60 శాతం మందిలో బీ12 లోపం
83 శాతం మందిలో డీ విటమిన్ సమస్య
కూర్చున్న చోటే పని, ఫాస్ట్ ఫుడ్, రాత్రి షిఫ్ట్‌లే కారణం
ఇండియా వర్క్‌ఫోర్స్ హెల్త్ ఇండెక్స్– 2026 నివేదిక
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. రూ.లక్షల్లో వేతనం.. నగర జీవనం.. బయటకు చూడటానికి నగర ఉద్యోగుల జీవితం రంగులమయంగా కనిపిస్తుంది. కానీ.. లోన మాత్రం గుండె మెల్లమెల్లగా దెబ్బతింటోదట! హైదరాబాద్ ఉద్యోగుల్లో సగం మందికి గుండె జబ్బుల ముప్పు ఉందని లూప్ హెల్త్ సంస్థ విడుదల చేసిన ‘ఇండియా వర్క్‌ఫోర్స్ హెల్త్ ఇండెక్స్–2026’ నివేదిక వెల్లడించింది. వివిధ కంపెనీల్లో పనిచేసే 936 మంది ఉద్యోగులను సర్వే చేయగా, 702 మంది రక్త పరీక్ష రిపోర్టులను పరిశీలించగా.. విస్తుపోయే అంశాలు బయటపడినట్లు పేర్కొంది.
పరీక్షల్లో తేలిన వాస్తవాలిలా..
అధ్యయనంలో 50.6శాతం మందికి హెచ్‌డీఎల్ (హైడెన్సిటీ లిపో ప్రొటీన్) కొలె్రస్టాల్ ఉందని తేలింది. 389 మందికి లిపిడ్ పరీక్షలు చేయగా, 197 మందికి హెచ్‌డీఎల్ కొలె్రస్టాల్ 40 మిల్లీగ్రామ్‌ల కంటే తక్కువ ఉందని గుర్తించారు. అంటే మంచి కొలె్రస్టాల్ తక్కువ.. చెడు కొలె్రస్టాల్ ఎక్కువ. ఈ అంశంలో ఐదు మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే అత్యధికం. పుణె 47.8 శాతం, ముంబై 46.3 శాతం, బెంగళూరు 41.8 శాతం, ఢిల్లీ 39.1 శాతంతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
నగరంలో 426 మందికి హెచ్‌బీఏ1సీ పరీక్షలు చేయగా, 39.2శాతం మంది ప్రీ–డయాబెటిస్ లేదా డయాబెటిస్ స్థాయిలో ఉన్నారు. అంటే ఐదింటిలో ఇద్దరికి మధుమేహం ముప్పు పొంచి ఉంది. ఇక 421 మందిని పరీక్షించగా.. 60.3శాతం మందికి విటమిన్ బీ12 లోపం ఉన్నట్లు తేల్చారు. 42 శాతం మంది మహిళల్లో హిమోగ్లోబిన్ తక్కువగా ఉండి.. రక్త హీనత కనిపిస్తోంది.
ఇదీ చదవండి: పిల్లలు ఎత్తు పెరగాలంటే.. ఈ విషయాలు తెలుసుకోండి!
కారణాలేమిటి?
నివేదిక ప్రకారం హైదరాబాద్ ఉద్యోగులు 5 మెట్రో నగరాలతో పోలిస్తే అత్యల్పంగా నికోటిన్, కెఫిన్ తీసుకుంటున్నారు. అయినా లిపిడ్ ప్రొఫైల్ దెబ్బతిన్నది. కూర్చొని పని చేయడం, బిర్యానీ, ఫాస్ట్‌ఫుడ్, రాత్రి షిఫ్టులు, వ్యాయామం లేకపోవడం ఇందుకు కారణాలుగా వెల్లడించారు. కాగా 30 నుంచి 40 ఏళ్లకే గుండె, షుగర్ జబ్బులు వస్తుండటంతో ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.


