దత్తబోధ
నిష్కామ కర్మ
కోరికలేవీ పెంచుకోకుండా కర్మ చేయాలి. ఇలా చేయటాన్ని ‘నిష్కామ కర్మ’ అని అంటారు. మానవ జీవితంలో బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఘట్టాలు నాలుగు తారసిల్లు తాయి. మొదటి మూడు దశల్లోనూ, ఒకదాని తర్వాత ఒకటి అనుభవిస్తూ ఆ యా దశల్లో ఆచరించవలసిన కర్మలను వరుసగా నిష్కామంగా ఆచరిస్తూ ముందుకు పోతూ ఉంటే తిరిగి వెనక్కు చూడనక్కర్లేదు.
పతనమనేది ఉండనే ఉండదు. తనకు మంచి పేరు రావాలనీ, పది మంది తన పేరు చెప్పుకోవాలనీ ఉబలాట పడుతూ సమాజసేవ చేస్తే పరమాత్మను చేరుకోలేరు. మెట్లనుంచి జారిపోతారు. అన్నదానం చేస్తారు, విద్యాదానం చేస్తారు. ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాన్ని ఆదుకొంటారు, బాగానేవుంది కానీ వారి కృతజ్ఞతలకోసం ఎదురు చూడకూడదు.
లంకలో సీతామాతను చూసి హనుమంతుడు రాముడిచ్చిన ముద్రికను ఆమెకిచ్చి ఆమెనుండి తీసికొన్న చూడామణిని రాముడికిచ్చాడు. సాహసంతో అంతటి పని చేసిన ఆంజనేయునకు శ్రీరాముడు ఎంత ఉపకారమైనా చేయవచ్చు. కానీ ఏమీ చేయలేదు. ఒక్కసారి హనుమంతుణ్ణి గాఢంగా కౌగిలించుకొన్నాడంతే. అంతతో ఆగక ‘నీకు నేనేమీ ప్రత్యుపకారం చేయను’ అని ఖండితంగా చెప్పాడు. ‘రాముడంతటి మహనీయుడు ఇలాగేనా చేయా ల్సింది’ అని సామాన్యులకు అనిపించి ఆంజనేయుని మీద జాలివేస్తుంది కదూ!
ఇక్కడే ఉంది పరమార్థం. నిజానికి అమూల్యమైందిచ్చాడు రాముడు: ఆలింగనం. ఎంత పుణ్యం చేసుకుంటే ఆ అవతార పురుషుని ఆలింగనం దొరుకుతుంది చెప్పండి. ‘నేనే నీవు, నీవే నేను’ అని అభేద భావాన్ని చెప్పేది ఆలింగనం. ఆ అదృష్టం హనుమకు మాత్రమే దొరికింది. ఆంజనేయునికి రాముడు ప్రత్యుపకారం చేయవలసిన అవసరం ఎన్నడూ కలగదని రాముని ఆంతర్యం. ఆంజనేయుడు మహా భక్తుడు కనుక రాముని ఆంతర్యము అర్థమై ఆనందించాడు. దీన్ని బట్టి నేర్చుకోవలసిందేమిటంటే ప్రత్యుపకారం కోరి ఎవ్వరూ దానం చేయరాదు అని. అప్పుడది నిష్కామకర్మ అవుతుంది.
- శ్రీ గణపతి సచ్చిదానందస్వామి
ఇదీ చదవండి: అక్కడ దీపావళి రోజున ఉపవాసాలు, ప్రార్థనలు..


