మి తిరిగి దక్కుతుంది. ఇది కార్తీక మాసం. రోజూ వేకువజామునే స్నానానుష్ఠానాలు కావించుకుని, దేవాలయానికి వెళ్లి, శివకేశవులకు దీపారాధన చేసి, భగవన్నామ స్మరణ చేయి. ఇలా చేయడం వల్ల నీకు శత్రువులను జయించే సాధనా సంపత్తి అసంకల్పితంగానే సమకూరుతుంది.’ అని చెప్పాడు.

సుశీలుడి ఉపదేశంతో పురంజయుడు కార్తీక పున్నమి రోజున నిత్యానుష్ఠానాలు కావించుకుని, దేవాలయానికి వెళ్లాడు. అక్కడ దీపారాధన చేసి, భగవన్నామ స్మరణ చేస్తూ రాత్రంతా ఆలయంలోనే ఉండి జాగారం చేశాడు. మర్నాటి ఉదయం అడవిలోని తన ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. పురంజయుడు తన ఆశ్రమానికి వచ్చిన కొద్దిసేపటికే తులసిమాలలను మెడలో ధరించిన ఒక విప్రుడు అతడి వద్దకు వచ్చాడు. బ్రహ్మతేజస్సు ఉట్టిపడుతున్న ఆ విప్రుడిని చూసి, పురంజయుడు అసంకల్పితంగా అతడికి నమస్కరించాడు. ఆ విప్రుడు పురంజయుడిని చూసి, ‘మహారాజా! ఇది శుభతరుణం. వెంటనే సైన్యాన్ని సమాయత్తం చేసుకుని, యుద్ధానికి బయలుదేరు. నీకు విజయం తథ్యం.’ అని పలికి, తులసిదళాలతో అల్లిన చక్రాన్ని అతడి చేతికిచ్చి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

పురంజయుడు తన వద్దకు వచ్చినవాడు సాక్షాత్తు శ్రీమహావిష్ణువేనని తలచాడు. వెనువెంటనే సైన్యాన్ని సమీకరించుకుని, యుద్ధానికి బయలుదేరాడు. పురంజయుడు అనూహ్యంగా యుద్ధానికి రావడంతో అతడి రాజ్యాన్ని ఆక్రమించుకున్న శత్రురాజులు కళవళపడ్డారు. యుద్ధంలో పురంజయుడు శత్రువులు అందరినీ తుదముట్టించాడు. తిరిగి రాజ్యాన్ని దక్కించుకున్నాడు.

యుద్ధంలో గెలిచి, రాజ్యాన్ని తిరిగి పొందిన పురంజయుడు కార్తీక వ్రత మహాత్మ్యం వల్లనే తనకు జయం కలిగిందని భావించాడు. కార్తీక వ్రతం వల్ల దక్కిన శ్రీహరి అనుగ్రహం లేకుంటే, ఇదంతా సాధ్యమయ్యేది కాదని అనుకున్నాడు. రాజ్య ప్రజందరూ కార్తీకమాసంలో కార్తీక వ్రతాన్ని పాటించాలని చాటింపు వేయించాడు. పూర్వం చేసిన దుష్కృత్యాలను మానేసి, రాజ్యాన్ని ప్రజారంజకంగా పాలించసాగాడు. కొన్నాళ్లకు అతడికి కొడుకు పుట్టాడు. అతడికి వికుక్షి అనే పేరుపెట్టి, బాల్య సంస్కారాలన్నీ శాస్త్రోక్తంగా జరిపించాడు. వికుక్షి యుక్తవయస్కుడయ్యాక పురంజయుడు అతడికి పట్టాభిషేకం చేసి, తాను వానప్రస్థానానికి వెళ్లిపోయాడు.

వానప్రస్థంలో తీర్థయాత్రలు చేస్తూ, ప్రతి క్షేత్రంలోనూ కార్తీక వ్రతాన్ని నియమబద్ధంగా ఆచరిస్తూ వచ్చాడు. తుదకు కావేరీ తీరంలోని శ్రీరంగం క్షేత్రానికి చేరుకున్నాడు. రంగనాథుని సేవించుకుని, కార్తీక వ్రతం ఆచరిస్తుండగా, ఒకనాడు జరాభారంతో కాలధర్మం చెందాడు. కార్తీక వ్రత పుణ్యఫలం వల్ల పురంజయుడు వైకుంఠప్రాప్తి పొందాడు.
- సాంఖ్యాయన

పురావిశేషం..
శ్రీకూర్మంలో కార్తీక నైవేద్యం కూర్మావతార రూపంలో శ్రీమహావిష్ణువు వెలసిన అరుదైన క్షేత్రం శ్రీకూర్మం. ఈ ఆలయంలోనూ మిగిలిన చాలా ఆలయాల మాదిరిగానే ప్రతిరోజూ చింతపండుతో తయారుచేసే పులిహోర నైవేద్యం పెడతారు. కార్తీకమాసంలో మాత్రం ఇక్కడ ప్రత్యేకంగా ఉసిరి పులిహోరను నైవేద్యంగా పెడతారు. కార్తీకంలోని ప్రత్యేక తిథులలో స్వామివారిని ఉసిరి ఆకులు, ఉసిరి కాయలతో పూజిస్తారు. భక్తులు ఉసిరికాయలను డొల్లగా చేసి, వాటితో ఉసిరి దీపాలు పెడతారు.

ఇదీ చదవండి: దీపావళి పర్వదినాన లక్ష్మీపూజ చేయడం వెనుక ఆంతర్యం..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement