గుడికి వెళ్లగానే దైవదర్శనం తర్వాత మన అడుగులు సహజంగానే హుండీ వైపు పడతాయి. భక్తితో, మన స్తోమతను బట్టి కొంత సొమ్మును అందులో వేసి చేతులు జోడిస్తాం. అసలు గుడిలో దానధర్మాలు చేయడం, హుండీలో కానుకలు సమర్పించడం అనే ఆచారం ఎప్పుడు మొదలైంది..? దీనివెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి..?
అహంకార విసర్జన.. మమకార ఛేదన..
సనాతన ధర్మంలో ‘దానం’ అనేది ఒక విశిష్టమైన సాధన. ఆలయంలోని హుండీలో డబ్బు వేయడం అంటే కేవలం ఆ గుడికి విరాళం ఇవ్వడం కాదు; మనలోని ’నాది’ అనే అహంకారాన్ని దేవుని సన్నిధిలో వదిలిపెట్టడం. సంపద మీద మనిషికి ఉండే వ్యామోహాన్ని, మమకారాన్ని కాస్తయినా తగ్గించుకుని, ’అంతా నీదే స్వామీ’ అని లోబడే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రక్రియ ఇది.
హుండీ ఆచారం ఎలా మొదలైంది..?
ఆలయాల్లో కానుకలు సమర్పించే సంప్రదాయం ఫలానా రోజున, ఫలానా చోట ప్రారంభమైందని కచ్చితంగా చెప్పలేం. ప్రాచీన కాలంలో ఆలయాల నిర్వహణకు, నిత్యాన్నదానాలకు, ఉత్సవాలకు ప్రజలు ధాన్యం, పశువులు, వస్త్రాల రూపంలో విరాళాలు ఇచ్చేవారు. కాలక్రమేణా ఆలయాల వ్యవస్థాగత నిర్వహణ పెరగడంతో, భక్తులు తమ కానుకలను భద్రంగా సమర్పించేందుకు వీలుగా ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో ’హుండీ’ని ఏర్పాటు చేయడం మొదలైంది.
సామాజిక సేవకు వారధి..
భక్తులు సమర్పించే ఈ విరాళాలు దేవుడి కోసం కాదు, దేవుని పేరుతో జరిగే ధార్మిక కార్యక్రమాల కోసం..! ఆలయ నిర్వహణ, నిత్యాన్నదానాలు, వేద పాఠశాలల పోషణ, గోశాలల సంరక్షణ, ఆపదలో ఉన్నవారికి సాయం వంటి అనేక సామాజిక సేవా కార్యక్రమాలకు ఈ ధనాన్ని వినియోగిస్తారు. అంటే, మనం భగవంతుడికి ఇచ్చేది తిరిగి సమాజంలోని పదిమందికి సేవ రూపంలో చేరుతుందన్నమాట.
మారుతున్న పద్ధతులు.. మారని తత్వం..
ఒకప్పుడు ధాన్యం, ఆ తర్వాత రాగి కాసులు, నోట్లు.. ఇప్పుడు ఆన్‌లైన్ పేమెంట్లు, క్యూఆర్ కోడ్‌లు, రసీదుల ద్వారా విరాళాలు..! కాలంతో పాటు దానం చేసే పద్ధతులు, రూపాలు మారవచ్చు కానీ, భక్తుని మనసులోని ’సమర్పణ భావం’ మాత్రం ఒకటే. హుండీ అనేది కేవలం డబ్బులు దాచే పెట్టె కాదు.. అది భక్తుల సేవా భావానికి, పరోపకారానికి, దైవం పట్ల ఉన్న అచంచలమైన విశ్వాసానికి సజీవ సాక్ష్యం. దేవుడికి మనం ఏది ఇచ్చినా స్వచ్ఛమైన మనసుతో ఇచ్చినప్పుడే ఆ దానానికి సంపూర్ణ సార్థకత చేకూరుతుంది.
– పసుపులేటి శ్రీలక్ష్మి
ఇదీ చదవండి: కార్తికేయుడి చేతిలో కుక్కుటం?


