అడుగడుగునా జాగ్రత్త | Diabetes can damage the nerves and blood vessels in your feet. | Sakshi
Sakshi News home page

అడుగడుగునా జాగ్రత్త

Nov 12 2026 4:17 AM | Updated on Nov 12 2026 4:17 AM

Diabetes can damage the nerves and blood vessels in your feet.

→ డయాబెటిస్‌ కథనం–3

డయాబెటిస్‌తో బాధపడేవారిలో చాలామందికి ఎదురయ్యే సమస్య పాదాలకు పుండ్లు పడటం. ఇది కొందరిలో ఎంత తీవ్రమైన పరిస్థితికి దారితీస్తుందంటే... చివరకు పాదాలు / కాలి  తొలగింపు తప్ప మరో పరిస్థితి తప్పని స్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో కాలి విషయంలోనూ, కాళ్లకు పుండ్లు పలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో చూద్దాం.

డయాబెటిస్‌ ఉన్నవారికి పాదాలపై  చిన్న పొక్కు వచ్చినా ఆ చిన్న గాయమే చివరకు కాలి వేలు, పాదం లేదా కాలు తొలగించాల్సిన పరిస్థితికి దారితీయవచ్చు. మన శరీరంలో గుండె, మెదడుకు దూరంగా ఉండేవి పాదాలే. మనం వేసే ప్రతి అడుగులోనూ శరీరం బరువు మొత్తం పాదాలపైనే పడుతుంది. ఏళ్ల తరబడి రక్తంలో చక్కెర స్థాయులు ఎక్కువగా ఉండటం వల్ల పాదాలకు ప్రధానంగా మూడు రకాలుగా నష్టం జరుగుతుంది.

1. నరాలు దెబ్బతినడం (న్యూరోపతి): ఈ కారణంగా పాదాలకు వెళ్లే సన్నని నరాలు దెబ్బతినడం.  నొప్పి, వేడి, ఒత్తిడి తెలియకపోవడం, పాదాల ఆకృతి మారడం, చర్మం పొడిబారి పగుళ్లు రావడం 
2. రక్తప్రసరణ తగ్గడం : డయాబెటిస్‌ వల్ల కాళ్లకు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాలు సన్నబడి, గట్టిపడతాయి. ఈ సమస్యను పెరిఫెరల్‌ ఆర్టరీ డిసీజ్‌ అంటారు. 
3. ఇన్ఫెక్షన్స్‌తో పోరాడే శక్తి తగ్గడం : రక్తంలో చక్కెర ఎక్కువగా ఉండటం వల్ల సూక్ష్మక్రిములతో పోరాడే తెల్ల రక్తకణాల పనితీరు బలహీనపడుతుంది. శరీర కణజాలాల్లో బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది.

ఈ సమస్యలతో చిన్న ఇన్ఫెక్షన్‌ కూడా పాదంలోకి లోతుగా వ్యాపించి, ఎముకల వరకు చేరవచ్చు. చివరకు పాదం కుళ్లిపోవడం (గ్యాంగ్రీన్ ) అనే ప్రమాదకర పరిస్థితి ఏర్పడవచ్చు. అప్పుడు మిగతా కాలును కాపాడటానికి... అలా చనిపోయిన భాగాన్ని శస్త్రచికిత్స ద్వారా తొలగించడం తప్ప మరో మార్గం ఉండకపోవచ్చు. 

పాదాలకోసం ఇవీ జాగ్రత్తలు...
రోజూ కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పాదాలకు వచ్చే ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు.
→ రెండు పాదాలను ప్రతిరోజూ జాగ్రత్తగా పరిశీలించడం. అరికాళ్లను, వేళ్ల మధ్య భాగాలను కూడా చూడటం. కిందికి వంగడం కష్టమైతే చేతి అద్దం ఉపయోగించడం లేదా కుటుంబ సభ్యుల సహాయం తీసుకోవడం 
→ ప్రతిరోజూ గోరువెచ్చని నీటితో పాదాలను కడిగి... ఇలా కడిగాక వేళ్ల మధ్య భాగాలను మెత్తని గుడ్డతో తుడిచి ఆరబెట్టడం 
→ పాదాల మడమలకు, అరికాళ్లకు చర్మం పగలకుండా మాయిశ్చరైజర్‌ రాయడం. (అయితే వేళ్ల మధ్య రాయకూడదు. అక్కడ తేమ ఎక్కువగా ఉంటే ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌ వచ్చే అవకాశముంటుంది) 
→ చెప్పులు లేదా షూస్‌ వేసుకునే ముందు వాటిలో చిన్న రాళ్లు, గుచ్చుకునే పదునైన అంచుల వంటివి ఏమైనా ఉన్నాయేమో పరిశీలించడం 
→ ఇంట్లో ఉన్నా, మేడపైన నడిచినా, ఆరుబయటకు వెళ్లినా చెప్పులు లేకుండా నడవకపోవడం.  కాళ్లకు బాగా సరిపోయే శుభ్రమైన కాటన్ సాక్స్‌ ధరించాలి. వాటి కుట్లు పాదాలకు ఒత్తిడి కలిగించకూడదు.

వైద్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
→ డాక్టర్‌ సూచనల మేరకు రక్తంలో చక్కెర స్థాయులను అదుపులో ఉంచుకోవడం.. పాదాల సమస్యలను నివారించడానికి ఇదే అన్నింటికంటే ముఖ్యం → కనీసం ఏడాదికి ఒకసారైనా వైద్యుడితో పాదాలను పరీక్షించుకోవడం. పాదాలకు స్పర్శ తెలియకపోవడం వంటి సమస్యలు ఉంటే మరింత తరచుగా పరీక్షలు చేయించుకోవాలి. వైద్యులు ఒక సన్నని దారం లాంటి పరికరంతో (మోనోఫిలమెంట్‌) పాదాలకు స్పర్శ తెలుస్తోందా లేదా పరీక్షిస్తారు. పాదాల్లో రక్తనాళాల స్పందనను పరిశీలిస్తారు. పాదాల ఆకారంలో ఏమైనా మార్పులు వచ్చాయా అని కూడా చూస్తారు 

→ భారతదేశ జాతీయ చికిత్స మార్గదర్శకాల ప్రకారం, నరాలకు ఎలాంటి నష్టం లేనివారు ఏడాదికి ఒకసారి పాదాలను పరీక్షించుకోవాలి. నరాలు దెబ్బతిన్నవారు ప్రతి ఆరు నెలలకోసారి పరీక్ష చేయించుకోవాలి. గతంలో పాదాలపై పుండ్లు వచ్చినవారు లేదా కాలు తొలగించాల్సి వచ్చినవారు ప్రతి ఒకటి నుంచి మూడు నెలలకోసారి పరీక్షలు చేయించు కోవాలి → సిగరెట్లు తాగడం, పొగాకు నమలడం వంటి అలవాట్లను పూర్తిగా మానేయాలి.

ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి...
కింది లక్షణాల్లో ఏది కనిపించినా నిర్లక్ష్యం చేయకూడదు.. ఇంటి చిట్కాలతో చికిత్స చేయడానికి ప్రయత్నిస్తూ సమయాన్ని వృథా చేయడం చాలా ప్రమాదకరం. 
→ పాదంపై పొక్కు, కోత, చర్మం పగలడం లేదా మానని పుండు ఏర్పడటం 
→ పాదం ఎర్రబడటం, వాపు రావడం, వేడిగా అనిపించడం లేదా చీము రావడం 
→ పాదాల నుంచి దుర్వాసన రావడం → చర్మం నీలం, నలుపు లేదా మరీ పాలిపోయిన రంగులోకి మారడం 
→ కొత్తగా పాదాలు మొద్దుబారడం, తిమ్మిర్లు రావడం లేదా మంటగా అనిపించడం 
→ పాదం చల్లగా ఉండటం, రక్తనాళాల స్పందన తెలియకపోవడం.

డయాబెటిస్‌ ఉన్నవారి పాదంపై పుండు ఏర్పడితే అది అత్యవసరంగా వైద్య చికిత్స అందించాల్సిన పరిస్థితి.  ఈ విషయంలోఎంత త్వరగా చికిత్స మొదలుపెడితే అంత మెరుగైన ఫలితాలు ఉంటాయి.            

డాక్టర్‌ నరేంద్రనాధ్‌ మేడ వాస్క్యులర్‌ 
– ఎండోవాస్క్యులర్‌ సర్జన్ 

 నిర్వహణ: యాసీన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement