ప్రతీకాత్మక చిత్రం (ఏఐ ఫోటో)
జ్యోతిర్మయం
అరణ్యవాసంలో పాండవులు ముని సంఘముతో కూడి, కామ్యకవనంలో ఉంటుండగా శ్రీకృష్ణుడు వారిని పరామర్శించి వెళ్ళడానికి వచ్చాడు. అప్పటికి వారు కృష్ణుడిని కలిసి పది నెలల పైనే అయింది. చేది భూపతియైన సాల్వుడితో ఆ పది నెలల కాలంలో శ్రీకృష్ణుడు యుద్ధంలో ఉండటం ఆ విరామానికి కారణం.
ఆ పది నెలల కాలంలోనే అంతా జరగడం బాధను కలిగిస్తోందని ధర్మరాజుకు చెప్పాడు శ్రీకృష్ణుడు. ద్రౌపది తన హృదయంలోని బాధను కృష్ణుడితో చెప్పింది. ‘పాండుభూపతి కోడలినైయుండి, యుద్ధకుశలురైన ఐదుగురు భర్తలకు భార్యనైయుండి, పూజ్యుడవైన నీకు చెల్లెలినైయుండి, అధికశక్తిసంపన్నుడైన దృష్టద్యుమ్నుడి సహోదరినైయుండి, ఆ ధృతరాష్ట్రుడి చిన్నకొడుకైన దుశ్శాసనుడిచేత నిండుసభలో జుట్టుపట్టి ఈడ్వబడి, వలువలు వొలవబడి దారుణమైన అవమానాన్ని అనుభవించాను. నా భర్తలు ఐదుగురు ఏమీ చేయలేక చూస్తూ ఊరుకున్నారు.
భీష్మ విదురాది వృద్ధులు, జరుగుతున్నదంతా చూస్తూ కూడా, ఏమీ మాట్లాడలేదు. అందరూ ఉండి కూడా ఎవ్వరూ లేనిదాననైనాను. అప్పటి నా స్థితి చూసి కర్ణుడు వికటంగా నవ్వాడు. కర్ణుడి ఆ నవ్వు దుశ్శాసనుడు చేసిన పనుల కంటె నన్ను ఎక్కువగా బాధిస్తూ, నా హృదయాన్ని కాలుస్తూ ఉంది అన్నా!’ అని చెప్పి విలపించింది. ద్రౌపది మాటలలోని బాధను, క్రోధాన్ని అర్థంచేసుకున్న కృష్ణుడు ఆమె హృదయానికి శాంతిని కలిగించేలా ఇలా చెప్పాడంది వ్యాసభారతం.
శ్లో. రోదిష్యన్తి స్త్రియో హ్యేవం యేషాం క్రుద్ధాసి భావిని
బీభత్సు శరసంచ్ఛన్నాంఛోణితౌఘపరిప్లుతాన్.
‘నిన్ను చూసి ఎవరైతే నవ్వారో; బాధను, క్రోధాన్ని కలిగించారో; వాళ్ళ ప్రాణాలను అర్జునుడి బాణాలు హరించగా, వాళ్ళ భార్యలు హృదయవిదారకంగా రోదించటం నువ్వు చూద్దువుగాని సోదరీ!’ అన్న శ్రీకృష్ణుడి సమాధానం, ఒకరిని చూసి హేళనగా నవ్వే ముందు, భవిష్యత్తులో ఆ నవ్వు ప్రభావం ఎలా ఉండగలదన్నది కొంచమైనా ఆలోచించి చేయవలసిన పని అని తెలియజెప్పింది.
– భట్టు వెంకటరావు
ఇదీ చదవండి: దీపావళి వేడుకల్లో ఈ నగరాలదే ప్రత్యేక శైలి.. ఎందుకో తెలుసా?


