గుండెకు సంబంధించిన సమస్య అంటే ముందుగా గుర్తొచ్చేది ఛాతీనొప్పి. అయితే ప్రతిసారీ గుండె సమస్యలు ఛాతీనొప్పితోనే బయటపడవని కార్డియాలజిస్టులు చెబుతున్నారు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, అసాధారణ అలసట, చెమట, వికారం, తల తిరగడం, చేయి లేదా దవడలో అసౌకర్యం వంటి లక్షణాలు కూడా గుండె సంబంధిత సమస్యలకు సంకేతాలు కావచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. వీటిని చాలామంది అజీర్ణం, అలసట లేదా శారీరక సామర్థ్యం తగ్గడంగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఛాతీనొప్పి లేకున్నా జాగ్రత్త
మనం ఇంతకుముందు సులభంగా చేసిన పనులు ఇప్పుడు చేసే సమయంలో ఊపిరి తీసుకోవడం కష్టంగా మారితే దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా కొద్దిదూరం నడవడం లేదా మెట్లు ఎక్కడం వంటి సాధారణ పనులకే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైతే వైద్యుల సలహా అవసరం. ఊపిరి అందకపోవడంతో పాటు ఛాతీలో ఇబ్బందిగా అనిపించడం, తల తిరగడం, చెమటలు పట్టడం లేదా అసాధారణ బలహీనంగా అనిపిస్తే మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తుంటారు.
నొప్పి ఎక్కడైనా కనిపించొచ్చు
గుండెకు సంబంధించిన అసౌకర్యం ఛాతీకే పరిమితం కావాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు అంటారు. చేయి, భుజం, వీపు, మెడ లేదా దవడ ప్రాంతాల్లో నొప్పి, ఒత్తిడి లేదా అసౌకర్యం కూడా కనిపించవచ్చు. కొందరిలో తీవ్రమైన ఛాతీనొప్పికి బదులుగా వికారం, చెమటలు లేదా తేలికగా తల తిరిగినట్లు అనిపించవచ్చు. ప్రతి వ్యక్తిలో లక్షణాలు ఒకేలా ఉండకపోవడంతో ఒక్క నిర్దిష్ట లక్షణం అనుకోవడం సరైనది కాదని నిపుణులు వివరిస్తున్నారు.
స్వల్పంగా మొదలైనా నిర్లక్ష్యం వద్దు
కొన్నిసార్లు గుండె సమస్యల లక్షణాలు ప్రారంభంలో చాలా స్వల్పంగానే ఉండవచ్చు. కొద్దిపాటి అసౌకర్యం, సాధారణం కంటే అధిక అలసట లేదా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కనిపించినా అది కొద్దిసేపటికి తగ్గిపోతుందని భావించే అవకాశం ఉంది. అయితే కొత్తగా కనిపించే లేదా సాధారణ స్థితికి భిన్నంగా ఉన్న లక్షణాలను గమనించడం ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. ఒక్కోసారి ఇలాంటి లక్షణాలకు గుండెతో సంబంధం లేకపోవచ్చు. కానీ అవి అకస్మాత్తుగా, కారణం తెలియకుండా కనిపిస్తే వైద్యుల సలహా తీసుకోవాలి.
మధుమేహం.. బీపీతో ముప్పు
మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ధూమపానం, ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం గుండె జబ్బులకు దారితీసే ప్రమాద కారకాలని వైద్యులు తెలిపారు. ఒత్తిడి కూడా ముఖ్యమైన అంశమేనన్నారు. ప్రస్తుతం చిన్న వయసులోనే పోటీ, ఒత్తిడి పెరగడంతో పాటు నిద్ర తగ్గిపోతోందని పేర్కొన్నారు. రాత్రివేళ ఫోన్లతో అధిక సమయం గడపడం వల్ల నిద్ర, వ్యాయామం, శరీరానికి విశ్రాంతి కోసం అవసరమైన సమయం తగ్గుతోందని వైద్యులు చెబుతున్నారు. యువతలోనూ గుండెపోటు కేసులు కనిపిస్తున్నందున వయసు తక్కువగా ఉందనే కారణంతో నిర్లక్ష్యం తగదని వైద్యులు అంటున్నారు.
జీవనశైలిలో మార్పులతో..
గుండెపోటు ముప్పు నుంచి తప్పించుకోవాలంటే ముందుగా ధూమపానం అలవాటును పూర్తిగా మానేయాలని వైద్యులు సూచిస్తున్నారు. మధుమేహం, రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ ఉంటే వాటిని నియంత్రణలో ఉంచడంతో పాటు అవసరమైతే వైద్యులు సూచించిన మందులను క్రమం తప్పకుండా తీసుకోవాలని సూచిస్తున్నారు. క్రమమైన శారీరక వ్యాయామం, సమతుల ఆహారం, తగినంత నిద్ర, ఒత్తిడి నియంత్రణ మొదలైనవి గుండె ఆరోగ్యానికి ముఖ్యమన్నారు. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా గుండె సంరక్షణలో భాగమేనని వైద్యులు సూచించారు. శ్వాసలో ఇబ్బంది, అలసట లేదా వికారం మొదలైనవి.. గుండె సమస్యలకు సంకేతం కాకపోయినా.. అకస్మాత్తుగా, కారణం తెలియకుండా లేదా సాధారణానికి భిన్నంగా కనిపించే ఈ లక్షణాలను ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: అద్దెకు ‘ఆ నలుగురు’... ఇది ‘చివరి స్టార్టప్’


